దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన గూఢచర్యం కేసు (Defence Espionage Case)లో కెనడాకు చెందిన ఓ వ్యాపారవేత్తను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) అరెస్టు చేసింది. 2019లో కెనడాలో శాశ్వత నివాస హోదా (PR) పొందిన వ్యాపారవేత్త రాహుల్ గంగల్‌ను సోమవారం దిల్లీలో అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు తాజాగా వెల్లడించారు. సీబీఐ ప్రత్యేక కోర్టు అతడిని నాలుగు రోజుల కస్టడీకి పంపినట్లు తెలిపారు. ఇదే కేసులో.. దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సేకరించి, విదేశీ నిఘా సంస్థలకు అందజేస్తున్న ఫ్రీలాన్స్ జర్నలిస్టు వివేక్ రఘువంశీ, నౌకాదళ మాజీ కమాండర్ ఆశిష్ పాఠక్‌లను సీబీఐ ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే.సీబీఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ విదేశీ వార్తాసంస్థ వెబ్‌సైట్‌కు వివేక్ రఘువంశీ భారత రక్షణ వ్యవహారాల ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. అతడు కొంతకాలంగా దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన రహస్య సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ విషయంలో ఆశిష్ పాఠక్ అతడికి సహకారం అందిస్తున్నారు. దీనిపై సీబీఐ గతేడాది డిసెంబరులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అప్పట్నుంచి వారిపై నిఘా ఉంచింది. మే నెలలో వారి ఇళ్లలో సోదాలు నిర్వహించగా.. విదేశీ సంస్థలతో రఘువంశీ చేసుకున్న ఒప్పందాలు బహిర్గతమైనట్లు అధికారులు పేర్కొన్నారు. విదేశీ సంస్థల నుంచి రఘువంశీ కుటుంబానికి పెద్ద ఎత్తున డబ్బు అందినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే రఘువంశీ, పాఠక్‌లను అరెస్టు చేశారు.రఘువంశీ, పాఠక్‌లు.. ‘అధికారిక రహస్యాల చట్టం’ ఉల్లంఘన, తదితర నేరాలకు పాల్పడినట్లు గత నెలలో దాఖలు చేసిన ఛార్జిషీటులో సీబీఐ అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న కెనడా వ్యాపారవేత్త రాహుల్ గంగల్ ఇటీవల దిల్లీకి వచ్చినట్లు సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు.. ఆయన బస చేసిన ప్రదేశానికి చేరుకుని అరెస్టు చేశారు.