Business

ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు-TNI నేటి వాణిజ్య వార్తలు

ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు-TNI నేటి వాణిజ్య వార్తలు

ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. అంతకుముందు సెషన్‌లో లాభాలను చూసిన సూచీలు మంగళవారం ట్రేడింగ్‌లో రోజంతా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతు ఉన్నప్పటికీ ప్రపంచ ఆర్థిక వృద్ధిపై మదుపర్లు అప్రమత్తంగా ఉండటం, దేశీయంగా ఈక్విటీల్లో విదేశీ మదుపర్లు నిధుల ఉపసంహరణ పరిణామాల మధ్య మార్కెట్లు బలహీనపడ్డాయి. వీటికి తోడు కీలక ఐటీ రంగంలో అమ్మకాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 3.94 పాయింట్లు మాత్రమే లాభపడి 65,220 వద్ద, నిఫ్టీ 2.85 పాయింట్లు పెరిగి 19,396 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎన్‌టీపీసీ, ఎంఅండ్ఎం, విప్రో, టాటా స్టీల్, ఎల్అండ్‌టీ, యాక్సిస్ బ్యాంక్ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి.జియో ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్‌బీఐ, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83 వద్ద ఉంది. సోమవారం స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయిన జియో ఫైనాన్షియల్ షేర్లు వరుసగా రెండో రోజూ లోయర్ సర్క్యూట్‌ను తాకింది. మార్కెట్లు ముగిసే సమయానికి కంపెనీ షేర్ ధర 4.99 శాతం పతనంతో రూ. 239.20 వద్ద ముగిసింది.

ఎల‌న్ మ‌స్క్ ఓ ఆఫ‌ర్

ఎక్స్ సోష‌ల్ మీడియా సంస్థ ఓన‌ర్ ఎల‌న్ మ‌స్క్(Elon Musk) ఇవాళ ఓ కీల‌క ప్ర‌ట‌క‌న చేశారు. ఆదాయం గురించి ఆలోచించే జ‌ర్న‌లిస్టుల‌కు ఆయ‌న ఓ ఆఫ‌ర్ ఇచ్చారు. త‌మ స్టోరీల‌ను నేరుగా ఎక్స్ మీడియా అకౌంట్‌లో ప‌బ్లిష్ చేయాల‌ని ఆయ‌న జ‌ర్న‌లిస్టుల్ని కోరారు. అలాంటి జ‌ర్న‌లిస్టుల‌కు ఆదాయం అధిక స్థాయిలో ఉంటుంద‌ని, మ‌రింత స్వేచ్ఛ‌తో క‌థ‌ల‌ను రాసుకోవ‌చ్చన్నారు. ఎల‌న్ మ‌స్క్ త‌న ఎక్స్ అకౌంట్‌లో ఇవాళ దీనిపై ఓ పోస్టు పెట్టారు.మీడియా ప‌బ్లిష‌ర్స్‌కు కూడా మ‌స్క్ ఇటీవ‌ల ఓ ప్లాన్ ప్ర‌క‌టించారు. క‌థ‌నాల‌ను ప‌బ్లిష్ చేసే సంస్థ‌లు.. వాటిని చ‌దివే యూజ‌ర్ల నుంచి ఛార్జీలు వసూల్ చేయాల‌ని ఆయ‌న సూచించారు. వార్తా క‌థ‌నాల‌ ఆధారంగా యూజ‌ర్ల నుంచి ఛార్జీల‌ను వ‌సూల్ చేయాల‌ని, ఒక‌వేళ యూజ‌ర్లు సైన‌ప్ చేయ‌కుంటే, వారి నుంచి మ‌రింత అధికంగా ఛార్జీ వ‌సూల్ చేయాల‌ని మ‌స్క్ సూచించారు.

ఉల్లిపై ధరపై ప్రభుత్వం అలర్ట్‌

రిటైల్ మార్కెట్‌లో టమాటా ధరలు తగ్గనంత వరకు ప్రభుత్వం తరపున తక్కువ ధరలకు టమాటా విక్రయాలు కొనసాగిస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్ ద్వారా ప్రభుత్వం కిలో 40 రూపాయల సబ్సిడీపై టమాట విక్రయిస్తోంది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా రిటైల్ మార్కెట్‌లో టమాటా ధరలు కిలో రూ.50-70కి తగ్గాయని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ పీటీఐకి తెలిపారు. కానీ టమోటా ధరలు సాధారణ స్థాయికి రాని వరకు, ప్రభుత్వం టమాటాను చౌక ధరలకు విక్రయిస్తుందని ఆయన అన్నారు.. వాస్తవానికి జూన్ నుంచి అకాల వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా టమోటాల ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఇది జూలై-ఆగస్టులో కిలో రూ.250కి పెరిగింది. మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కొత్త పంట రాక పెరగడం వల్ల ధరలు తగ్గుముఖం పట్టాయని రోహిత్ కుమార్ సింగ్ అన్నారు.ఉల్లి ధరలు కూడా ప్రభుత్వానికి తలనొప్పిని పెంచాయి. ఈ నేపథ్యంలో ఉల్లి ఎగుమతులపై ప్రభుత్వం 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించడంతో దేశీయ మార్కెట్‌లో సరఫరా పెరిగి ధరలు పెరగకుండా నిరోధించవచ్చు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రైతులు కూడా వ్యతిరేకిస్తున్నారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో పలు చోట్ల ఉల్లిపై ఎగుమతి సుంకం విధించడాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. ఉల్లిపై ఎగుమతి సుంకం విధింపు నిర్ణయాన్ని సమర్థిస్తూ.. దేశీయంగా లభ్యత పెంచేందుకు, ధరలను అదుపు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు.

ధరలు పెంచిన హోండా కార్స్ ఇండియా

పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా ధరలు పెంచనున్నట్టు మంగళవారం ప్రకటించింది. సెప్టెంబర్ నుంచి సవరించిన ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. గత కొంతకాలంగా వాహనాల తయారీలో కీలకమైన విడిభాగాలు, ఇతర ఖర్చుల భారాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం. అయితే, ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల మధ్య ఇన్‌పుట్ ఖర్చుల భారంలో కొంత భాగమైనా వినియోగదారులకు బదిలీ చేయక తప్పడం లేదని కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్-ప్రెసిడెంట్ కునాల్ బెహల్ అన్నారు.వచ్చే నెల నుంచి వర్తించే కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని హోండా సిటీ, అమేజ్ మోడల్ కార్ల ధరల సవరణ వివరాలను వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతానికి హోండా కాంపాక్ట్ సెడాన్ మోడల్ అమేజ్ ధర రూ. 7.05 లక్షల నుంచి ప్రారంభమవుతుందని, మిడ్-సైజ్ సెడాన్ సిటీ కారు రూ. 11.57 లక్షల ధరలో అందుబాటులో ఉందని కంపెనీ వివరించింది. ఇక, హైబ్రిడ్ మోడల్ సిటీ ఈ-హెచ్ఈవీ ప్రారంభ ధర రూ. 18.89 లక్షల నుంచి మొదలవుతుంది.

గంజాయి రవాణాకు నైజీరియన్ల కొత్త ఎత్తుగడ

గంజాయి రవాణాకు నైజీరియన్ల కొత్త ఎత్తుగడ ఎన్నుకున్నారు. వ్యాపారం పేరుతో నైజీరియన్లు యువతులను ఆకర్షిస్తున్నారు. వ్యాపారంలో లాభాలు వచ్చాయంటూ బురిడీ కొట్టించారు. నైజీరియాకి వచ్చి లాభాలు తీసుకెళ్లాలంటూ ఆశ పెడుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన యువతిని పిలిచిన నైజీరియన్లు… వారం రోజులపాటు యువతితో మకాం పెట్టారు. తిరిగి వెళ్లేముందు సూట్‌కేసును అప్పగించి డెలివరీ చేయాలని ఆదేశించారు. పదిసార్లు నైజీరియన్‌కు వెళ్లి సూట్‌కేసు తీసుకొచ్చిన మహిళ… ఇటీవల కస్టమ్స్‌ తనిఖీల్లో సూట్‌కేసుతో పట్టుబడింది. సూట్‌ కేసులో పెద్దమొత్తంలో డ్రగ్స్‌ను గుర్తించిన కస్టమ్స్‌ తనకు తెలియకుండా డ్రగ్స్‌ సరఫరా చేయించారంటూ ఫిర్యాదు.

* ఆహార పదార్థాల ధ‌ర‌ల మంటపై ఆర్ధిక మంత్రిత్వ శాఖ వార్నింగ్‌

కూర‌గాయ‌లు, ప‌ప్పు ధాన్యాలు, నూనెలు, ఉల్లి ఇలా ఏ నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల‌ను (Higher Inflation) క‌దిలించినా మోతెక్కుతున్నాయి. జులైలో రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం ఏకంగా 15 నెల‌ల గ‌రిష్ట స్ధాయిలో 7.4 శాతానికి చేరింద‌ని ఆర్ధిక మంత్రిత్వ శాఖ తాజా నివేదిక స్ప‌ష్టం చేసింది. రాబోయే కొద్దినెల‌ల్లో ధ‌ర‌ల సూచీ మ‌రింత పైకి ఎగబాకుతుంద‌ని ఈ నివేదిక బాంబు పేల్చింది.ధ‌ర‌ల మంట‌తో ప్ర‌భుత్వం, ఆర్‌బీఐ దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగాల‌ని ఈ నివేదిక స్ప‌ష్టం చేసింది. రాబోయే రోజుల్లో దేశీ వినిమ‌యంతో పాటు పెట్టుబ‌డుల డిమాండ్ వృద్ధి చెంద‌డం కొన‌సాగుతుంద‌ని, వీటితో పాటు ప్రాంతీయ అనిశ్చితులు , ద్ర‌వ్యోల్బ‌ణ ఒత్తిళ్ల‌ను పెంచుతాయ‌ని నివేదిక పేర్కొంది. మ‌రోవైపు ఆగ‌స్ట్‌లో ఇప్ప‌టివ‌ర‌కూ లోటు వ‌ర్ష‌పాతం న‌మోద‌వ‌డంతో తాజా నిల్వ‌లు వ‌చ్చే వ‌ర‌కూ ఆహార ద్ర‌వ్యోల్బ‌ణం పెరుగుతుంద‌ని నివేదిక అంచ‌నా వేసింది.రాబోయే కొద్ది నెల‌ల్లో రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం అధికంగా కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. అయితే ట‌మాటా, ఉల్లి స‌హా ప‌లు కూర‌గాయ‌ల ధ‌ర‌లు కొద్దిగా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో రాబోయే రోజుల్లో ఆహార ద్ర‌వ్యోల్బ‌ణం త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని ఈ నివేదిక పేర్కొన‌డం కొంత ఊర‌ట క‌లిగిస్తోంది.

నేడు గ్యాస్ సిలిండర్ ధరలు

నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తారీకున సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19కేజీల గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించి కాస్త ఊరటనిచ్చినప్పటికీ.. గృహ వినియోగ సిలిండర్ రేట్లలో ఎలాంటి మార్పులు జరగలేదు. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్: రూ. 1, 155,వరంగల్: రూ. 1,174,విశాఖపట్నం: రూ. 1,112,విజయవాడ: రూ. 1,118,గుంటూర్: రూ. 1,114

*  అల్ట్రా వయొలెట్ ఎఫ్​77 స్పేస్ సోమవారం  ప్రారంభించబడింది

ఎలక్ట్రిక్ టూవీలర్​ మేకర్​ అల్ట్రావయొలెట్ ఆటోమోటివ్ ఎఫ్​77 స్పేస్ ఎడిషన్‌‌‌‌ ను సోమవారం లాంచ్​ చేసింది. ఈ  ఎలక్ట్రిక్  మోటార్‌‌‌‌సైకిల్ ధర రూ.5.60 లక్షలు (ఎక్స్-షోరూమ్ ధర).  బండిని ఒక్కసారి చార్జ్​ చేస్తే 307 కి.మీ. వెళ్తుంది.  దీనికి 39.94 బీహెచ్​పీని, 100 ఎన్​ఎం టార్క్​ను ఇచ్చే మోటార్​ను అమర్చారు.కేవలం 2.9 సెకన్లలో  60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మ్యాగ్జిమమ్ ​స్పీడ్ ​152  కిలోమీటర్లని కంపెనీ తెలిపింది. 

నేడు పెరిగిన బంగారం ధరలు

నేడు బంగారం ధరలు పెరిగాయి. మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన మహిళలు బంగారం కొంటుంటారు. తగ్గిన ధరలను చూసి బంగారాన్ని కొనడానికి మక్కువ చూపిస్తున్నారు. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.50 కు పెరిగి రూ.54,150 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.50 కు పెరిగి రూ. రూ.59,070 గా ఉంది.నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే,22 క్యారెట్ల బంగారం ధర – రూ 54,150,24 క్యారెట్ల బంగారం ధర – రూ 59,070.నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే,22 క్యారెట్ల బంగారం ధర – రూ 54,150,24 క్యారెట్ల బంగారం ధర – రూ 59,070.