DailyDose

బాలికపై గంజాయి బ్యాచ్‌ కత్తులతో బెదిరించి అత్యాచారం-TNI నేటి నేర వార్తలు

బాలికపై గంజాయి బ్యాచ్‌ కత్తులతో బెదిరించి అత్యాచారం-TNI నేటి నేర వార్తలు

*  బాలికపై గంజాయి బ్యాచ్‌ కత్తులతో బెదిరించి అత్యాచారం

హైదరాబాద్‌‌‌‌లోని మీర్ పేటలో దారుణం జరిగింది. గంజాయి మత్తులో ఉన్న ముగ్గురు యువకులు కత్తులతో బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం మీర్ పేట పరిధిలోని తన సోదరి ఇంటికి తమ్ముడితో కలిసి బాధిత బాలిక వచ్చింది. అదేరోజు స్థానిక యువకుడు ఆమెపై లైంగిక వేధింపులకు ప్రయత్నించడంతో అడ్డుకుంది. దీంతో అతడు మరో ఏడుగురితో కలిసి సోమవారం ఉదయం బాలిక సోదరి ఇంట్లోకి కత్తులతో వచ్చి బెదిరించాడు.గంజాయి మత్తులో ఉన్న దుండగులు ఇంట్లోని వారిపై దాడి చేశారు. ఆ తర్వాత ముగ్గురు యువకులు బాలికపై అత్యాచారం చేశారు. ఆమె తమ్ముడి ముందే ఈ దారుణానికి పాల్పడ్డారు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని రాచకొండ సీపీ చౌహాన్ పరిశీలించారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు.

న‌టుడు ప్ర‌కాశ్ రాజ్‌పై  క‌ర్నాట‌క‌లో కేసు

చంద్ర‌యాన్‌-3 మిష‌న్‌పై కామెంట్ చేసిన సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్‌(Prakash Raj)పై క‌ర్నాట‌క‌లో కేసు న‌మోదు చేశారు. భ‌గ‌ల్‌కోట్ జిల్లాలోని బాన‌హ‌ట్టి పోలీసు స్టేష‌న్‌లో కేసు ఫైల్ చేశారు. హిందూ సంఘాల నేత‌లు ఆ కేసు బుక్ చేశారు. న‌టుడు ప్ర‌కాశ్‌పై చర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశాయి. చంద్ర‌యాన్‌-3కి చెందిన ల్యాండ‌ర్ విక్ర‌మ్ .. రేపు సాయంత్రం చంద్రుడి ఉప‌రిత‌లంపై దిగ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ఆదివారం చేసిన ఓ ట్వీట్ వివాదాస్ప‌ద‌మైంది. ఓ కార్టూన్‌ను అత‌ను పోస్టు చేశాడు. లుంగి క‌ట్టుకున్న ఓ వ్య‌క్తి.. టీ పోస్తున్న‌ట్లు ఆ కార్టూన్‌లో ఉంది. చంద్రుడి నుంచి వ‌చ్చిన తొలి ఫోటో ఇదే అని ఆ పోస్టులో ప్రకాశ్ రాజ్ కామెంట్ చేశారు. ఈ పోస్టుపై ఆన్‌లైన్‌లో విమ‌ర్శ‌లు కూడా వెల్లువెత్తాయి. చంద్ర‌యాన్‌-3 ప్ర‌యోగాన్ని విమ‌ర్శించ‌డం స‌రికాదు అని నెటిజెన్లు అన్నారు.

హైదరాబాద్ లో దారుణం

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. గంజాయి మత్తులో 16 ఏళ్ల బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. హైదరాబాద్‌ లాల్‌బజార్‌కు చెందిన బాలిక(16) తల్లిదండ్రులిద్దరూ గతంలో చనిపోవడంతో 15 రోజుల క్రితం తన సోదరుడి(14)తో కలిసి మీర్‌పేటలోని ఓ కాలనీకి వచ్చారు. సమీప బంధువైన అక్క దగ్గర ఉంటున్నారు. బాలిక దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. తమ్ముడు ఫ్లెక్సీలు కట్టే పనిచేస్తుంటాడు. సోమవారం ఉదయం 9 గంటలకు బాలిక తన సోదరుడు, మరో ముగ్గురు చిన్నారులతో కలిసి ఇంట్లో ఉన్న సమయంలో ఎనిమిది మంది నిందితులు ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడ్డారు.అప్పటికే గంజాయి మత్తులో ఉన్న ఆ బృందంలోని నలుగురు బాలిక మెడపై కత్తిపెట్టారు. భవనంలోని మూడో అంతస్తులోకి తీసుకెళ్లారు. మిగిలినవారు ఆమె తమ్ముడితోపాటు అక్కడే ఉన్న చిన్నారుల్ని బెదిరించారు. పైకెళ్లిన నిందితుల్లో ముగ్గురు బాలికను కత్తితో బెదిరిస్తూ ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు.  బాలిక గట్టిగా కేకలు వేయడంతో పరారైనట్లు బాలిక బంధువులు తెలిపారు. విషయం తెలిసిన బాధితురాలి సోదరి మీర్‌పేట పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం బాలికను సఖి కేంద్రానికి తరలించారు.

* హైద‌రాబాద్ లోని ఘోర రోడ్డు ప్రమాదం

హైద‌రాబాద్ లోని ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పహాడీషరీఫ్ వద్ద జ‌రిగిన‌ రోడ్డు ప్రమాదంలో ఇద్ద‌రు వ్య‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కుగూడ రహదారిపై ముగ్గురు వ్యక్తులు బైక్ పై వెళ్తుండగా అతివేగంగా వస్తున్న కారు బైక్ ను ఢీకొట్టింది.వివ‌రాల్లోకెళ్తే.. హైదరాబాద్ లోని పహాడీషరీఫ్ వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కుగూడ రోడ్డులో ముగ్గురు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వస్తున్న సమయంలో అతివేగంతో వెళ్తున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. వీరిలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను మార్చురీకి తరలించారు. కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. దీనిపై ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న‌ద‌ని తెలిపారు. ఇదిలావుండ‌గా, అంత‌కుముందు నల్గొండ జిల్లాలోని వేములపల్లి మండలం అనాజీపురం వద్ద సోమవారం తెల్లవారుజామున ద్విచక్రవాహనాన్ని ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. బస్సు టైర్‌ ఒకటి పగిలిపోవడంతో డ్రైవర్‌ వాహనంపై నియంత్రణ కోల్పోయి మోటార్‌ బైక్‌ను ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్యాలగూడ వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ పొలంలో దూసూకెళ్లింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు.కాగా, శనివారం లడఖ్‌లోని లేహ్‌లో జరిగిన ట్రక్కు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఒక సైనికుడు విషాదకరంగా ప్రాణాలు కోల్పోయాడు. భారత ఆర్మీ కాన్వాయ్‌లోని ట్రక్కు లోయలో పడిన దురదృష్టకర సంఘటనలో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం కొద్దర్గు మండలం తిర్మంగోడుపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ శేఖర్ ఒకరు.

లక్షలు పోసి దొంగతనానికి ముహూర్తం

ఈ స్టోరీ వింటే వార్నీ అనుకుంటూ ముక్కున వేలేసుకుంటారు. అలాంటి ఓ విచిత్ర ఘటన ఇది. దొంగలు ఈ మధ్య బాగా తెలివి మీరిపోతున్నారు. దొంగతనానికి ఓ విజనూ… ప్లానూ.. స్కెచ్చూ.. అన్నీ ప్రిపేర్ చేసుకుని మరీ చోరీలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు మనం చదవబోయే ఘటనలో దొంగలు ఇంకో అడుగు ముందుకు వేశారు.కోట్లాది రూ.లు దోచుకోవాలనుకున్నారు. అయితే, అది విజయవంతం కావాలని ముందుగా ఓ పూజారితో ముహూర్తం కూడా పెట్టించారు. అదే ఇక్కడ ట్విస్ట్. దీనికోసం ఆ పూజారికి రూ.8లక్షలు కూడా ముట్టజెప్పారు. కానీ పాపం.. లక్కు హ్యాండిచ్చింది. అదృష్టం కంటే ముందే దురదృష్టదేవత వారి తలుపు తట్టింది.మహారాష్ట్రలోని బారామతిలో కోట్ల విలువైన దోపిడీకి పాల్పడేందుకు ఒక శుభ ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలనుకుందో దొంగల ముఠా. దీనికోసం ఓ జ్యోతిష్యుడిని సంప్రదించి రూ.8 లక్షలు చెల్లించారు. అయితే అదృష్టం కలిసిరాకపోవడంతో చోరీ జరిగిన నాలుగు నెలల తర్వాత దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.76 లక్షల విలువైన బంగారం, నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నాలుగు నెలల క్రితం అంటే ఏప్రిల్ 21న బారామతిలోని దేవకట్‌నగర్ ప్రాంతంలో ఈ దోపిడీ జరిగింది. నిందితులను సచిన్ అశోక్ జగ్ధానే, రైబా తానాజీ చవాన్, రవీంద్ర శివాజీ భోంస్లే, దుర్యోధన్ ధనాజీ జాదవ్, నితిన్ అర్జున్ మోరేగా గుర్తించారు. వీరంతా కూలీలు” అని సీనియర్ పోలీసు అధికారి అంకిత్ గోయల్ అన్నారు.సాగర్ గోఫనే అనే వ్యక్తి ఇంట్లో బంగారం, నగదు, విలువైన వస్తువులు ఉన్నట్లు నిందితులకు సమాచారం అందింది. అనంతరం దోపిడీకి ప్లాన్‌ రచించారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, వారు జ్యోతిష్యుడైన  రామచంద్ర చవాన్‌ను కలిశారు. దొంగతనం కోసం మంచి ముహూర్తం పెట్టమని కోరారు. దీనికోసం అతనికి రూ. 8 లక్షలు చెల్లించారు.అతను పెట్టిన ముహూర్తం ప్రకారం ఏప్రిల్ 21న సాగర్ ఇంట్లో లేని సమయంలో దొంగలు ఇంట్లోకి ప్రవేశించి భార్య త్రిప్తిపై దారుణంగా దాడి చేశారు. నిందితులు ఆమె చేతులు, కాళ్లు కట్టేసి కొట్టి, రూ.95 లక్షల నగదు, రూ.11 లక్షలకుపైగా బంగారం, మొబైల్ ఫోన్లతో ఇంట్లో నుంచి పరారయ్యారు. అలా కోటి రూపాయల విలువైన నగదు, వస్తువులను నిందితులు ఎత్తుకెళ్లారు.దోపిడీ వెలుగులోకి రావడంతో, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కూడా ఘటనపై తక్షణ విచారణకు ఆదేశించారు. అనంతరం సీసీటీవీ ఫుటేజీలు, నిఘా విభాగం సహాయంతో పోలీసులు నిందితులందరినీ వివిధ ప్రాంతాల నుంచి అదుపులోకి తీసుకున్నారు.

*  ఓ చ‌ర్చిలో ప్రార్ధ‌న‌లు జ‌రుగుతుండ‌గా చ‌ర్చ్‌లో దుండ‌గుల విధ్వంసం

దేశ రాజ‌ధాని ఢిల్లీలోని త‌హీర్పూర్ ప్రాంతంలో ఓ చ‌ర్చిలో (church vandalised) ప్రార్ధ‌న‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో చొచ్చుకువ‌చ్చిన దుండ‌గులు విధ్వంసం సృష్టించారు. జియోన్ ప్రార్ధ‌నా మందిరంలోకి ప్ర‌వేశించిన ఓ వ‌ర్గానికి చెందిన వ్య‌క్తులు చ‌ర్చ్‌ను ధ్వంసం చేయ‌డంతో పాటు ప్రార్ధ‌నా మందిరం లోప‌ల నినాదాలు చేశారు.దుండ‌గుల‌పై జీటీబీ ఎన్‌క్లేవ్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేస్తున్న స‌మ‌యంలోనూ కొంద‌రు నినాదాలు చేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి కేసు న‌మోదు చేసిన పోలీసులు ఓ వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు.చ‌ర్చ్ స‌మీపంలోని సీసీటీవీ ఫుట్‌జ్ సాయంతో ఇత‌ర నిందితుల‌ను గుర్తించేందుకు ఢిల్లీ పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఓ వ్య‌క్తికి గాయాల‌య్యాయ‌ని పోలీసులు తెలిపారు. ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌గా చ‌ర్చి ప‌రిస‌ర ప్రాంతాల్లో పెద్ద‌సంఖ్య‌లో పోలీసుల‌ను మోహ‌రించారు.

సెల్‌ఫోన్‌ దొంగిలించాడనే అనుమానంతో యువకుడి దారుణ హత్య

సెల్‌ఫోన్‌ను దొంగిలించాడనే అనుమానంతో ఓ యువకుడిని నలుగురు హత్య చేసిన ఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ. డి.రాధిక తెలిపిన వివరాల ప్రకారం.. బేల మండలంలోని భవానీగూడ(ఈ) గ్రామానికి చెందిన కొడప జీవన్‌(25) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల అతని స్నేహితుడి ఒకరి సెల్‌ఫోన్‌ చోరీకి గురైంది. జీవన్‌పై అనుమానంతో బోరిగాంకు చెందిన లింగ్‌షావ్‌, దుబ్బగూడకు చెందిన భీంరావు కలిసి ఆదివారం సాయంత్రం జీవన్‌ ఇంటికొచ్చారు. కూలి పని ఉందని చెప్పి అతన్ని ద్విచక్ర వాహనంపై మశాల(కె), దుబ్బగూడ(ఎం) మధ్య అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అప్పటికే బోరిగాంకు చెందిన దేవ్‌షావ్‌, శ్రీనివాస్‌ అక్కడ ఉన్నారు. నలుగురూ కలిసి జీవన్‌ను కర్రలతో కొట్టి హతమార్చారు. సెల్‌ఫోన్‌ దొంగిలించాడనే అనుమానంతో నలుగురు కలిసి హత్య చేశారంటూ జీవన్‌ సోదరుడు విజయ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

*  విషాదంగా మారిన విహారయాత్ర

వారాంతపు వినోదం విషాదంగా మారింది. విహారయాత్రకు వచ్చిన ఆరుగురు స్నేహితులు స‌ముంద్రంల‌కి కిట్టుకుపోయారు. ఈ క్ర‌మంలోనే వారిని గుర్తించి అప్ర‌మ‌త్త‌మైన మ‌త్స్య‌కారులు ఐదుగురిని కాపాడారు. వీరిలో ఒక‌రు అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లారు. ఆరో వ్య‌క్తి స‌ముంద్రంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. అత‌ని మృత‌దేహం సముద్రం ఒడ్డుకు కొట్టుకువ‌చ్చింది. ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న వైజాగ్ లో చోటుచేసుకుంది.వివ‌రాల్లోకెళ్తే.. సరదాగా వీకెండ్ కోసం వచ్చిన ఆరుగురు స్నేహితులు సముద్రంలో కొట్టుకుపోయారు. మత్స్యకారులు అప్రమత్తమై ఐదుగురిని రక్షించారు. గల్లంతైన వ్యక్తి మృతదేహం ఆ తర్వాత ఒడ్డుకు కొట్టుకువ‌చ్చింది. మరొకరు అపస్మారక స్థితిలో ఉన్నారు. విశాఖపట్నానికి చెందిన కట్టోజు సాయి (19), కట్టోజు కావ్య (17), సింహాచలానికి చెందిన గన్నవరపు సాయి ప్రియాంక (27), గన్నవరపు రవిశంకర్ (28), అల్లిపురానికి చెందిన కందిపల్లి ఫణీంద్ర (25), కందిపల్లి సాయికిరణ్ (25) కలిసి ఆదివారం ఉదయం అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతాపాలెం బీచ్ కు విహారయాత్రకు వెళ్లారు.అందరూ కలిసి స్నానం చేశారు. ఆ తర్వాత ఒడ్డుకు సమీపంలో ఉన్న రాళ్లపై నిలబడి ఫొటోలు తీస్తుండగా అకస్మాత్తుగా పెద్ద అల వచ్చి వారందరినీ స‌ముద్రంలోకి లాక్కెళ్లిపోయింది. ఇది గ‌మ‌నించి వెంటనే అప్రమత్తమైన మత్స్యకారులు వారిని రక్షించేందుకు సముద్రంలోకి వెళ్లారు. అప్పటికే సాయి కొట్టుకుపోగా మిగిలిన ఐదుగురిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. సముద్రపు నీరు తాగి సాయి ప్రియాంక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అనంతరం అచ్యుతాపురం మండలం పూడిమడక వద్ద సాయి మృతదేహం ఒడ్డుకు చేరింది. కోమాలోకి వెళ్లిన సాయి ప్రియాంక ప్రస్తుతం విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఒడ్డుకు కొట్టుకువ‌చ్చిన సాయి మృతదేహాన్ని వాహనంలో తరలించే ప‌రిస్థితి లేకపోవడంతో అచ్యుతాపురం ఎస్సై సన్యాసినాయుడు ఆధ్వర్యంలో పోలీసులు రెండు కిలోమీటర్లు మోసుకెళ్లి మానవత్వం చాటుకున్నారు. అనంతరం అంబులెన్స్ లో అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు.   ఈ క్రమంలోనే అధికారులు ప్రజలను హెచ్చరించారు. సముంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. 

బైక్‌ ఢీ కొనడంతో పెట్రోల్‌ లీక్‌

బైక్‌ ఢీ కొట్టడంతో బస్సు పూర్తి దగ్ధమవడమే కాకుండా ఓ వ్యక్తి మృతి చెందాడు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలంలోని జీనోమ్ వ్యాలీ ఠాణా పరిధిలో ఈ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని వరదరాజపురానికి చెందిన సంపత్ (26).. యూజే ఫార్ములా కంపెనీలో పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో విధుల నిమిత్తం బైక్‌పై వెళ్తుండగా.. కొల్తూరు వద్ద ప్రధాన రహదారిపై తుర్కపల్లి నుంచి ఎదురుగా వస్తున్న ఓ ఫార్మా కంపెనీకి చెందిన బస్సును ఢీ కొట్టాడు. ఈ ఘటనలో సంపత్‌కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆపై బైక్‌ పెట్రోల్‌ ట్యాంక్‌ లీకై మంటలు చెలరేగి బస్సుకు అంటుకున్నాయి. దీంతో బైక్‌తో పాటు బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదాన్ని గుర్తించి బస్సులోని ప్రయాణికులు వెంటనే కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరరం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. 

హైదరాబాద్ లోని జగద్గిరిగుట్టలో దారుణం

హైదరాబాద్ లోని జగద్గిరిగుట్టలో దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్ నగరంలోని జగద్గిరిగుట్టలో పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బాలుడిని చంపేందుకు ఆటో డ్రైవర్ ప్రయత్నించడం కలకలం రేపింది. హకల్పకాలనీలో ఆడుకుంటూ ఉన్న ఆది (9) అనే బాలుడిని ఆటో డ్రైవర్ గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.బాలుడికి మాయమాటలు చెప్పిన ఆటో డ్రైవర్ తన ఆటోలో ఎక్కించుకున్నాడు. ఆపై పక్క వీధిలోకి తీసుకెళ్లి ఒక్కసారిగా బాలుడిపై విరుచుకుపడ్డారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఆటో డ్రైవర్ బాలుడు గొంతు కోసేసాడు. ప్రస్తుతం బాలుడు పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే స్థానికులు బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఘోరానికి పాల్పడిన ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నాడు. అయితే ఆటో డ్రైవర్ ఓ సైకోగా పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు.