NRI-NRT

ఆ రోజే నన్ను అరెస్ట్ చేస్తారు: ట్రంప్

ఆ రోజే నన్ను అరెస్ట్ చేస్తారు: ట్రంప్

అమెరికా (USA) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump)నకు ఎన్నికల ముందు అరెస్టు భయం వెంటాడుతోంది. తాజాగా ఆయన జార్జియాలో ఎదుర్కొంటున్న ‘ఎన్నికల ఫలితాల్లో జోక్యం’ ఆరోపణలపై లొంగిపోవాల్సి ఉంది. ఇప్పటికే ఆయన స్వయంగా ఫుల్టన్‌ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయి రెండు లక్షల డాలర్ల విలువైన బాండ్‌ను సమర్పించి బెయిల్‌ తీసుకొనేందుకు అట్లాంటా ఫుల్టన్‌ కౌంటీ డిస్ట్రిక్ట్‌ అటార్ని ఫాని విల్లీస్‌ అనుమతించారు. ట్రంప్‌ ఈ బెయిల్‌ పొందాక సాక్షులను ప్రభావితం చేయనంతవరకు స్వేచ్ఛగా ఉండవచ్చు. ట్రంప్‌పై.. వ్యవస్థీకృతంగా పనిచేయడం, తప్పుడు ప్రకటనలు ఇవ్వడం వంటి 13 ఆరోపణలున్నాయి.

‘‘నేను జార్జియాలోని అట్లాంటాకు గురువారం వెళతాను. అక్కడ రాడికల్‌ వామపక్ష డిస్ట్రిక్ట్‌ అటార్ని ఫాని విల్లీస్‌ నన్ను అరెస్టు చేస్తారు ’’ అని ట్రంప్‌ తన సొంత సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్రూత్‌లో వెల్లడించారు. ఫాని విల్లీస్‌ దీనిని ప్రచారం చేసుకుని.. డబ్బు పోగుచేస్తున్నారని పేర్కొన్నారు. దీనిని మొత్తం జోబైడెన్‌ ఆధీనంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ సమన్వయం చేస్తోందని ఆరోపించారు. ఈ ఏడాది ట్రంప్‌ ఎదుర్కొంటున్న నాలుగు క్రిమినల్‌ కేసుల్లో ఇది ఒకటి. గత కేసుల్లో కూడా ఆయన బెయిల్‌ పొందారు. ఇప్పటికే ట్రంప్‌పై చట్టపరంగా భారీగా ఆంక్షలున్నాయి.ట్రంపు ఈ ఆరోపణలు మొత్తం పూర్తిగా అవాస్తవాలని అంటున్నారు. పూర్తిగా రాజకీయ దురుద్దేశపూర్వకంగానే వీటిని చేపట్టినట్లు ఆయన చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న వారితో బుధవారం ఫాక్స్‌ న్యూస్‌ నిర్వహించే టీవీ చర్చలో తాను పాల్గొనబోనని ప్రకటించారు. బుధవారమే కాదు ఆపైన జరిగే చర్చల్లోనూ పాల్గొనేది లేదని స్పష్టం చేశారు. రిపబ్లికన్‌ పార్టీ ఓటర్లుగా నమోదైన వారు, తమ పార్టీ తరఫున దేశాధ్యక్ష పదవికి అంతిమ అభ్యర్థి ఎవరో తేల్చడానికి ప్రైమరీ ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రిపబ్లికన్‌ అభ్యర్థులు టీవీ చర్చల్లో పాల్గొని ఎదుటివారి విధానాలకన్నా తమ విధానాలు ఎలా గొప్పవో వివరిస్తారు. రిపబ్లికన్‌ ఓటర్ల మనోగతం తెలిపే వివిధ సర్వేలలో ట్రంప్‌ అందరికన్నా ముందున్నట్లు తేలింది. ఆ తర్వాతి స్థానంలో వివేక్‌ రామస్వామి ఉన్నట్లు బలమైన ప్రచారం జరుగుతోంది.