Business

ఏపీ ప్రభుత్వనికి ఇండిగో షాక్

ఏపీ ప్రభుత్వనికి ఇండిగో షాక్

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోకు వైకాపా ప్రభుత్వం మొండిచేయి చూపింది. ఒప్పందం మేరకు నిధులివ్వకపోవడంతో కడపకు విమాన సర్వీసులు ఆపేస్తామంటూ ఆ సంస్థ టికెట్ల జారీని ఆపేసింది. గతంలో విమానాల రాకపోకలు ఆగిపోవడంతో రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏపీ ఎయిర్‌పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, ఇండిగో మధ్య కుదిరిన ఒప్పందం మేరకు వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) కింద రాష్ట్రప్రభుత్వం ఇండిగో సంస్థకు ఏటా రూ.20 కోట్లు చెల్లిస్తామని ఒప్పందం చేసుకుంది. గతంలో కడపకు విమానాలు నడిపిన ట్రూజెట్‌ సంస్థ.. తర్వాత సర్వీసులు ఆపేసింది. దీంతో ఆరు నెలలకు పైగా విమానాల రాకపోకలు ఆగిపోయాయి. ఈ సమస్యపై 2021 అక్టోబరు 11న సీఎం జగన్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. అందరికీ విమానయానం అందుబాటులో ఉండాలనే తెదేపా హయాంలో ఉడాన్‌ పథకం కింద టైర్‌-2, 3 నగరాల మధ్య విమాన సర్వీసులను ఏర్పాటుచేశామని, కడప నుంచి హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై, బెంగళూరుకు నేరుగా విమానాలు నడిచాయని లేఖలో ప్రస్తావించారు. అనంతరం ఇండిగోతో చర్చలు జరిపి ఒప్పందం చేసుకోగా 2022 మార్చి 27 నుంచి విజయవాడ, హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం నగరాలకు విమానాలను నడిపింది. కానీ, ప్రభుత్వం వీజీఎఫ్‌ చెల్లించకపోవడంతో పలుమార్లు ఇండిగో సంస్థ లేఖలు రాసింది. స్పందన లేకపోవడంతో సెప్టెంబరు 1 తర్వాత కడప నుంచి విమాన సర్వీసుల్ని ఆపేయాలని నిర్ణయం తీసుకుని, ఆన్‌లైన్‌లో టికెట్ల జారీని నిలిపివేసింది. వైయస్‌ఆర్‌ జిల్లా కలెక్టరు విజయరామరాజును తాజాగా ఇండిగో సంస్థ ప్రతినిధులు కలిసి సమస్యను విన్నవించారు. త్వరలోనే నిధుల విడుదలకు చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా సెప్టెంబరు 15 వరకే ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందని ఇండిగో ప్రతినిధులు తెలిపారు.

ఉడాన్‌ ఆపేయడంతో..: చిన్న పట్టణాలకు విమాన సర్వీసులు నడిపేందుకు ప్రోత్సాహకాలు ఇచ్చేలా ‘ప్రాంతీయ విమాన అనుసంధాన పథకం-ఉడాన్‌’ను కేంద్రం ప్రవేశపెట్టింది. విమానయాన సంస్థలకు నష్టం వస్తే ఆదుకునే నిధిని ఏర్పాటుచేసింది. ఇప్పుడా పథకాన్ని కేంద్రం ఆపేయడంతో ఇండిగో కడప సర్వీసులపై నష్టం భారం పెరిగింది.