Health

యాలకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

యాలకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

సన్నగా నాజూగ్గా ఉండాలనుకుంటున్నారా? కొవ్వు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? దీనికి యాలకులు మంచి ఎంపిక అంటున్నది ఓ కొత్త పరిశోధన. యాలకులను భోజనంలో భాగం చేసుకుంటే ఆకలి పెరగడం, కొవ్వు తగ్గడం, ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గడం లాంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయట. యూకలిప్టస్‌, పుదీనా, మిరియాలు కలగలిసిన సువాసన ఉండే యాలకులు ఒక్క భారతదేశమే కాదు.. ప్రపంచం అంతటా ఆదరణ పొందిన మసాలా దినుసు. ఈ అధ్యయనాన్ని టెక్సాస్‌ కాలేజ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ లైఫ్‌ సైన్సెస్‌కు చెందిన పరిశోధకులు జరిపారు. అంతిమంగా యాలకులను ‘సూపర్‌ ఫుడ్‌’గా తేల్చారు.

“ఈ చిన్ని సుగంధద్రవ్యం శరీరంలో కేలరీలను కరిగించి, బరువును క్రమబద్ధం చేస్తుంది. అదే సమయంలో ఆకలిని, తినే ఆహారం మోతాదును పెంచు తుందని మేం కనుగొన్నాం” అంటారు పరిశోధనలో ముఖ్యపాత్ర పోషించిన లూయీస్‌ సిజ్‌నరోస్‌ జెవెలస్‌. ఈ అధ్యయనం ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ మాలిక్యులర్‌ సైన్సెస్‌లో ప్రచురితమైంది. ఎంపికచేసిన జంతువులకు యాలకులను ఆహారంగా ఇచ్చి పరీక్షించారు నిపుణులు. నిర్ణీత వ్యవధి తర్వాత వాటిలో సానుకూల మార్పు వచ్చింది. మనం రోజుకు 10 యాలకులను ఆహారంలో భాగం చేసుకోవచ్చు.