* ఇండిగో విమానంలో ప్రయాణికుడు రక్తపు వాంతులు
విమానంలో గాలిలో ఉండగానే ప్రయాణికుడు రక్తపు వాంతులు చేసుకొని మృతి చెందాడు. ఈ షాకింగ్ ఘటన ముంబయి నుంచి రాంచీ వెళ్తున్న ఇండిగో విమానంలో చోటు చేసుకున్నది. ఈ ఘటనలో విమానాన్ని నాగ్‌పూర్‌లోని బాబా సాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. సమాచారం ప్రకారం.. మరణించిన ప్రయాణికుడు సోమవారం రాత్రి 8 గంటలకు ముంబయి నుంచి రాంచీకి ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్నాడు. విమానం గాలిలో ఉన్న సమయంలో రక్తంతో వాంతులు చేసుకున్నాడు. దీన్ని గమనించిన సిబ్బంది పైలట్‌కు సమాచారం ఇచ్చారు.ఆ తర్వాత పైలట్ ఉన్నతాధికారులను సంప్రదించి విమానాన్ని నాగ్‌పూర్‌కు మళ్లించాడు. అక్కడ అత్యవసర ల్యాండింగ్ చేసి.. సదరు ప్రయాణికుడి నాగ్‌పూర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. అయితే, అప్పటికే సదరు ప్రయాణికుడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే, ముంబయి నుంచి రాంచీకి వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ 6E 5093 విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా నాగ్‌పూర్‌కు మళ్లించారని, వాంతులు చేసుకున్న ప్రయాణికుడిని వెంటనే వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. మృతి చెందినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో ఎయిర్‌లైన్స్ పేర్కొంది. అయితే, సదరు ప్రయాణికుడి మృతి కారణాలు తెలియరాలేదని, పోస్ట్‌మార్టం నివేదిక తర్వాతనే కారణాలు తెలుస్తాయని అధికార వర్గాలు తెలిపాయి.
* కాలిఫోర్నియాలో కంపించిన భూమి
అమెరికాలోని కాలిఫోర్నియా దక్షిణ ప్రాంతంపై ఓ వైపు హిల్లరీ తుఫాను విరుచుకుపడుతుంటే.. మరోవైపు భూకంపం కూడా సంభవించింది. ఆదివారం రోజు మొదటిసారి 5.1 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయని అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. ఇంకోసారి 3.1, 3.6 తీవ్రతలతో మరో రెండు ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. వెంచూరా, శాంటా బార్బర మధ్య ఒజైలో వద్ద భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. లాస్ ఏంజెలెస్ సమీప ప్రాంతాల ప్రజలు కూడా ఈ భూప్రకంపనలను ఫీల్ అయ్యారు.మరోవైపు హిల్లరీ తుఫాను ప్రభావంతో దక్షిణ కాలిఫోర్నియాలోని చాలాచోట్ల కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గత 84 ఏళ్లలో ఎన్నడూ కాలిఫోర్నియా రాష్ట్రంలో ఈ స్థాయిలో తుఫాను సంభవించలేదని వాతావరణ విభాగం తెలిపింది. తుఫాను ధాటికి లాస్ ఏంజెలెస్ పరిధిలోని ఎడారి ప్రాంతాలైన డెత్‌వ్యాలీ, పామ్ స్ప్రింగ్స్‌లలోనూ వరదలు పోటెత్తాయి. దీంతో ఆ ప్రాంతాల్లో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రభుత్వ సాయం అందిస్తామని అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. సోమవారం రాత్రికల్లా ఈ తుఫాను ఉత్తర దిశగా కదిలి నెవాడాకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
* చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న కొడాలి నాని
కృష్ణా జిల్లా గుడివాడలో చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని కేక్ కట్ చేశారు. చిరంజీవిని తాను విమర్శించినట్లు నిరూపించాలని కొడాలి నాని ఛాలెంజ్ విసిరారు. ఎవరి జోలికి వెళ్లని చిరంజీవి విమర్శించే సంస్కారహీనుడిని కానన్నారు. డ్యాన్సులు, నటన చేతకాని ఇండస్ట్రీలోని పకోడీ గాళ్లకు చిరంజీవి సలహాలు ఇవ్వాలని అన్నాను..ఈ వ్యాఖ్యలు చిరంజీవి గురించి మాట్లాడినట్లు ఎట్లా అవుతుందని కొడాలి నాని అన్నారు.
* టీటీడీ చైర్మన్ పై బండి సంజయ్ ఫైర్
తిరుపతిలో చిరుతల దాడులు, సంచారం చేయడంతో భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. దీంతో అప్రమత్తం అయిన టీటీడీ నడక మార్గాల్లో చిన్నారులు వెళ్లే సమయాన్ని కుదించింది. దీంతో పాటు భక్తులకు కర్రలు పంపిణీ చేస్తుంది. అదేవిధంగా భక్తుల సామన్లను కూడా టీటీడీ భక్తులకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటుంది. టీటీడీ తీరుపై తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.భక్తులు తిరమలకు రాకుండా చేస్తున్నారని.. భక్తులను కాపాడలేక కర్రలిస్తారా అని ఫైర్ అయ్యారు. వెంకటేశ్వరస్వామిని అవమానిస్తే పుట్టగతులుండవనే సంగతి గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కొత్తగా నియమించిన టీటీడీ చైర్మన్ ఎవరండి ? అంటూ టీటీడీ చైర్మన్ పై కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. వాళ్ళ కూతురు వివాహం ఏ మత సంప్రదాయంగా చేసారండి? టీటీడీ చైర్మన్ ఎన్నికల అఫిడవిట్లో అతను ఏ మతానికి చెందిన వ్యక్తి అని పేర్కొన్నారు అండి?.. తాను నాస్తికుడిని గతంలో ఆయన చెప్పలేదా? రాడికల్ కాదా అంటూ ప్రశ్నలు వర్షం కురిపించారు బండి సంజయ్. సిగ్గులేకుండా తిరుమలతో అడవులున్న విషయం తెలువదని టీటీడీ చైర్మన్ చెబుతున్నాడట. టీటీడీ చైర్మన్ కి పుష్ప సినిమా చూపించాలేమో అని ఎద్దేవా చేశారు బండి సంజయ్.
* ఆదిలాబాద్‌లో ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటుకు అనుమతి
ఆదిలాబాద్‌లో జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (JNTU) ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీచేశారు. కాలేజీలో ఆఫర్ చేయబోయే కోర్సులు, పనిచేసే సిబ్బంది, అవసరమైన బడ్జెట్‌కు సంబంధించిన వివరాలతో కూడిన ఉత్తర్వులను ప్రత్యేకంగా మరోసారి విడుదల చేయనున్నట్లు తెలిపారు.హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్, హైదరాబాద్‌లోని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఈ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటుకు సంబంధించి అవసరమైన తదుపరి చర్యలు తీసుకుంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
* బిజెపి అధ్యక్షుడు సత్యనారాయణ పార్టీ నుంచి సస్పెండ్
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిజెపి అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్ వెంటనే అమలులోకి వస్తుందని ప్రకటించారు. కోనేరు సత్యనారాయణ టిఆర్ఎస్ లో చేరనున్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుతో సమావేశమైన తెలంగాణ బిజెపి విభాగం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని)ని మంగళవారం పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ నిబంధనలను ఉల్లంఘించినందుకు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు చిన్నిని సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ రాష్ట్ర శాఖ ప్రకటించింది.సస్పెన్షన్ తక్షణం అమల్లోకి వస్తుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రమేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బీఆర్‌ఎస్ లో చేరాల్సిందిగా చిన్నిని ముఖ్యమంత్రి ఆహ్వానించడంతో సోమవారం అర్థరాత్రి హైదరాబాద్‌లో ముఖ్యమంత్రిని కలిసారాయన. దీంతో బీజేపీ ఈ చర్య తీసుకుంది.బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు చిన్ని ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది. శుక్రవారం లేదా శనివారం ఆయన బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉంది. చిన్ని 2014లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థిగా కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 2017లో బీజేపీలో చేరారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
* ద్వారకా తిరుమలలో ప్రోటోకాల్ వివాదం
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ప్రోటోకాల్ వివాదం రాజుకుంటుంది. ఆలయ సూపరిండెంటెంట్, ట్రస్ట్ బోర్డు సభ్యురాలుల మధ్య రగడ నెలకొంది. వివరాల్లోకి వెళ్తే తనను ఆలయ సూపరింటెండెంట్ అవమానించారని ట్రస్ట్ బోర్డు సభ్యురాలు ఆరోపించారు. ట్రస్ట్ బోర్డు సభ్యురాలు ముగ్గురు వ్యక్తులను తన సిఫార్సు మేరకు దర్శనానికి పంపించారు. అయితే వారి పట్ల ఆలయ సూపరింటెండెంట్ దురుసుగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. టికెట్లు తీయమని వారితో దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. తన సిఫారుసుకు విలువ లేనప్పుడు తనెందుకు ఈ పదవి అంటూ రాజీనామాకు సిద్ధపడ్డారు. ఆలయ సూపరిండెంటెంట్ రమణ రాజును ప్రోటో కాల్ విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఆలయ ఈవో త్రినాథరావు స్పందించారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వివాదం కాస్త సద్దుమణిగింది.
* వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి ముహూర్తం ఖరారు
మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగే సమయం దగ్గరపడింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. డింపుల్ బ్యూటీ లావణ్య త్రిపాఠి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. జూన్ 9వ ఈ జంట నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అప్పటినుంచి వరుణ్-లావణ్య పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరగబోతుందనే విషయంపై మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ వ్యవహారంపై రోజుకో వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.అయితే తాజాగా ఈ జంట వివాహం ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ పద్ధతిలో జరగనున్నట్లు తెలిసింది. వారి ప్రేమ చిగురించిన చోటు ఇటలీలోనే పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలని ఈ జంట నిర్ణయించుకుందట. నవంబర్ 1వ తేదీని వివాహం కోసం లాక్ చేసినట్లు సమాచారం. ఇరు కుటుంబల సమక్షంలో మూడు రోజుల పాటు డెస్టినేషన్ వెడ్డింగ్ పద్ధతిలో జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుక కోసం మెగా ఫ్యామిలీ అంతా అక్కడికి వెళ్లనున్నారట. కానీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం ఒక్కరే బిజీ షెడ్యూల్ కారణంగా హాజరుకాకపోవచ్చని సమాచారం.
* సీపీఎం సీపీఐ రాష్ట్రకమిటీల వేర్వేరు సమావేశాలు
బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిన్న రానున్న ఎన్నికల బీఆర్‌ఎస్ తరుఫున బరిలో ఉండే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అయితే.. ఈ సందర్భంగానే సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని వెల్లడించారు. అయితే.. గతంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నిక సమయంలో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న సీఎం కేసీఆర్.. ఆ పొత్తు వచ్చే ఎన్నికల వరకు కొనసాగిస్తారని భావించారు. కానీ.. నిన్న ఎవ్వరితోనూ పొత్తుపెట్టోమని స్పష్టం చేయడంతో.. వామపక్షాల దైలమాలో పడ్డాయి. ఈ అంశంపై చర్చించేందుకు రెండు వామపక్షాలు మంగళవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాయి. వారు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపే అవకాశం ఉంది. కేసీఆర్ తమ పట్ల వ్యవహరించిన తీరుపై వారు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారని, ఆయన కంచెను చక్కదిద్దుకున్న బీజేపీతో విరోధం పెట్టుకోకుండా ఉండేందుకు ఇలా చేశారంటూ వామపక్ష నేతలు అంటున్నారు.
* ఏపీ విభజన బిల్లుపై విచారణ వాయిదా
ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బిల్లు ఆమోదం చట్టబద్ధంగా లేదన్న పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. దీనిపై స్పందిస్తూ.. ఇది పార్లమెంట్‌కు సంబంధించిన విషయమని వ్యాఖ్యానించింది. ఈ కేసు లోపలికి వెళ్లడం లేదని, వాయిదా వేస్తున్నామని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.