Movies

తొలి సినిమా జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సమంత పోస్ట్

తొలి సినిమా జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సమంత పోస్ట్

తన తొలి చిత్రం ‘ఏ మాయ చేసావె’ని గుర్తుచేసుకుంటూ నటి సమంత (Samantha) ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. ఆ సమయంలో కెరీర్‌ ఎలా ఉంటుందో తెలియక కంగారు పడ్డానని పేర్కొన్నారు. ‘ఇండియా డే పరేడ్‌’లో భాగంగా న్యూయార్క్‌లో పర్యటిస్తోన్న ఆమె ఈ మేరకు పోస్ట్‌ పెట్టారు. న్యూయార్క్‌లో ‘ఏ మాయ చేసావె’ షూట్‌ జరిగిన రోజులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

‘‘న్కూయార్క్‌ నగరం కలల సాకారానికి అనువైనదిగా చెబుతుంటారు. నా తొలిచిత్రం షూట్‌ ఇక్కడే జరిగింది. నటిగా నా కెరీర్‌ మొదలైంది. ఆ సమయంలో (తొలినాళ్లను ఉద్దేశిస్తూ..) ఈ ప్రయాణం ఎలా ఉంటుందో తెలియక భయపడిన చిన్నపిల్లని నేను. గొప్ప కలలతో ధైర్యంగా అడుగు ముందుకు వేశా. 14ఏళ్ల తర్వాత ‘ఇండిపెండెన్స్‌ డే పరేడ్‌’లో పాల్గొన్నా. ఎంతో ఆనందంగా ఉంది’’ అని పేర్కొంటూ ఇన్‌స్టాలో సామ్‌ పెట్టిన ఈ పోస్ట్‌ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.ఇక, ఆదివారం జరిగిన ‘ఇండియా డే పరేడ్‌’లో పాల్గొన్న సమంత.. ‘‘ఈరోజు న్యూయార్క్‌లో ఉండడం చాలా గర్వంగా ఉంది. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు ఎంతగొప్పవో, ఈరోజు నేను చూసిన దృశ్యాలు మరోసారి అర్థమయ్యేలా చేశాయి. ఈ క్షణాలు నా మదిలో జీవితమంతా నిలిచి ఉంటాయి. ఈ అరుదైన గౌరవం నాకు దక్కేలా చేసిన అందరికీ ధన్యవాదాలు. అలాగే నా సినిమాలను ఆదరిస్తున్నందుకు అమెరికా ప్రజలకు కృతజ్ఞతలు’’ అని తెలిపారు. సినిమాల విషయానికి వస్తే సమంత నటించిన ‘ఖుషి’ త్వరలో విడుదల కానుంది.