రాష్ట్రంలో ప్రతిపక్ష ఇన్‌చార్జిలలో గందరగోళం నెలకొంది. జనసేన, టీడీపీ పొత్తు ఉంటుందా.. ఉండదా? ఒక వేళ సొమ్ములు ఖర్చు చేసి, నియోజకవర్గంలో శ్రమిస్తే రేపు పొత్తులో సీటు మరొకరు ఎత్తుకుపోతే మా పరిస్థితి ఏమిటనే మీమాంసలో ఇన్‌చార్జిలు ఉన్నారు. 2019లో ఇంత సస్సెన్స్ లేదని, పొత్తు లేకపోవడంతో మూడు పార్టీలు రంగంలో తమ సత్తా తాము చూసుకొన్నామని అంటున్నారు. ప్రస్తుతం టీడీపీ, జనసేన పొత్తు సస్పెన్స్ పెద్ద ఇబ్బందిగా మారిందని వారు వాపోతున్నారు. పొత్తు విషయం త్వరగా తేలిపోవాలని కోరుకుంటున్నారు. అలా కాకుండా ఎన్నికలు దగ్గర పడ్డాక పొత్తు విషయం తేల్చితే ఉపయోగం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీని వల్ల నియోజకవర్గంలో అభ్యర్థికి ప్రచారానికి సమయం కూడా చాలదని, ఓటర్లు కూడా పరిచయం కారని, దీంతో ఈ జాప్యం అంతా వైసీపీకి లాభం చేకూర్చుతుందని విశ్లేషిస్తున్నారు.
2019 ఎన్నికలకు ముందు గందరగోళం లేదు. పూర్తిగా క్లారిటీ ఉంది. జనసేన, టీడీపీ, వైసీపీ ఎవరికి వారు విడివిడిగా పోటీలో ఉన్నారు. దీంతో నియోజకవర్గాల్లో ఆయా పార్టీలకు చెందిన ఇన్‌చార్జిలు తమ వంతు కష్టపడ్డారు. సొమ్ములు ఖర్చు పెట్టడానికి కూడా వెనుకంజ వేయలేదు. అప్పడు టీడీపీ అధికారంలో ఉండటంతో వారు కాస్త దూకుడుగా ఉండేవారు. ఖర్చు విషయంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేవారు. అదే సమయంలో వైసీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండటం, దీనికి తోడు ఆయా నియోజకవర్గాల్లో కో-ఆర్డినేటర్లు ఉండటంతో అధికార పార్టీని వారు దీటుగా ఢీకొనే వారు. మధ్యలో జనసేన నాయకులు తమ వంతు పాత్ర పోషించేవారు. సీటు గ్యారంటీ ఉండటంతో వీరందరూ ఎన్నికల్లో వెనుకంజ లేకుండా కష్టపడ్డారు.
ప్రస్తుత పరిస్థితి భిన్నం..వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ పొత్తు ఉంటుందనే ప్రచారం తప్పితే, అధికారికంగా ప్రకటన లేదు. ఓ పక్కన ముందస్తు ఎన్నికలు అని ప్రచారం చేస్తున్నారు. దీంతో ఇన్‌చార్జిలలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఉదాహరణకు రామచంద్రాపురం నియోజకవర్గంలో పోలిశెట్టి చంద్రశేఖర్ జనసేన ఇన్‌చార్జిగా ఉన్నారు. టీడీపీ ఇన్‌చార్జిగా రెడ్డి సుబ్రహ్మణ్యం ఉన్నారు. ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరితే ఈ సీటు ఎవరికి కేటాయిస్తారో తెలియదు. మాకంటే మాకు అని వీరు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. నియోజకవర్గంలో పర్యటనలు మొక్కుబడిగానే చేస్తున్నారు. ఇక్కడే కాదు, రాష్ట్రంలోని అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది.
పొత్తు జాప్యం వైసీపీకే లాభం:పొత్తు విషయంలో టీడీపీ, జనసేన ఎంత జాప్యం చేస్తే వైసీపీకి అంత లాభం అని విశ్లేషకుల అంచనా. పొత్తు సంగతి తేలకపోవడంతో టీడీపీ, జనసేన ఇన్‌చార్జిలు నియోజకవర్గాల్లో మొక్కుబడిగా పర్యటిస్తున్నారు. అధికార వైసీపీ నేతలు మాత్రం గడపగడపకు మన ప్రభుత్వం.. అంటూ గ్రామగ్రామానా తిరుగుతున్నారు. జనాన్ని ఆకట్టుకొంటున్నారు. ఇతర పార్టీలోని అసమ్మతీయులకు గాలం వేస్తున్నారు. ఇలా వీరు రోజురోజుకూ బలపడుతున్నారు.