చిరంజీవి కథానాయకుడిగా కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సోషియో ఫాంటసీ ఫిల్మ్ ‘అంజి’. భారీ అంచనాల మధ్య 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. అప్పట్లో హాలీవుడ్‌ను సినిమాను తలపించేలా గ్రాఫిక్స్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దారు. దాదాపు ఐదేళ్లకు పైగా షూటింగ్ జరుపుకొందీ చిత్రం. వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిరు157వ సినిమా సోషియో ఫాంటసీ మూవీ అని టాక్. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచింది. ‘అంజి’ మూవీ తర్వాత చిరు మరోసారి అలాంటి కథతో సినిమా చేయలేదు. ఇన్నేళ్ల తర్వాత సోషియో ఫాంటసీ మూవీలో నటిస్తుండటంతో ఆ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అంజి మూవీ గురించి ఆసక్తికర విషయాలను దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ ఓ సందర్భంలో చెప్పారు. సినిమా అంత భారీగా తీయడం వెనుక నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డికి దక్కుతుందన్నారు.
‘‘నా జీవితంలో మర్చిపోలేని చిత్రమది. ఆ సినిమాకు పనిచేసిన వారందరినీ ప్రశంసించాలి. ఈ సినిమా క్రెడిట్ మొత్తం నిర్మాతకు దక్కుతుంది. ఎందుకంటే ‘అమ్మోరు’ తర్వాత శ్యాంప్రసాద్‌రెడ్డిగారికి చిరంజీవి డేట్స్ ఇస్తానని అన్నారు. సాధారణంగా చిరంజీవి అంటే కమర్షియల్ సినిమా చేయాలని అనుకుంటాం. కానీ, ఆయనతో గ్రాఫిక్స్‌తో సినిమా చేస్తానని శ్యాంగారు కమిట్ అయ్యారు. ఇదే విషయాన్ని నాకు చెప్పారు. ‘అయ్యో.. చిరంజీవిగారితో గ్రాఫిక్స్ సినిమా ఎందుకండీ.. ఆయనకు సరిపోయే కమర్షియల్ కథ నా దగ్గర ఉంది. పైగా డ్యూయల్ రోల్. అది చేద్దాం’ అని చెప్పినా ఆయన ఒప్పుకోలేదు. దీంతో శ్యాంగారికి తెలియకుండా నేను చిరంజీవిగారిని కలిసి ‘సర్.. గ్రాఫిక్స్ సినిమా అంటే చాలా సమయం పడుతుంది. పైగా గంటల తరబడి నిలబడాలి. కొత్త ఆర్టిస్ట్ చేసినట్లు చేయాలి’ అని చెప్పా. ‘రామకృష్ణా మీరు ఏం కంగారుపడకండి. కొత్త ఆర్టిస్ట్ చేసినట్లు చేస్తా. ఎన్నిరోజులైనా చేస్తా’ అని అన్నారు. చిరంజీవిగారు అదే టెంపోలో సినిమా మొత్తం కనిపించారు’’
‘‘ఇంటర్వెల్ సీన్ నెల రోజులు తీశాం. చిరంజీవి కూడా ఓపిగ్గా చేశారు. కేవలం గ్రాఫిక్స్ మాత్రమే కాదు. కథ పరంగా అదొక క్లిష్టమైన సబ్జెక్ట్. అందులో చిరంజీవిగారిని ‘ఒరేయ్’ అనే పాత్ర ఉంది. ఆయన్ను అలా పిలిచే వ్యక్తిగా ఎవరు సరిపోతారా? అని వెతికాం. చివరికి నాగబాబుగారిని వేషం వేసి పెద్దయ్య పాత్ర ఇచ్చాం. సినిమాకు సంబంధించిన వర్క్ కూడా చాలా పెద్దది. కొన్ని సన్నివేశాలకు 100 నుంచి 120 షాట్స్ తీయాల్సి వచ్చేది. అలా తీయబట్టే దానికి ఐదేళ్లు పట్టింది. శ్యాంగారు చాలా ఖర్చు పెట్టి సినిమా తీశారు. దీంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ సినిమాకు పని చేస్తుంటే తల తిరిగిపోయేది. ఎందుకంటే గ్రాఫిక్స్‌వర్క్ సింగపూర్, మలేషియా, అమెరికాల్లో జరిగేది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ తీసిన షాట్స్ అన్నీ రాత్రికి అమెరికా పంపేవాళ్లం. మరుసటి రోజు ఆ డిస్క్‌లోని షాట్స్ వాళ్లు తీసుకుని మళ్లీ అదే రోజు ఆ డిస్క్‌లను ఇక్కడికి పంపేవాళ్లు’’
‘‘ఇక గ్రాఫిక్స్ కోసం చిరంజీవి డ్రెస్‌కు మార్కులు పెట్టేవాళ్లం. ఆయన రోజూ అదే డ్రెస్‌వేసుకునే వాళ్లు. కనీసం ఉతకడానికి కూడా ఉండేది కాదు. ‘అంజి’ సినిమా ఎప్పుడు టీవీలో చూసినా అద్భుతంగా అనిపిస్తుంది. భారీ అంచనాలతో వెళ్లి చూస్తే, అంతగా ఆకట్టుకున్నట్లు అనిపించకపోవచ్చు. కానీ, చూడగా, చూడగా చరిత్రలో నిలిచిపోయింది. దీనికి క్రెడిట్ ఇవ్వాలంటే అది శ్యాంగారికి. ఆ తర్వాత చిరంజీవిగారికి. చిరు, హీరోయిన్, విలన్ తప్పితే మిగిలిన వాళ్లందరూ కొత్తవాళ్లే. ఒకవేళ ఈ ఐదేళ్లలో ఎవరైనా చేయకపోతే అదే పోలికలున్న వ్యక్తిని పెట్టుకోవచ్చని అనుకున్నాం. సినిమా ప్రారంభంలో ఆత్మలింగం కోసం ప్రయత్నించే ఒక మాంత్రికుడు ఉంటాడు. అతను ఎల్వీ ప్రసాద్ ఐ ఆస్పత్రి వద్ద బిచ్చగాడు. అతన్ని తీసుకొచ్చి ఆ పాత్ర వేయించాం. అందరం కష్టపడి చేశాం. దర్శకుడిగా నాకు ఎంతో తృప్తినిచ్చిన చిత్రం’’అని కోడి రామకృష్ణ చెప్పుకొచ్చారు.