భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కేవలం రూ.615 కోట్ల బడ్జెటుతో ‘చంద్రయాన్-3’ అనే అద్భుతమైన కలను సాకారం చేసి చూపించింది. హాలీవుడ్ చిత్రాల నిర్మాణవ్యయం కంటే ఇది తక్కువనే చెప్పాలి. ఇటీవల భారీస్థాయిలో విడుదలైన భారతీయ చిత్రం ‘ఆదిపురుష్’ బడ్జెటు రూ.700 కోట్లుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన ‘ఆదిపురుష్’ కంటే తక్కువ ఖర్చుతో ఇస్రో శాస్త్రవేత్తలు కొత్త చరిత్ర లిఖించి.. భారతీయ పతాకను వినువీధుల్లో సగర్వంగా ఎగురవేశారని చెప్పవచ్చు. తాజాగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా నడుస్తున్న హాలీవుడ్ చిత్రాలు ‘బార్బీ’ (145 మిలియన్ డాలర్లు/రూ.1,197 కోట్లు), ‘ఓపెన్‌హైమర్’ (100 మిలియన్ డాలర్లు/రూ.825 కోట్లు)ల బడ్జెటు సైతం చంద్రయాన్-3 కంటే ఎక్కువే. అణుబాంబు సృష్టికర్త జీవితం ఆధారంగా ‘ఓపెన్‌హైమర్’ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ పదేళ్ల కిందటే ‘ఇంటర్‌స్టెల్లార్’ పేరుతో అంతరిక్ష విశేషాలతో రూపొందించిన చిత్ర నిర్మాణవ్యయం ఏకంగా 165 మిలియన్ డాలర్లు (రూ.1,362 కోట్లు). అంటే చంద్రయాన్-3 బడ్జెటుకు రెండు రెట్లన్న మాట. అలాగే 2015లో వచ్చిన అంతరిక్ష ప్రయాణ ప్రభావిత హాలీవుడ్ చిత్రం ‘ది మాషన్’ నిర్మాణవ్యయం కూడా 106 మిలియన్ డాలర్లు (రూ.875 కోట్లు).
ఎయిరిండియా ఇటీవల పెద్దసంఖ్యలో విమానాల కొనుగోలుకు ఆర్డర్ పెట్టింది. ఒక్కోటి 128.25 మిలియన్ డాలర్లకు (రూ.1,058 కోట్లు) పైగా వ్యయమయ్యే ఈ బోయింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల సగటు ధర కంటే కూడా చంద్రయాన్-3 ప్రాజెక్టు వ్యయం చాలా తక్కువగానే ఉంది. ఇటీవల భారత్‌తోపాటు రష్యా ప్రయోగించిన లూనార్ మిషన్ ‘లూనా 25’ విఫలమైన విషయం తెలిసిందే. దీని నిర్మాణవ్యయం రూ.1,600 కోట్ల పైమాటే.