గ్రేటర్ హైదరాబాద్‌లో రెండు పడక గదుల ఇళ్లు పొందేందుకు అర్హులైన 12వేల మంది అదృష్టవంతుల వివరాలు గురువారం వెల్లడి కానున్నాయి. మహా నగరం పరిధిలోని 24 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఒక్కో నియోజకవర్గానికి 2500 మంది చొప్పున 60వేల మందితో జాబితా సిద్ధంచేశారు. వీరిలో ఒక్కో నియోజకవర్గానికి 500 మందిని ఎంపిక చేయనున్నారు. వీరి పేర్లను లక్డీకాపూల్‌లోని హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్‌యాదవ్ గురువారం వెల్లడించనున్నారు. లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసేందుకు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. పేర్లు, నంబర్లు ఒక డబ్బాలో వేసి లక్కీ డ్రా తీసినట్టు కాకుండా యాదృచ్ఛిక నమూనా(ర్యాండమైజేషన్) సాఫ్ట్‌వేర్ ద్వారా పేర్లు, వివరాలు వెల్లడికానున్నాయి. లబ్ధిదారుల పేర్లు స్పష్టంగా కనిపించేందుకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులు ప్రత్యేక తెరలను ఏర్పాటుచేశారు. మంత్రులు తలసాని, మహమూద్ అలీతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, డాక్టర్ ఎస్.హరీష్, అమోయ్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హజరుకానున్నారు.
లక్షల్లో దరఖాస్తులు.. సగమే పరిశీలన
హైదరాబాద్ మహా నగరంలో నివసిస్తున్న పేదలు ప్రభుత్వం ఉచితంగా కేటాయించనున్న రెండు పడకగదుల ఇళ్ల కోసం మూడేళ్ల కిందటే దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో నియోజకవర్గం పరిధిలో 5వేల నుంచి 10వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిని జీహెచ్‌ఎంసీ అధికారులు, ఇతర శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధితులు అర్హులో.. కాదో నిర్ధారించారు. లక్షల్లో దరఖాస్తులు రాగా.. వాటిలో యాభైశాతం దరఖాస్తులను మాత్రమే పరిశీలించారు. సెప్టెంబరు మొదటి వారంనుంచి దశలవారీగా ఇళ్ల కేటాయింపు ప్రక్రియ ఉండటంతో మిగిలిన దరఖాస్తుల పరిశీలనను పూర్తి చేయనున్నారు. హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాల పరిధిలో 1.61లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 80వేల మంది చిరునామాలకు అధికారులు వెళ్లి వారి స్థితిగతులను పరిశీలించారు. నివేదికను సిద్ధం చేసి రెవెన్యూ అధికారులకు సమర్పించారు.