Politics

బ్రిక్స్ కూటమిని విస్తరణకు భారత్‌ పూర్తిగా మద్దతు ఇస్తుంది: మోడి

బ్రిక్స్ కూటమిని విస్తరణకు భారత్‌ పూర్తిగా మద్దతు ఇస్తుందని: మోడి

ఏకాభిప్రాయం ఆధారంగా బ్రిక్స్‌ కూటమిని (BRICS) మరింత విస్తృత పరిచేందుకు భారత్‌ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. భాగస్వామ్య దేశాల పరస్పర సహకారంతో ముందుకు వెళ్లడాన్ని తాము స్వాగతిస్తామన్నారు. దక్షిణాఫ్రికాలో జరిగిన 15వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో (BRICS Summit) ప్రసంగించిన మోదీ.. ఆఫ్రికన్‌ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వాన్ని తాము ప్రతిపాదిస్తున్నామన్నారు. బ్రిక్స్‌ భాగస్వామ్య పక్షాలు కూడా ఇందుకు మద్దతు పలుకుతాయని ఆశిస్తున్నామని అన్నారు.భవిష్యత్తుకు బ్రిక్స్‌ సంసిద్ధంగా ఉండాలంటే మనం మన సమాజాలను భవిష్యత్తుకు సిద్ధంగా ఉంచుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారత్‌ అధ్యక్షతన జరుగుతోన్న జీ20 సదస్సులో గ్లోబల్‌ సౌత్‌ (Global South) దేశాలకు అత్యంత ప్రాధాన్యం కల్పిస్తోందన్న మోదీ.. బ్రిక్స్‌లోనూ అటువంటి ప్రాముఖ్యతను కల్పించడాన్ని స్వాగతించారు. గ్లోబల్‌ సౌత్‌ అభివృద్ధిలో బ్రిక్స్‌కు చెందిన న్యూ డెవెలప్‌మెంట్‌ బ్యాంక్‌ కీలక పాత్ర పోషిస్తోందన్న ఆయన.. గడిచిన రెండు దశాబ్దాలుగా ఈ కూటమి ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగుతోందన్నారు. రైల్వే రీసెర్చ్‌ నెట్‌వర్క్స్‌, ఎంఎస్‌ఎంఈల మధ్య సహకారం, స్టార్టప్‌ రంగాల్లో తీసుకోవాల్సి చర్యలపై భారత్‌ చేసిన సూచనలతో ఎంతో పురోగతి కనిపిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఈ సదస్సులో అంతకుముందు పలు అంశాలపై మాట్లాడిన మోదీ.. భారత్‌ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, సాంకేతిక పురోగతి గురించి వివరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో త్వరలోనే భారత్ కీలక భూమిక పోషించనుందన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చటం తమ సంకల్పమన్నారు. ఈ సందర్భంగా యూపీఐ (UPI) సేవలనూ ప్రధాని మోదీ కొనియాడారు.