ఓటరు జాబితాలో పేరుంటుందిగానీ ఆ ఊర్లో మాత్రం ఆ పేరుతో ఎవరూ ఉండరు. ఎన్నికల్లో వారి పేరుతో మరొకరు దొంగ ఓటు వేసేస్తారు. ఇలాంటి ఘటనలను అడ్డుకోవడం ఎన్నికల కమిషన్‌కు పెద్ద సవాలుగా మారుతోంది. తాజాగా దొంగ ఓట్లను నియంత్రించడానికి బిహార్‌లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పాటించిన విధానం అందరి దృష్టిని ఆకర్షించింది. చెన్నైకి చెందిన ‘ఫేస్‌ట్యాగర్’ అనే స్టార్టప్ సాయంతో బిహార్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వినూత్న యాప్‌తో ముందుకొచ్చింది. మే, జూన్ మాసాల్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో దొంగ ఓట్లు పోలవకుండా కట్టడి చేసింది.
3 సెకన్లలో గుర్తింపు
ప్రత్యేకించి ఎన్నికల కోసం ఫేస్‌ట్యాగర్ సంస్థ ‘స్వదేశ్’ పేరుతో ఓ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ ఇన్‌స్టాల్ అయి ఉన్న మొబైల్‌ను ఓటర్ల జాబితా, ఇతర డేటాను పొందుపరిచిన పరికరానికి అనుసంధానిస్తారు. ఓటరు పోలింగ్‌బూత్‌లోకి వస్తున్నపుడే వారి ముఖాన్ని మొబైల్‌తో ఫొటో తీస్తారు. ఇందులో ఉన్న వ్యక్తికి సంబంధించిన డేటా తన వద్ద ఉన్న డేటాలో ఉందో లేదో యాప్ నిర్ధరించి మూడు సెకన్లలోనే చెప్పేస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో 650 పోలింగ్ కేంద్రాల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో 1700 పోలింగ్ కేంద్రాల్లో ఈ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించారు. ఓటరు గుర్తింపు సరైందేనా, ఓటరు జాబితాలోని వ్యక్తి.. ఓటువేసేందుకు వచ్చిన వ్యక్తి ఒకటేనా కాదా, గతంలో దొంగ ఓట్లు వేసిన నేరచరిత్ర ఉందా.. ఇలాంటి సమాచారాన్ని ఇచ్చేలా ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఈ యాప్ సాయంతో అక్కడి స్థానిక ఎన్నికల్లో సుమారు 10 వేల దొంగ ఓట్లు పడకుండా నిరోధించినట్లు ఫేస్‌ట్యాగర్ సీఈవో విజయ్ జ్ఞానదేసికన్ వెల్లడించారు.
అధునాతన సాంకేతికత
ఓటరు జాబితాలో ఉన్న ఫొటోకి, ప్రస్తుతం ఆ వ్యక్తికి చాలా పోలికలు మారుంటాయి. కొందరు 5, 10 ఏళ్ల క్రితం ఫొటోల్ని సైతం అలాగే ఉంచుకుంటారు. అందుకే ఫొటోలో ఉన్న వ్యక్తి భవిష్యత్తులో ఎలా మారతాడనేదాన్ని అంచనా వేసేలా సాంకేతికతను యాప్‌లో పొందుపరిచామని విజయ్ జ్ఞానదేసికన్ పేర్కొన్నారు. ఇంత కచ్చితత్వంతో పనిచేస్తోంది కాబట్టే ఎన్నికల కమిషన్ ఈ ప్రయోగానికి ఆసక్తి చూపిందన్నారు. భవిష్యత్తుల్లో మరిన్ని ఎన్నికల్లో ఈ సాంకేతికత వాడే అవకాశముందని తెలిపారు.
మరిన్ని చోట్ల ప్రయోగాలు
చెన్నైకి చెందిన విజయ్ జ్ఞానదేసికన్, ఇళంగో మీనాక్షిసుందరం కలిసి 2018లో ఫేస్‌ట్యాగర్ సంస్థను నెలకొల్పారు. ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరి నిఘావర్గాలతో కలిసి పనిచేస్తూ నేరస్థులను గుర్తించేందుకు సాయపడుతున్నామని విజయ్ తెలిపారు. తప్పిపోయిన పిల్లల రికార్డుల్ని డిజటలీకరించి ఎంతోమంది పిల్లల్ని తమ తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. కౌలాలంపూర్ విమానాశ్రయంతో పాటు భారత్‌లోని 7 విమానాశ్రయాల్లో తమ సాఫ్ట్‌వేర్‌ను వాడుతున్నారని వెల్లడించారు.