Business

నేడు లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

నేడు లాభాల్లో ప్రారంభమైన  స్టాక్‌ మార్కెట్లు

దేశీయ మార్కెట్ల (Stock Market)లో లాభాల జోరు కొనసాగుతోంది. అంతర్జాతీయ సూచీలు సానుకూల సంకేతాలు, దేశీయ పరిణామాలతో వరుసగా నాలుగో రోజు సూచీలు లాభాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. సెన్సెక్స్‌ (Sensex) 300 పాయింట్లు ఎగబాకగా.. నిఫ్టీ (Nifty) 19,500 మార్క్‌ పైన కదలాడుతోంది. ఉదయం 9.25 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 368 పాయింట్ల లాభంతో 65,802 వద్ద, నిఫ్టీ 106 పాయింట్ల లాభంతో 19,548 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 25 పైసలు లాభపడి 82.47 వద్ద ట్రేడింగ్‌ను మొదలుపెట్టింది.

దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో రాణిస్తున్నాయి. నిఫ్టీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, ఎల్‌ అండ్‌ టీ, విప్రో, బజాజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్ షేర్లు దూకుడుగా ఉండగా.. ఎన్టీపీసీ, ఐషర్‌ మోటార్స్‌, సిప్లా షేర్లు కాస్త ఒత్తిడికి గురవుతున్నాయి. విద్యుత్‌, క్యాపిటల్ గూడ్స్‌ షేర్లు 1శాతానికి పైగా పెరిగాయి.టెక్‌ రంగ షేర్లలో కొనుగోళ్ల అండతో అమెరికా మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ -500 సూచీ 1.11శాతం, నాస్‌డాక్‌ 1.59శాతం, డోజోన్స్‌ 0.55శాతం లాభపడింది. ఆసియా మార్కెట్లు కూడా రాణిస్తున్నాయి. జపాన్‌ నిక్కీ 0.46శాతం, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ సూచీ 0.24శాతం, దక్షిణ కొరియా కోస్పి సూచీ 0.85శాతం, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ సూచీ 0.8శాతం లాభాలతో ట్రేడ్‌ అవుతున్నాయి.