11వ రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ వానకాలం సీజన్‌లో రికార్డుస్థాయిలో 68.99 లక్షల మంది రైతులకు రూ.7,624.74 కోట్ల పెట్టుబడి సాయం జమచేసింది. ఈ ఒక్క సీజన్‌లోనే 1.52 కోట్ల ఎకరాలకుపైగా భూమికి రైతుబంధు వర్తింపజేసింది. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్నా రైతులకు ఇచ్చిన మాట ప్రకా రం సీఎం కేసీఆర్ పెట్టుబడి సాయం అందించారు. దీంతో తమ ప్రభుత్వానికి రైతు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యమని, రైతుల తర్వాతే మరెవరైనా అని మరోసారి నిరూపించారు.
రికార్డు స్థాయిలో రైతుబంధు పంపిణీ
ఇప్పటివరకు మొత్తం 11 విడతలుగా ప్రభుత్వం రైతులకు రైతుబంధు పంపిణీ చేసింది. గత 10 విడతలతో పోల్చితే ఈ సీజన్‌లో రైతుల సంఖ్య, భూమి విస్తీర్ణం పెరిగింది. దీంతో పంపిణీ మొత్తం కూడా రికార్డు స్థాయిలో ఒకే సీజన్‌లో రూ.7,624.74 కోట్లకు చేరింది. ఇప్పటివరకు ఒక సీజన్‌కు ఇదే అత్యధికం. గత యాసంగిలో 65 లక్షల మంది రైతులకు సంబంధించిన 1.46 కోట్ల ఎకరాలకు రూ.7,311.08 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈసారి పోడు రైతులకు కూడా తొలిసారిగా రైతుబంధు అందజేసింది. గత జూన్ 24న పోడు పట్టాల పంపిణీ చేపట్టిన ప్రభుత్వం 1,50,224 మంది పోడు రైతులకు 4 లక్షల ఎకరాలకు పట్టాలిచ్చింది. వీరందరికీ రైతుబంధు అందింది.
72 వేల కోట్లు దాటిన పెట్టుబడి సాయం
ఈ సీజన్‌తో కలిపి ఇప్పటివరకు రైతుబంధు కింద రైతులకు అందించిన పెట్టుబడి సాయం మొత్తం రూ.72,817 కోట్లకు చేరింది. ఇంత భారీ మొత్తంలో నేరుగా రైతుల ఖాతాలో జమ చేసిన రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. రైతబంధు కోసం మొదటి రెండేండ్లు ఏటా రూ.10 వేల కోట్ల వరకు ఖర్చు చేయగా.. ప్రస్తుతం ఆ మొత్తం రూ.15 వేల కోట్లకు పెరిగింది. 2020-21 నుంచి ఏటా ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.15 వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయిస్తూ రైతులకు సకాలంలో రైతుబంధు అందేలా చర్యలు తీసుకుంటున్నది.
రైతును రాజు చేయాలన్నదే కేసీఆర్ సంకల్పం
రైతును రాజును చేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ పూర్తిచేస్తున్నాం. రైతుబంధు మొదలుపెట్టినప్పుడు ఎన్నికల కోసం అని విమర్శించారు. అయినప్పటికీ సీఎం కేసీఆర్ ఎక్కడా వెనక్కి తగ్గకుండా రైతులకు పెట్టుబడి సాయం అందించారు. ఇప్పటివరకు రూ.72,817.04 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసిన తెలంగాణ ప్రభుత్వం స్వంతంత్ర భారత చరిత్రలోనే రికార్డు సృష్టించింది. అన్నదాతల గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలుస్తారు. అన్నం పెట్టే అన్నదాతకు ఆసరాగా నిలవాలన్నదే కేసీఆర్ తపన. ఇచ్చిన మాట ప్రకారం రైతుబంధు అందించడంతోపాటు రుణమాఫీ చేసిన సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర రైతాంగం పక్షాన ధన్యవాదాలు.