* హైదరాబాద్‌లో కాల్పుల కలకలం
హైదరాబాద్‌లో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. నగర పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం దేవేందర్ గాయన్ అనే వ్యక్తిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపి పరారయ్యారు. మదీనాగూడలో జరిగిన ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన దేవేందర్‌ను ఘటనాస్థలంలోని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ప్రాణాలు వదిలాడు. విషయం తెలుసుకుని ఘటనాస్థలానికి చేరుకున్న మాదాపూర్ డీసీపీ సందీప్, మియాపూర్ పోలీసులు అక్కడ 6 తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కాల్పుల్లో మరణించిన దేవేందర్‌ను ఘటనాస్థలంలోనే ఉన్న కిన్నెర గ్రాండ్ సందర్శిని హోటల్ జనరల్ మేనేజర్‌గా గుర్తించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.అయితే దేవేందర్‌పై దాడి చేసినవారు మొత్తం ఐదు రౌండ్ల కాల్పులు జరిపారని, మృతుడు వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు చెందిన వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. దేవేందర్ హోటల్ నుంచి ఇంటికి వెళ్ళే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై హెల్మెట్ పెట్టుకుని వచ్చి అతనిపై కాల్పులు జరిపారని, కాల్పుల కోసం కంట్రీ మేడ్ పిస్టల్‌ని ఉపయోగించారని పోలీసులు పేర్కొన్నారు. అలాగే దేవేందర్ 6 నెలలుగా కిన్నెర గ్రాండ్ సందర్శిని హోటల్‌లో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడని, అతనిపై కాల్పులు జరిపిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని మియాపూర్ పోలీసులు తెలిపారు.
* ఐజీఐ విమానాశ్రయంలో భారీగా పట్టుబడిన కొకైన్
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్దమొత్తంలో కొకైన్ (Cocaine) పట్టుబడింది. ఆఫ్రికా దేశం నైరోబీ నుంచి ముంబై వెళ్తున్న విమానం ఢిల్లీలో ఆగింది. ఈ సందర్భంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రయాణికులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నైరోబి నుంబి ముంబై వెళ్తున్న కెన్యాకు చెందిన ప్రయాణికుడిని చెక్‌చేశారు. దీంతో అతని లగేజీలో 1,698 గ్రాముల కొకైన్ లభించింది. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ.17 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, విచారణ సందర్భంగా తాను ముంబై వెళ్తున్నట్లు చెప్పాడని వెల్లడించారు. దీంతో డ్రగ్స్‌ను ముంబైకి తరలిస్తున్నారని స్పష్టమైందని చెప్పారు. అనంతరం ముంబైలో ఆర్డర్‌ను తీసుకోవడానికి వచ్చిన కెన్యా జాతీయురాలిని కూడా అరెస్టు చేశామని తెలిపారు. నిందితులిద్దరిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కింద కేసు నమోదుచేసినట్లు వెల్లడించారు. కాగా, ఈ ఏడాది జనవరి నుంచి జూలై మధ్యకాలంలో దేశవ్యాప్తంగా డీఆర్‌ఐ అధికారులు 42 పర్యాయాలు కొకైన్, హెరాయిన్‌ను సీజ్ చేశారు. ఇందులో 31 కేజీల కొకైన్ ఉండగా, 96 కికోల హెరాయిన్ ఉన్నదని పేర్కొన్నారు.
* హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదం
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాదు నగరవాసుల ట్రాఫిక్ కష్టాలను తీరుస్తోంది దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి. రాయదుర్గంలోని ఈ కేబుల్ బ్రిడ్జిపై ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి బ్రిడ్జిపైనే బోల్తా పడిపోయింది. దీంతో ఆటోడ్రైవర్ తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. కేబుల్ బ్రిడ్జిపై జరిగిన ప్రమాదానికి సంబంధించిన సిసి ఫుటేజిని పోలీసులు విడుదల చేసారు. ముందు వెళుతున్న బైక్ ను ఓవర్ టేక్ చేయబోయి అదుపుతప్పిన ఆటో బోల్తాపడింది. గాయాలపాలైన క్షతగాత్రులను దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు.
* అత్తమామల నుంచి విడిపోదామని భర్తపై ఒత్తిడి
సహేతుక కారణం లేకుండా అత్తమామల నుంచి విడిపోవాలని భర్తపై భార్య పదేపదే ఒత్తిడి తీసుకురావడం క్రూరత్వం కిందకే వస్తుందని ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ జంటకు విడాకులు మంజూరు చేస్తూ హైకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పాశ్చాత్య దేశాల్లో జరిగినట్టుగా భారత్‌లో పెండ్లికాగానే.కుమారుడు తన తల్లిదండ్రుల్ని విడిచి వేరుగా రావటం జరగదని పేర్కొన్నది. మేజర్‌కాగానే లేదా పెండ్లికాగానే.. తల్లిదండ్రుల్ని వదిలేయటం పాశ్చాత్య దేశాల సంస్కృతి అని, దీన్ని భారతీయులు అనుసరించరని ధర్మాసనం అభిప్రాయపడింది. తల్లిదండ్రుల విషయంలో కుమారుడికి నైతికంగా, చట్టపరంగా కొన్ని బాధ్యతలుంటాయని, వృద్ధాప్యంలో వారి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.
* రాత్రి సమయంలో తల్లి చేతిలో ఫోన్
అనుమానం మనిషి చేత ఎంత ఘోరానైనా చేయిస్తుంది. అనుమానంతో ఉన్నప్పుడు, అవేశంతో రగిలిపోతున్నప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకే అర్థం కాదు. ఆ సమయంలో మనం ఎంతటి దారుణానికి ఒడిగట్టడానికైనా వెనకాడం. సొంత వారన్న కనికరం లేకుండా వారిపై దాడి చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సాధారణంగా భార్యను అనుమానించే భర్త ఉంటాడు కానీ అమ్మను అనుమానించే బిడ్డలు ఉండరు. అమ్మ అంటే దైవం. ఆమెను పల్లేత్తి మాట అంటేనే మహాపాపం అలాంటిది ఓ కొడుకు తన తల్లినే అనుమానంతో గొడ్డలితో నరికి చంపి రాక్షసుడిలా మారాడు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలోనిపాల్ఘర్ జిల్లా వసాయ్ టౌన్‌షిప్ పరిధి పెరోల్ ప్రాంతంలో సోనాలి గోగ్రా అనే 35 యేళ్ల మహిళ తన 17యేళ్ల కొడుకుతో కలిసి ఉంటుంది. తండ్రి లేకపోవడం వల్ల ఆ మహిళే కొడుకును పెంచి పోషిస్తోంది. ఇక దారుణం జరిగిన రోజు రాత్రి 10 గంటల సమయంలో కొడుకు అన్నం పెట్టింది ఆ తల్లి. తరువాత పక్కకు వెళ్లి తన ఫోన్ లో ఎవరికో మెసేజ్ చేసింది. ఇది చూసి ఆ కొడుకు ఒక్కసారిగా కోపంతో ఊగిపోతూ పశువుల ప్రవర్తించాడు. తన తల్లితో ఈ సమయంలో ఎవరికి మెసేజ్ చేస్తున్నావని గొడవ పడ్డాడు. ఆమెను ఇష్టం వచ్చినట్లు తిట్టాడు. అంతటితో ఆగకుండా ఆ కొడుకు తల్లి పట్ల ఏ కొడుకు ప్రవర్తించని విధంగా చేశాడు. కోపంలో ఉన్న అతను ఆవేశంతో తన పక్కన ఉన్న గొడ్డలి తీసుకొని తల్లిని నరికాడు. దీంతో ఆమె గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. అయితే తన తల్లికి ఎవరితోనో అక్రమ సంబంధం ఉందని ఆమె కొడుకు తరచూ అనుమానించేవాడని, ఈ విషయంపై ఇద్దరు గొడవపడుతూ ఉండేవారని స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలిసిన పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
* మైలార్‌దేవ్‌పల్లిలో కారు బీభత్సం
రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ మధు తెలిపిన వివరాల ప్రకారం.. టీఎన్జీవోస్ కాలనీకి చెందిన డిగ్రీ విద్యార్థులు సాయిచందర్ (20), సుభాష్, వికాస్ స్నేహితులు. బుధవారం అర్ధరాత్రి అతిగా మద్యం సేవించి కారు నడుపుతూ కాటేదాన్ నుంచి దుర్గానగర్ చౌరస్తా వైపు వచ్చారు. అక్కడ డివైడర్‌ను ఢీకొని పక్కనే పార్కింగ్‌లో ఉన్న మరో కారును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో సాయిచంద్ అక్కడికక్కడే మృతిచెందగా.. సుభాష్, వికాస్‌కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* రెండు కార్లు లారీ ఢీ
రెండు కార్లు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంతో పాటు మరో తొమ్మిది మంది తీవ్రగాయాల పాలయ్యారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం సంగమూడి సమీపంలో 216 జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సంభవించింది. ముందు వెళ్తున్న లారీని కారు ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. కృత్తివెన్ను పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం మొగళ్ళమూరు తూర్పుచెరువు నుంచి ఓ కుటుంబంలోని ఇద్దరు మహిళలు, నలుగురు చిన్నారులు, కారు డ్రైవర్‌తో కలసి మొత్తం ఏడుగురు గుంటూరు బయలుదేరారు. అక్కడి దేవదాసు చర్చిలో దాసుబాబుకి మొక్కు తీర్చుకోవడానికి వీరంతరూ బుధవారం ఉదయం 6 గంటలకు బయలుదేరారు. అల్లవరం మండలం మొగళ్ళమూరుకు చెందిన తెన్నేటి అనామణి, గోడికి చెందిన మడికి రాజేశ్వరి, మడికి మెరాకిల్, మడికి షారోన్ జ్యోతి, మడికి రమ్య, మడికి దాసుబాబు కారులో ఉన్నారు.
* మాజీ సైనికుడిపై కత్తులు రాడ్లతో దాడి
మాజీ సైనికోద్యోగిపై కొందరు దుండగులు కత్తులు, ఇనుపరాడ్లతో దాడిచేసిన ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రాణభయంతో పరుగుతీసిన అతడిని వెంటపడుతూ చంపడానికి ప్రయత్నించారు. అయితే మాజీ సైనికుడి కేకలు విని గ్రామస్తులు గుమిగూడటంతో దుండగులు పరారయ్యారు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మాజీ సైనికుడు తనను చంపడానికి చూసింది మాజీ మంత్రి, వైసిపి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) అనుచరులేనని ఆరోపిస్తున్నాడు. బాధిత మాజీ సైనికోద్యోగి, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలం రేవిడి పంచాయితీ రౌతులపాలెంకు చెంది మోపాడ ఆదినారాయణ(40) మాజీ సైనికోద్యోగి. గతంలో భారత సైన్యంతో పనిచేసిన అతడు ప్రస్తుతం గ్రామంలోనే వుంటున్నాడు. అయితే ఇతడు రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుండటం, ఇటీవల ప్రభుత్వ భూమి ఆక్రమణను అడ్డుకున్నాడు. దీంతో వారికి అడ్డు వస్తున్నానని అధికార వైసిపి నాయకులే తనను అంతమొందించడానికి ప్రయత్నించినట్లు ఆదినారాయణ ఆరోపిస్తున్నాడు.మంగళవారం పనిపై బయటకు వెళ్లిన ఆదినారాయణ రాత్రి ఒంటరిగా గ్రామానికి వెళుతుండగా కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. గ్రామ శివారులో కాపుకాసిన దుండగులు కత్తులు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. దుండగుల నుండి తప్పించుకున్న అతడు గ్రామంలోకి పరుగుతీసాడు. దుండగులు కూడా అతడిని వెంటపడ్డారు. గ్రామంలోకి చేరుకున్న ఆదినారాయణ ప్రాణభయంతో కేకలు వేయగా గ్రామస్తులు గుమిగూడారు. దీంతో దుండుగులు అక్కడినుండి పరారయ్యారు.
* మిజోరం బ్రిడ్జి కూలిన ఘటనలో 22కు పెరిగిన మరణాలు
మిజోరంలోని కురుంగ్ నదిపై నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి బుధవారం కుప్పకూలింది. ఈ ప్రమాదం కారణంగా స్పాట్ లోనే 18 మంది కార్మికులు మృతి చెందారు. పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఐజ్వాల్ కు 21 కిలోమీటర్ల దూరంలోని సైరంగ్ లో ఉదయం 9.30 గంటలకు ఈ ఘటన జరిగింది. బ్రిడ్జి కూలిన సమయంలో మొత్తం 28 మందికి పైగా కార్మికులు అక్కడే ఉన్నట్లు సమాచారం. సైరంగ్ జీరో పాయింట్ సమీపంలో నిర్మాణంలో ఉన్న 196వ నెంబర్ రైల్వే బ్రిడ్జి కూలిపోయింది. 18 మంది మృతదేహాలను వెలికితీశామనీ, గాయపడిన ముగ్గురిని రక్షించామని మిజోరం ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 22కు పెరిగిందని సంబంధిత అధికారులు తెలిపారు.వివరాల్లోకెళ్తే.. మిజోరంలో నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 22కు చేరింది. శిథిలాల నుంచి ఇప్పటివరకు 22 మృతదేహాలను వెలికితీశామని రైల్వే, పోలీసులు తెలిపారు. స్టీల్ బ్రిడ్జి శిథిలాల కింద చిక్కుకున్న నలుగురి మృతదేహాలను వెలికితీసే పనులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర రాజధాని ఐజ్వాల్ కు 21 కిలోమీటర్ల దూరంలోని సైరంగ్ వద్ద నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి బుధవారం ఉదయం 11 గంటల సమయంలో కూలింది. ఈశాన్య రాష్ట్రాల రాజధానులను కలిపే రైల్వే ప్రాజెక్టు ప్రకారం నిర్మిస్తున్న 130 ఫ్లైఓవర్లలో ఒకటైన భైరవి, సైరంగ్ మధ్య నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంపై రైల్వే యంత్రాంగం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
* ట్యాంకర్ రోల్స్ రాయిస్ ఢీ
హర్యానాలోని నూహ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్, రోల్స్ రాయిస్ కారు ఢీకొన్న ఘటనలో ట్యాంకర్‌లో ఉన్న ఇద్దరు మరణించగా.. లగ్జరీ కారులోని ప్రయాణికులు ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో రోల్స్ రాయిస్ తుక్కు తుక్కైనట్లు తెలుస్తోంది. ఢిల్లీ-ముంబయి-బరోడా ఎక్స్ ప్రెస్ హైవేపై హర్యానాలోని నూహ్‌లో లగ్జరీ కారు రోల్స్ రాయిస్‌ను వేగంగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఉమ్రి గ్రామ సమీపంలో రాంగ్ రూట్‌లో వచ్చిన ఆయిల్ ట్యాంకర్ వేగంగా వెళ్తున్న రోల్స్ రాయిస్‌ను ఢీకొట్టినట్లు తెలిసింది. ట్యాంకర్ బోల్తాపడగా లగ్జరీ కారుకు మంటలంటుకున్నాయి.ఈ ఘటనలో ఆయిల్ ట్యాంకర్ నడుపుతున్న డ్రైవర్ రామ్‌ప్రీత్ , అతని హెల్పర్ కుల్దీప్ చనిపోయారు. ట్యాంకర్‌లో ఉన్న మరో వ్యక్తి గౌతమ్ గాయపడినట్లు తెలుస్తోంది. రోల్స్ రాయిస్‌లో ప్రయాణిస్తున్న చండీగఢ్ నివాసితులు దివ్య, తస్బీర్‌లుగా , మరొకరు ఢిల్లీ వాసి వికాస్‌గా గుర్తించారు. వీరు ముగ్గురు గురుగ్రామ్‌లోని మెదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో రోల్స్ రాయిస్‌కి కొంచెం దూరంలో కారులో వస్తున్న వారి బంధువులు తక్షణం స్పందించి రక్షించినట్లు సమాచారం. ప్రమాదంలో మరణించిన ట్యాంకర్ డ్రైవర్ రామ్ ప్రీత్ , అతని హెల్పర్ కుల్దీప్‌లను ఉత్తరప్రదేశ్‌కు చెందినవారిగా గుర్తించారు. క్షతగాత్రుల నుంచి ప్రమాద వివరాలను సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంపై మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని ఏఎస్‌ఐ తెలిపారు.