Business

టీవీఎస్‌ నుంచి మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్-TNI నేటి వాణిజ్య వార్తలు

టీవీఎస్‌ నుంచి మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్-TNI నేటి వాణిజ్య వార్తలు

టీవీఎస్‌ నుంచి మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్‌ (TVS Motor) తన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ విభాగంలో రెండో మోడల్‌ను బుధవారం లాంచ్ చేసింది. టీవీఎస్‌ ఎక్స్ (TVS X) పేరుతో కొత్త ప్రీమియం ఇ-స్కూటర్‌ను (e-scooter) అందుబాటులోకి తెచ్చింది. నేవిగేషన్‌ సిస్టం, ఈవీ ఛార్జర్ మ్యాపింగ్ మెకానిజమ్‌, లైవ్‌ వెహికల్‌ లొకేషన్ షేరింగ్‌ వంటి ఫీచర్లు ఈ స్కూటర్‌లో ఉన్నాయి. అల్యూమినియం బాడీతో ఉండే ఈ విద్యుత్తు వాహనం ప్రారంభ ధర బెంగళూరు ఎక్స్‌షోరూంలో రూ.2.49 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే బుకింగ్‌లను ప్రారంభించామని.. నవంబరులో డెలివరీలు చేయనున్నాయని టీవీఎస్‌ పేర్కొంది. ఇక ఈ వాహనం ఫీచర్ల విషయానికొస్తే.. టీవీఎస్ ఎక్స్ స్కూటర్ 3.8 kWh బ్యాటరీతో లభిస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 140 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. 2.6 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ఠంగా గంటకు 105 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. 3 kW ఫాస్ట్‌ ఛార్జర్‌తో అయితే కేవలం గంట వ్యవధిలో 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఇక స్కూటర్‌ భద్రత కోసం నెక్ట్స్‌-జెనరేషన్‌ ABS కూడా ఇచ్చారు. స్టెల్త్, ఎక్స్‌ట్రైడ్‌, ఎక్సోనిక్‌ మోడ్స్‌ ఉన్నట్లు టీవీఎస్‌ తెలిపింది. ఈ స్కూటర్ కొనుగోలులో భాగంగా 950W పోర్టబుల్‌ ఛార్జర్‌ను రూ.16,275కే అందిస్తామని కంపెనీ తెలిపింది. 3-KW స్మార్ట్ హోమ్ ఛార్జర్‌ను కూడా ఎంపిక చేసుకోవచ్చని పేర్కొంది. వెల్‌నెస్, గేమింగ్, బ్రౌజింగ్, లైవ్ వీడియో ఫీచర్‌లను అందించే ప్లే టెక్‌తో ఈ స్మార్ట్ స్కూటర్ వస్తోంది. ఈ ‘TVS X’ ను స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్, హెల్మెట్‌తో కనెక్ట్ చేయవచ్చు. ఇతరులు యాక్సెస్‌ చేయకుండా ఉండేందుకు స్మార్ట్ షీల్డ్‌ భద్రతా ఫీచర్‌ కూడా దీనిలో ఉంది.

భారీగా పెరిగిన ధరలు!

బులియన్ మార్కెట్‌లో గత కొంతకాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయి. ఇటీవల స్వల్ప హెచ్చుతగ్గులతో లేదా స్థిరంగా కొనసాగిన బంగారం, వెండి ధరలు తాజాగా.. మళ్లీ పెరిగాయి. సాధారణంగా పసిడి, వెండిని.. ఏమైనా శుభకార్యాలున్నా, పండుగలున్నా చాలామంది కొనుగోలు చేస్తుంటారు. అందుకే.. అందరి దృష్టి బంగారం, వెండి ధరలపై ఉంటుంది. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.54,300 గా ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.59,230 గా ఉంది. పది గ్రాముల బంగారంపై రూ.100 మేర పెరిగింది. వెండి కిలో ధర రూ.5,00 ల మేర పెరిగి 75,300 లుగా కొనసాగుతోంది.దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల పసిడి ధర రూ.54,450 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,400 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,300, 24 క్యారెట్లు రూ.59,230 గా ఉంది. చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.54,660, 24 క్యారెట్ల ధర రూ.59,630, బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,300, 24 క్యారెట్ల ధర రూ.59,230 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.54,300, 24 క్యారెట్లు రూ.59,230 గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,300, 24 క్యారెట్లు రూ.59,230గా ఉంది.హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.54,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,230 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లు రూ.54,300, 24 క్యారెట్లు రూ.59,230, విశాఖపట్నంలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,300, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,230గా ఉంది.

*   ఉద్యోగులకు ఇన్ఫోసిస్‌ శుభవార్త

ఐటీ ఉద్యోగులకు ఇన్ఫోసిస్‌ శుభవార్తను అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను ఉద్యోగుల వేరియబుల్‌ చెల్లింపులను సరాసరిగా 80 శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.ఈ వేరియబుల్‌ చెల్లింపులను ఆగస్టు నెల వేతనంతో కలిపి ఇవ్వనున్నది. కంపెనీ ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్స్‌లో మానవ వనరుల విభాగ అధిపతి ఈ విషయాన్ని వెల్లడించారు. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.5,945 కోట్ల నికర లాభాన్ని గడించింది.

 ఇన్ కమ్ ట్యాక్స్‌ రీఫండ్ ఇంకా క్రెడిట్‌ కాలేదా?

ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేందుకు 2023 జూలై 31వ తేదీని డెడ్ లైన్ గా విధించింది ఆదాపు పన్ను శాఖ. దీంతో ట్యాక్స్ చెల్లించిన వ్యక్తులు రిఫండ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఏడాది పొడవునా ఎక్కువ పన్ను ను చెల్లించిన వారు దీని కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కోసం దరఖాస్తు చేసుకునే వారు సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. చాలా మంది ఈ ప్రక్రియనంతా పూర్తి చేసి రిటర్న్స్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇంకా చాలా మంది బ్యాంక్ ఖాతాల్లో రిటర్న్స్ డబ్బు జమ కాలేదు. కేవలం గడువు లోపు రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడే కాదు ఫైల్ చేసిన తరువాత కూడా జాగ్రత్తగా ఉండటం అవసరం. ఎందుకంటే చిన్న పొరపాటు కూడా మీ రీఫండ్ ప్రాసెస్ ను లేట్ చేయవచ్చు. ఐటీఆర్‌ సక్సెస్‌ఫుల్‌గా ఫైల్ చేసినప్పటికీ, ఇంకా వెరిఫై చేయకపోతే,ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌ని ఇన్‌వ్యాలిడ్‌గా పరిగణిస్తారు. అంటే అన్నీ చేసినా ప్రాసెస్ పూర్తి అయినట్లు భావించరు. రిటర్న్‌లో అందించిన సమాచారం ఖచ్చితత్వం, చట్టబద్ధతను నిర్ధారించడానికి వెరిఫికేషన్‌ అనేది కీలకమైన దశ. ఇది పూర్తికాకపోతే మీ డబ్బు మీ బ్యాంక్ ఖాతాలోకి జమ కాదు. అంతా సక్రమంగా ఉందో లేదో చెక్ చేసుకోవడం కోసం దీనిని వెరిఫికేషన్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు ఆదాయపు పన్ను శాఖను సంప్రదించకుండా స్వయంగా చేసుకోవచ్చు.మీరు గతంలో దీని కోసం ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్‌ కోడ్ ఉపయోగించి ఉంటే, ఇప్పుడు ఐటీఆర్‌ని వెరిఫై చేయడానికి ఆ కోడ్‌ను ఉపయోగించవచ్చు. దీనిని బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా జనరేట్ చేసుకోవచ్చు. అనంతరం ఐటీఆర్ ను వెరిఫై చేసుకోవచ్చు. ఇక మరో విధంగా ఆధార్ నంబర్ ని ఉపయోగించి ఓటీపీ (వన్ టైమ్ పాస్ వర్డ్ ) ని జనరేట్ చేసి ఆన్ లైన్ లో వెరిఫై చేసుకోవచ్చు. ఇంతకముందే ఈ ప్రాసెస్ చేసి ఉంటే కూడా దాని ద్వారా కూడా ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ను వెరిఫై చేసుకోవచ్చు. ఇక మీకు డీమ్యాట్ అకౌంట్ ఉంటే దాని ద్వారా కూడా ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్‌ కోడ్ జనరేట్ చేసుకోవచ్చు. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ ఉపయోగించి కూడా ఇ-వెరిఫికేషన్‌ చేయవచ్చు. సెక్యూర్‌, ఎఫిషియంట్‌ వెరిఫికేషన్‌ ప్రాసెస్‌ కోసం డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ ని ఉపయోగించి ఇన్ ట్యాక్స్ రిటర్న్ పై డిజిటల్‌గా సంతకం చేయవచ్చు. మీరు కనుక ట్యాక్స్ రిటర్న్స్ కోసం ఎదురుచూస్తున్న వారిలో ఉంటే చకచక ఈ ప్రాసెస్ లలో వెరిఫై చేసుసుకోండి. ఎందుకు మీకు ప్రాసెస్ ఆలస్యం అవుతుందో తెలుసుకోండి.

ఆ అకౌంట్లదారులకు జగన్ గుడ్ న్యూస్

అర్హులై ఉండి సంక్షేమ పథకాలు అందని వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. వివిధ కారణాల వల్ల పలు పథకాలు అందని వారి ఖాతాల్లో సీఎం జగన్ నేరుగా నగదు జమ చేశారు. డిసెంబర్ 2022, జులై 2023 మధ్య కాలంలో పథకాలు అందని 2,62,169 మందిని గుర్తించి వీరి ఖాతాల్లో రూ.216.34 కోట్లను తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్ గా బటన్ నొక్కి జమ చేశారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కులం, మతం, ప్రాంతం పార్టీ అనే తేడా లేకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. కొత్త పెన్షన్ బియ్యం, ఆరోగ్య శ్రీ కార్డులను అందిస్తున్నట్టుగా సీఎం జగన్ వివరించారు. కొత్తగా నమోదైన లబ్దిదారుల సంఖ్యతో రాష్ట్రంలో పెన్షన్ల సంఖ్య 64 లక్షల 27 వేలకు చేరిందని చెప్పారు సీఎం జగన్. చంద్రబాబు ప్రభుత్వంలో రూ.1000 ఉన్న పెన్షన్ ని రూ.2,750 కి పెంచామని గుర్తు చేశారు. జగనన్న చేదోడు ద్వాారా 43,131 మందికి సహాయం చేసినట్టు వెల్లడించారు. 2,312 మందికి రేషన్ కార్డులు, 12,069 మందికి ఇళ్ల పట్టాలు.. 1,49,875 మందికి పెన్షన్లు, 4,327 మందికి ఆరోగ్య శ్రీ కార్డులు అందిస్తున్నామని చెప్పారు సీఎం జగన్. 

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు అమూల్తో ఒప్పందం!

సేంద్రియ ధ్రువీకరణ పత్రాలు ఉన్న రైతుల నుంచి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనేందుకు అమూల్‌ సంస్థ సంసిద్ధత తెలియజేసిందని రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక వైస్‌ఛైర్మన్‌ టి.విజయ్‌కుమార్‌ పేరొన్నారు. సచివాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో అమూల్‌ ప్రతినిధులతో ఆయన సేంద్రియ ఉత్పత్తులపై చర్చించారు. ‘రాష్ట్రంలో 8.5 లక్షల మంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అందులో లక్షన్నర మంది రెండేళ్లుగా సంపూర్ణంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్ని అనుసరిస్తున్నారు’ అని వివరించారు. సేంద్రియ ధ్రువీకరణ ప్రక్రియను సరళతరం చేయాలని, ఈ అంశంపై ఏపీఈడీఏ సంస్థతో కలిసి పనిచేస్తామని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు అయిదేళ్ల ప్రణాళిక రూపొందించుకోవాలని, దీనిపై ఒక ఒప్పందం చేసుకోవాలని అమూల్‌, రైతు సాధికారసంస్థ నిర్ణయించినట్లు వివరించారు. రాష్ట్రంలోని 105 రైతుబజార్లలో రెండేసి దుకాణాల చొప్పున అమూల్‌కు కేటాయించవచ్చని సమావేశంలో పాల్గొన్న రైతుబజార్ల సీఈఓ సూచించారు.

వాటాపై కన్నేసిన శాంసంగ్ ఇండియా

 దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ప్రీమియం విభాగంలో దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ వేగంగా విస్తరిస్తోంది. దేశంలో రూ. 80 వేల కంటే ఎక్కువ ఖరీదైన ఆల్ట్రా-ప్రీమియం సెగ్మెంట్‌లో కంపెనీ ఇప్పటివరకు 40 శాతం వాటాను కలిగి ఉంది. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి దాన్ని 50 శాతానికి పెంచే దిశగా కంపెనీ ప్రయత్నిస్తోంది. ఇటీవల విడుదలైన ఫోల్డబుల్ ఫోన్‌ల కోసం వినియోగదారుల నుంచి గణనీయమైన గిరాకీ కనిపిస్తోంది.ప్రస్తుతం వాటికి వచ్చిన ప్రీ-బుకింగ్‌లను గమనిస్తే ఈ ఏడాది ఆఖరులోగా ఆల్ట్రా-ప్రీమియం విభాగంలో 50 శాతం మార్కెట్ వాటాను దక్కించుకోగలమని శాంసంగ్ ఇండియా మొబైల్ బిజినెస్ సీనియర్ డైరెక్టర్ ఆదిత్య బబ్బర్ తెలిపారు. గత నెల 27 నుంచి ఆగస్టు 17వ తేదీల మధ్య భారత మార్కెట్లో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ల కోసం 1,50,000 ప్రీ-బుకింగ్‌లు వచ్చాయి. ఇది తమ మార్కెట్ వాటాను మరింత పెంచుకునేందుకు మద్దతిస్తుందని ఆదిత్య పేర్కొన్నారు.గతంలో వచ్చిన ఫోల్డబుల్ ఫోన్ల కంటే ఈ ఏడాది వచ్చిన మేడ్-ఇన్-ఇండియా గెలక్సీ జీ ఫ్లిప్5, జీఫోల్డ్5 ప్రీ-బుకింగ్‌లు ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా టైర్-1, టైర్-2 నగరాలతో సమానంగా టైర్-3, టైర్-4 పట్టణాల నుంచి డిమాండ్ కనిపిస్తోంది. మార్కెట్ వాటాను పెంచేందుకు శాంసంగ్ దేశీయంగా తన స్టోర్లను 6 వేల నుంచి 10 వేలకు పెంచింది.

వర్షాభావ పరిస్థితులతో తగ్గిన చెరుకు సాగు

 దేశంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు విదేశీ వాణిజ్యాన్ని, ఎగుమతులను  తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ ఏడాది ఆశించినమేర వానలు కురవకపోవడంతో ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గనుంది. దీంతో ఇప్పటికే బాస్మతీయేతర తెల్ల బియ్యం, ఉల్లిగడ్డ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా చక్కెర ఎగుమతులను కూడా నిలిపివేయాలని  నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. దేశంలో చెరుకు పంటను అధికంగా పండించే రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల్లో  తగినంతగా వర్షాలు కురవలేదు. దీంతో చెరుకు పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంది. దీంతో దేశంలో చక్కెర ఉత్పత్తి కూడా పడిపోనుంది. రానున్న సీజన్‌లో ధరలను కట్టడి చేడయానికి వచ్చే సీజన్‌లో చక్కెర ఎగుమతులపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఇదే జరిగితే చక్కెర ఎగుమతులపై కేంద్ర నిషేధం విధించడం గత ఏడేండ్లలో ఇదే మొదటిసారి అవుతుంది.దేశీయ అవసరాలను తీర్చడంపై తాము ప్రస్తుతం దృష్టి సారించామని పేరుచెప్పడానికి ఇష్టపడని ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి తెలిపారు. మిగులు చెరకు నుంచి ఇథనాల్  ఉత్పత్తికి ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. రానున్న సీజన్‌లో ఎగుమతులకు సరిపడా చక్కెర తమ లేదని వెల్లడించారు. సెప్టెంబర్‌ 30తో ముగియనున్న ప్రస్తుత సీజన్‌లో 6.1 మిలియన్‌ టన్నుల షుగర్‌ ఎగుతులకే ప్రభుత్వ అనుమతించింది. గతేడాది ఇదే సమయంలో దేశం 11.1 మిలియన్‌ టన్నుల చక్కెరను విదేశాలకు ఎగుమతి చేసింది. రాబోయే 2023-24 సీజన్‌లో దేశంలో చక్కెర ఉత్పత్తి 3.3 శాతం అంటే 31.7 మిలియన్‌ టన్నులకు తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్‌తో మొదలయ్యే సీజన్‌లో చక్కెర ఎగుమతులను ప్రభుత్వం నిషేధించనుంది. ఇది ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే న్యూయార్క్, లండన్‌లలో  రికార్డు స్థాయికి చక్కెర ధరలు చేరాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలో మరోసారి ఆహార ద్రవ్యోల్బణం తలెత్తనుందనే ఆందోళనలు నెలకొన్నాయి.కాగా, ఆహార ద్రవ్యోల్బణంపై భారత్‌ ఇప్పటికే ఆందోళన చెందుతున్నది. జూలై నెలలో రిటైల్ ద్రవ్యోల్బణ 7.4 శాతానికి చేరుకుంది. గత 15 నెలల ఇదే గరిష్టం. ఇక ఆహార ద్రవ్యోల్బణం  11.5 శాతానికి చేరుకుంది. ఇది మూడేండ్లలో అత్యధికం.

మారుతీ సుజుకీ ఆల్‌ ఎలక్ట్రిక్‌ కూపే

జపనీస్ ఆటోమోటివ్ దిగ్గజం సుజుకి మోటార్ కార్పొరేషన్ గ్లోబల్, ఇండియన్ మార్కెట్‌ల కోసం తన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ వాహనంపై పని చేస్తోందనే వాస్తవం మనందరికీ తెలుసు. ఈ మోడల్‌ను ఈవీఎక్స్‌ అని పిలుస్తారు. ఈ మోడల్‌ను మొదట భారతదేశంలో ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించారు. అయితే పలు దేశాల్లో ఈ కారును పరీక్షించిన పలు సందర్భాల్లో ఈ కారును గుర్తించారు. ఇటీవల ఈ కచ్చితమైన ఎస్‌యూవీ మరొక టెస్ట్ మ్యూల్ స్పెయిన్‌లో పరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎస్‌యూవీ వివరాలు మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చాయి. ఎమోషనల్ వెర్సటైల్ క్రూయిజర్ అని కూడా పిలిచే ఈవీఎక్స్‌ మారుతి సుజుకికి సంబంధించిన మొట్టమొదటి ఈవీగా పేర్కొంటున్నారు. ఇది కూపే లాంటి ఎస్‌యూవీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ తాజా ఈవీఎక్స్‌ అభివృద్ధి చివరి దశలో ఉందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ ఎస్‌యూవీ స్పెయిన్‌లో పరీక్షిస్తున్న సమయంలో ఈ కారు డిజైన్‌ గురించి అందరికీ తెలిసింది.  ఈ ఈవీఎక్స్‌ జనవరి 2024 నాటికి ప్రారంభించే అవకాశం ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ కారు గురించి మరిన్ని వివరాలను ఓ సారి తెలుసుకుందాం.మారుతీ ఈవీఎక్స్‌ తాజా ఫొటోలను పరిశీలిస్తే ఈ ఎస్‌యూవీ పొడవు 4,300ఎంఎం, వెడల్పు 1,800ఎంఎం, ఎత్తు 1,600 ఎంఎంగా ఉంటుందని తెలుస్తుంది. ఈవీఎక్స్‌లో క్రోమ్ బార్, సాధారణ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. రాబోయే ఈ ఎస్‌యూవీ టాప్-స్పెక్ వెర్షన్‌లలో కంపెనీ ఈ లైట్లను ఆల్ ఎల్‌ఈడీ లైటింగ్‌కి అప్‌గ్రేడ్ చేస్తుందని భావిస్తున్నారు. ఈ రాబోయే ఎస్‌యూవీ గణనీయంగా మరింత ఆధునిక, అధునాతనంగా కనిపించే ఇంటీరియర్‌తో అమర్చబడిందని గత ఇమేజ్‌లను బట్టి తెలుస్తుంది.