Business

జీమెయిల్‌లో కొత్త అప్‌డేట్‌

జీమెయిల్‌లో కొత్త అప్‌డేట్‌

గతంలో మనుష్యుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలకు ఉత్తరాలు పంపుకునే వారు. ముఖ్యంగా అఫిషియల్‌ డేటా బట్వాడాకు కచ్చితంగా తపాల శాఖ ద్వారా ఉత్తరాలను పంపే వారు. మారుతున్న టెక్నాలజీ ప్రకారం అన్నీ మారాయి. ప్రస్తుత రోజుల్లో ఎలాంటి సమాచారమైన మన ఫోన్‌లోని యాప్స్‌ ద్వారా తెలుసుకునే సదుపాయం ఉంది. అయితే కొన్ని అఫిషియల్‌ ఉత్తర ప్రత్యుత్తరాల కోసం మెయిల్స్‌ను ఉపయోగించాల్సి వస్తుంది. ముఖ్యంగా మెయిల్స్‌లో జీ-మెయిల్‌ ఎక్కువ ప్రజాదరణ పొందింది. ఈ నేపథ్యంలో జీ-మెయిల్‌ వివిధ అప్‌డేట్స్‌ను తన వినియోగదారులకు అందిస్తుంది. ప్రతి ఒక్కరి స్మార్ట్‌ ఫోన్‌లో కూడా జీమెయిల్‌ యాప్‌ స్వయంచాలకంగా ఉంటుంది. అఫిషియల్‌ మెయిల్స్‌ చదవడంలో కొంతమేర ఇబ్బంది అవుతుంది. ఈ ఇబ్బందులను పరిష్కరించేలా గూగుల్‌లో ఓ తాజా అప్‌డేట్‌ అందుబాటులోకి వచ్చింది.

జీమెయిల్‌ వెబ్ వెర్షన్ మొత్తం ఈ-మెయిల్‌ను ఒకే క్లిక్‌లో అనువదించే ఎంపికను అందిస్తోంది. అయితే, జీమెయిల్‌ యాప్ ద్వారా అయితే ఈ సదుపాయం అందుబాటులో లేదు. కాబట్టి ఈ సదుపాయాన్ని జీ మెయిల్‌ యాప్‌లో కూడా అందుబాటులోకి తీసుకుచ్చింది. ఈ తాజా ఫీచర్‌ ప్రస్తుతం కొంతమంది వినియోగదారులకే అందుబాటులో ఉంది. మరికొన్ని రోజుల్లో అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఈ తాజా అప్‌డేట్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ మీ జీమెయిల్‌లో పని చేయాలంటే ముందుగా మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో జీమెయిల్‌ యాప్ తాజా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ వెర్షన్‌లో మాత్రమే కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఐఓఎస్‌ వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

జీ-మెయిల్‌ అనువాద లక్షణాలు ఇలా
జీమెయిల్‌ అనువాదం పేరు సూచించినట్లుగా, వినియోగదారులు మొత్తం ఈ-మెయిల్ సందేశాన్ని తమకు నచ్చిన భాషలోకి అనువదించడానికి అనుమతిస్తుంది. ఉదాహరణకు ఈ-మెయిల్ ఇంగ్లిష్‌లో ఉంటే మీరు దానిని ఫ్రెంచ్ లేదా హిందీకి అనువదించాలనుకుంటే మీరు దీన్ని చేయడానికి ఈ లక్షణాన్ని ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్ ‘ట్రాన్స్‌లేట్‌ టు’ అనే కొత్త బ్యానర్‌ని జోడిస్తుంది. దానిపై నొక్కడం ద్వారా భాషను ఎంచుకోవడానికి లేదా ఇప్పటికే ఎంచుకున్న భాషలోకి అనువాదాన్ని సూచించడానికి ఎంపికను అందిస్తుంది. కానీ అసలు భాషను చూపించడానికి ఒక ఎంపిక కూడా ఉంది.

100 భాషల్లో అందుబాటులో
జీ-మెయిల్‌ అనువాద ఫీచర్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న 100 భాషల్లో ఒకదాన్ని ఎంచుకోవడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. అలాగే ఈ-మెయిల్ భాష జీమెయిల్‌భాషతో సరిపోలనప్పుడు పాపప్ బ్యానర్ స్వయంచాలకంగా కనిపిస్తుంది. అయితే కుడి మూలలో ఉన్న మూడు-చుక్కల ఓవర్‌ఫ్లో మెనుపై నొక్కడం ద్వారా మొత్తం ఈ-మెయిల్ బాడీని మాన్యువల్‌గా అనువదించే ఎంపిక ఉంది.