* తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల లో భక్తుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న కంపార్ట్‌మెంట్లలో 7 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.నిన్న 71,122 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 29,121 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న మొక్కుల ద్వారా ఆలయానికి రూ.3.76 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.
* రేపు విజయనగరం జిల్లా పర్యటనకు జగన్
ఏపీ సీఎం జగన్ రేపు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు.ఇందులో భాగంగా మెంటాడ మండలం చినమేడపల్లికి వెళ్లనున్న ఆయన కేంద్రీయ గిరిజన యూనివర్సిటీకి శంకుస్థాపన చేయనున్నారు.ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా పాల్గొననున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.అనంతరం దత్తిరాజేరు మండలం మరడాంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు.కాగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వ విద్యాలయం నిర్మాణానికి ప్రభుత్వం సన్నద్ధమైన సంగతి తెలిసిందే.ఈ యూనివర్సిటీలో 17 కోర్సులను ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది.ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్న కోర్సులతో పాటు పరిశోధనల కోసం కూడా ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నారని సమాచారం.మరోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తుంది.
* 26న ఇస్రోకు ప్రధాని మోదీ
ప్రపంచ దేశాలన్నింటిలో ఎవరూ చేయలేని సాహసం.. ప్రయత్నించి ఫెయిల్ అయిన నాలుగు దేశాలు.. మొదటి ప్రయత్నంలో విఫలమైనా.. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించిన ఇస్రో.. ఎట్టకేలకు రెండో ప్రయత్నంలో విజయం సాధించింది. ఎవరూ చేరలేని చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపింది ఇస్రో రూపొందించిన చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్. ఇంతటి ఘనత సాధించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల బృందాన్ని అభినందించడానికి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం బెంగళూరుకు రానున్నట్లు సంబంధింత వర్గాలు తెలిపాయి.ప్రస్తుతం మోదీ సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటన ముగించుకుని ఇండియా వచ్చిన తర్వాత ఆయన.. ఆగస్టు 26న సాయంత్రం 7 గంటలకు ఇస్రోను సందర్శించనున్నట్లు తెలిసింది. రెండు గంటలపాటు ఇస్రో శాస్త్రవేత్తలతో మోదీ ఉంటారని సమాచారం. వారిని అభినందించిన తర్వాత దిల్లీకి తిరిగి వస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. బుధవారం అక్కడి నుంచి చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌ను వీక్షించారు. తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగించి ఇస్రో బృందాన్ని అభినందించారు.
* చిలకలూరిపేటలో పార్టీ పరిస్థితిపై విజయ సాయి రెడ్డి ఫైర్
పల్నాడు జిల్లా వైసీపీపై విజయ సాయి రెడ్డి సమీక్ష నిర్వహించారు. నరసరావుపేటలో పార్టీ ముఖ్య నేతలతో విడివిడిగా భేటీ అవుతున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై విజయ సాయి రెడ్డి సమీక్ష నిర్వహించారు.చిలకలూరిపేటలో పార్టీ పరిస్థితిపై విజయ సాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. మంత్రి విడదల రజనీ వ్యవహారశైలిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయని సమాచారం. ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయులు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌లతో సఖ్యత లేదని ఐప్యాక్ నివేదిక వెలువరించిందని సమాచారం. గ్రూపులతో నియోజకవర్గం పార్టీ పట్టు కోల్పోయిందని ఐ ప్యాక్ నివేదికలో పేర్కొందని సమాచారం. కలిసి పని చేయాలని విజయ సాయి రెడ్డి హెచ్చరించినట్లు సమాచారం.
* లోకేష్ కు పోలీస్ నోటీసులు ఎందుకో తెలుసా?
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్న వైసిపి నాయకుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇకపై రెచ్చగొట్టేలా, వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేయవద్దంటూ పోలీసులు లోకేష్ కు నోటీసులు జారీచేసారు. ఈ నోటీసులు అందించడానికి వెళ్లిన పోలీసులు లోకేష్ ను కలవలేకపోవడంతో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణకు ఈ నోటీసులు అందించారు. ఆయన ఈ పోలీస్ నోటీసులను లోకేష్ కు అందించారు. మాజీ మంతి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలపై లోకేష్ అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ గుడివాడలో కూడా పోలీసులకు పిర్యాదులు అందాయి. నాని,వంశీ లను గుడ్డలూడదీసి కొట్టిస్తానని అవమానకరంగానే కాదు చంపేస్తాననే విధంగా లోకేష్ మాట్లాడారంటూ గుడివాడ వైసిపి నాయకులు పోలీసులకు పిర్యాదు చేసారు. టిడిపి నాయకులను రెచ్చగొడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా లోకేష్ మాటలు వున్నాయని పేర్కొన్నారు. లోకేష్ తో పాటు మరికొందరు టిడిపి నాయకులు కూడా ఇలాగే రెచ్చగొట్టేలా మాట్లాడారని… వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వైసిపి నాయకులు కోరారు. ప్రస్తుతం నారా లోకేష్ పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. గన్నవరంలో పాదయాత్ర చేస్తున్న లోకేష్ సమక్షంలో వైసిపి నాయకుడు యార్లగడ్డ వెంకట్రావు టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వైసిపి మాజీ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేపై లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయాలతో ఏ సంబంధం లేని తన తల్లిని అవమానించిన కొడాలి నానిని బట్టలూడదీని డ్రాయర్ పైనే రోడ్డుపై తిప్పుతూ కొట్టిస్తానని లోకేష్ హెచ్చరించారు. అలాగే మాజీ మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే వంశీ లపైనా తీవ్ర విమర్శలు చేసారు లోకేష్.టిడిపి కార్యకర్తల్ని వేధించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను… వడ్డీతో సహా చెల్లిస్తానని లోకేష్ హెచ్చరించారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారిని గుండెల్లో పెట్టుకుంటామని అన్నారు. టిడిపి నాయకులు, కార్యకర్తల్ని వేధించిన వారు కృష్ణా జిల్లాలో ఉన్నా, విదేశాలకు పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తామన్నారు. చట్టాలు అతిక్రమించిన అధికారులపైనా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని లోకేష్ హెచ్చరించారు.ఇలా మాజీ మంత్రులు, ఎమ్మెల్యే వంశీపై లోకేష్ మాత్రమే కాదు మిగతా టిడిపి నాయకులు కూడా ధ్వజమెత్తారు. దీంతో వైసిపి నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఇలా అందిన ఓ ఫిర్యాదుపై స్పందిస్తూనే పోలీసులు లోకేష్ కు నోటీసులు జారీ చేసారు.
* కామారెడ్డి నుంచి పోటీపై విజయశాంతి స్పందన
సినీ నటి, బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల బరిలోకి దిగుతున్నారు. కామారెడ్డిలో కేసీఆర్ పై విజయశాంతిని బరిలోకి దింపాలని బీజేపీ నాయకత్వం భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. దీనిపై స్వయంగా విజయశాంతి స్పందించారు.కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో నా పోటీ విషయం మా పార్టీ నిర్ణయిస్తుంది. రెండు రోజులుగా పాత్రికేయ మిత్రులు, మీడియాలో వస్తున్న వార్తల ప్రసారాలపై అడుగుతున్న ప్రశ్నలకు నా సమాధానం ఇంతే. బీజేపీ కార్యకర్తలం ఎవరైనా పార్టీ ఆదేశాలను పాటించడం మాత్రమే మా విధానం. ఏది ఏమైనా కామారెడ్డి, గజ్వేల్ రెండు నియోజకవర్గాలలో బీజేపీ గెలుపు, తెలంగాణ భవిష్యత్తుకు తప్పనిసరి అవసరం. ఇది ప్రజలకు తెలియపర్చటం తెలంగాణ ఉద్యమకారుల అందరి బాధ్యత’ అని విజయశాంతి ట్వీట్ చేశారు.
* కొడంగల్ నుంచే రేవంత్ రెడ్డి పోటీ
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను కొడంగల్ నుంచే పోటీచేస్తానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన…. స్థానికంగా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిని కలిశారు. అనంతరం, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో సమావేశమై పోటీ అంశంపై చర్చించారు. టికెట్ కోసం తన తరఫున కొడంగల్ కాంగ్రెస్ నేతలు ఇవాళ గాంధీభవన్‌లో దరఖాస్తు అందజేస్తారని రేవంత్ రెడ్డి వెల్లడించారు.ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసే కేసీఆర్ ఆపద మెక్కులు మొక్కుతున్నాడని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నాలుగేళ్లుగా పట్నం మహేందర్ రెడ్డికి అపాయిట్‌మెంట్ ఇవ్వని కేసీఆర్…. ఓట్ల కోసం మంత్రిని చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో గెలుపు కోసం కేసీఆర్.. డబ్బు, మద్యం, దౌర్జన్యాన్ని నమ్ముకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ శ్రేణులు కేసీఆర్‌ను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.మరోవైపు ఈ నెల 26వ తేదీన రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ప్రజాగర్జన సభ జరగనుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరై ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటిస్తారని తెలిపారు.
* బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత
హైదరాబాద్ చేప మందుగా పేరుగాంచిన బత్తిని హరినాథ్ గౌడ్ మృతి చెందారు. అనారోగ్యంతో హైదరాబాద్ బొలక్ పూర్ పద్మశాలి కాలనీలో ఆయన నివాసంలో పరిస్థితి విషమించడంతో బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. బత్తినీ హరినాథ్ గౌడ్ కు బార్య సునిత్రదేవి, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పాత బస్తీ లోని దూద్ బౌలి కి ప్రాంతానికి చెందిన బత్తిని సోదరులు ఐదుగురు శివరాం, సోమ లింగం, విశ్వనాథ్, హరినాథ్ గౌడ్, ఉమా మహేశ్వర్ వీరిలో ఇప్పటికే ముగ్గురు చనిపోగా బుధవారం హరినాథ్ గౌడ్ మృతి చెందగా విశ్వనాథ్ ఒక్కరే ఉన్నారు. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజున హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బత్తిని కుటుంబ సభ్యులు చేపమందు పంపిణీ చేస్తారు. చేప ప్రసాదం కోసం తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు నగరానికి వస్తుంటారు.
* దూకుడు పెంచుతున్న తెలంగాణ కాంగ్రెస్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో అధికార పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి.. టాప్ గేర్‌లో దూసుకెళ్తోంది. అయితే, ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ కూడా వ్యూహాలను అమలు చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు నియోజకవర్గాల వారీగా ఆశవాహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డుతోన్న కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే వరుస డిక్లరేషన్లు ప్రకటిస్తో్ంది. ముందు, వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్, ఈమధ్యే హైదరాబాద్‌లో యూత్ డిక్లరేషన్ కూడా అనౌన్స్ చేసింది. ఇక, ఇప్పుడు మరో డిక్లరేషన్‌ని రెడీ అవుతోంది టీకాంగ్రెస్. అత్యధిక జనాభా కలిగిన బీసీలను ఆకట్టుకునేందుకు ప్రజాకర్షక పథకాలకు రూపకల్పన చేస్తోంది. రైతు డిక్లరేషన్‌ను రాహుల్‌గాంధీ ప్రకటిస్తే, యూత్ డిక్లరేషన్‌ను ప్రియాంకా గాంధీ చేత అనౌన్స్ చేయించారు. ఇప్పుడు బీసీ డిక్లరేషన్‌ను… బీసీ నేత, కర్నాటక సీఎం సిద్ధరామయ్య చేతుల మీదుగా ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా బెంగళూరుకు వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా బీసీ డిక్లరేషన్ గురించి ఆయనకు వివరించి ఆహ్వానించారు.బీసీ డిక్లరేషన్ కోసం ఇప్పటికే డ్రాఫ్ట్ పూర్తి చేశామని కర్నాటక సీఎం సిద్ధరామయ్యకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్, వీహెచ్ హనుమంతరావు వివరించారు. ఇంకా అందులో పొందుపరచాల్సిన విషయాలను కూడా ఆయనతో మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆహ్వానానికి సిద్ధరామయ్య సానుకూలంగా స్పందించారు. అయితే, కర్నాటక సీఎం సిద్ధరామయ్య …డేట్ ఇవ్వగానే బీసీ డిక్లరేషన్ సభ తేదీని ప్రకటిస్తామని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క వెల్లడించారు.
* హిమాచల్ ప్రదేశ్‌లో వర్షం బీభత్సం
హిమాచల్ ప్రదేశ్‌లో వర్షం బీభత్సం కొనసాగుతోంది. గతకొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వానలకు రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. కులు జిల్లాలోని అన్నీ అనే ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. చూస్తూండగానే పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. బస్టాండ్ సమీపంలోని ఏడు పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి. భవనాల శిథిలాల కింద అనేకమంది చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ వీడియోలో..బహుళ అంతస్తుల భవనాలు పేకమేడల కుప్పకూలడం, భారీగా దుమ్ము లేవడం కనిపిస్తోంది. వెన్నులో వణుకు పుట్టించే దృశ్యాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇక కులు జిల్లాలోని అన్నీ టౌన్‌లో ఉన్న భారీ బిల్డింగ్‌లు కూలిపోయాయి. అయితే భవనాలకు పగుళ్లు ఏర్పడటంతో మూడు రోజుల క్రితమే ఆ బిల్డింగ్‌ల నుంచి జనాన్ని తరలించారు. కులు-మండి హైవేపై భారీ వర్షం వల్ల వాహనాలు నిలిచిపోయాయి.ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎస్ వంటి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌కు భారత వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. నేటి నుంచి మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.ఇళ్లు కూలిన ఘటనపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు స్పందించారు. కులులో కొండచరియలు విరిగిపడటంతో భారీ భవనాలు కూలిపోతున్న దృశ్యాలు కలవరపరిచాయని తెలిపారు. అయితే రెండు రోజుల ముందే ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు.ఆ బిల్డింగ్‌ల నుంచి ప్రజలను వేరే ప్రాంతానికి తరలించారని ట్విటర్‌లో పేర్కొన్నారు.