రాష్ట్రంలో విద్యారంగంపై సిఎం కెసిఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది విద్యారంగానికి రూ.29,613 కోట్ల బడ్జెట్ కేటాయించారని మంత్రి గుర్తుచేశారు. గురువారం మధ్యాహ్నం మంత్రి సబితా ఇంద్రారెడ్డి టీఆర్ టీ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గురుకుల విద్యాసంస్థల్లో రాష్ట్రం గర్వించే స్థాయిలో ఫలితాలు వస్తున్నాయని కొనియాడారు. గురుకులాల్లో మరిన్ని సదుపాయాలు కల్పించడం, వాటిని అప్ గ్రేడ్ చేయడంలో విద్యాశాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని చెప్పారు. కొన్ని గురుకులాలను డిగ్రీ కాలేజీ స్థాయికి అప్ గ్రేడ్ చేసినట్లు మంత్రి గుర్తుచేశారు. గురుకులాల్లో 11,714 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టామని వివరించారు.
తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీకి 2 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సబితా ఇంద్రా రెడ్డి వెల్లడించారు. మొత్తంగా 6,500కు పైగా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇందులో పాఠశాల విద్యలో 5,089, స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూళ్లలో 1,523 పోస్టులు ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థల స్థాయిలో తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. 5,310 టీచర్ పోస్టులు భర్తీ చేశామని, కాంట్రాక్టు ఉద్యోగులను ఇప్పటికే క్రమబద్ధీకరించామని చెప్పారు. దీంతో పాటు వివిధ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నామని వివరించారు. ఇంటర్, డిగ్రీ స్థాయిలో 3,140 పోస్టులకు సంబంధించిన భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని మంత్రి సబిత తెలిపారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో నడుస్తోందని, ప్రపంచం అబ్బురపడేలా సాగునీటి ప్రాజెక్టులు కట్టుకున్నామని చెప్పారు. నీళ్లు, నిధులకు సంబంధించి ఉద్యమకాలం నాటి ఆకాంక్షలు ఇప్పటికే నెరవేరాయని, నియామకాలకు సంబంధించిన ఆకాంక్షలు కొనసాగుతున్నాయని వివరించారు. కెసిఆర్ పాలనలో ప్రైవేటు రంగంలోనూ భారీగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడ్డాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.