Business

హైదరాబాద్‌కు రానున్న మరో కార్పొరేట్‌ దిగ్గజ సంస్థ

హైదరాబాద్‌కు రానున్న మరో కార్పొరేట్‌ దిగ్గజ సంస్థ

తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు మరో రెండు అంతర్జాతీయ కార్పొరేట్ దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక, బీమా సేవల సంస్థగా పేరొందిన మెట్‌లైఫ్‌… తమ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాన్ని(గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్‌) హైదరాబాద్‌లో స్థాపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు.. హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను భారీగా విస్తరించడానికి ‘గ్లోబల్‌ హెల్త్‌ కేర్‌ ఎక్స్ఛేంజ్‌(జీహెచ్‌ఎక్స్‌)’ అనే మరో కార్పొరేట్‌ సంస్థ ప్రణాళికలను ప్రకటించింది.అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌తో గురువారం ఆయా సంస్థల ప్రతినిధులు సమావేశమై, పలు అంశాలను చర్చించారు. ప్రపంచంలోనే అత్యధిక మందికి బీమా, ఆర్థిక సేవలు అందిస్తున్న మెట్‌లైఫ్‌ సంస్థ .. హైదరాబాద్‌లో తన గ్లోబల్‌ క్యాపబిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుండటంపై కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. న్యూయార్క్‌లో విద్యార్థిగా, ఉద్యోగిగా పనిచేస్తున్న కాలంలో మెట్‌లైఫ్‌ కార్యాలయ భవన రాజసం, నిర్మాణ శైలి తనను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసేవని ఆయన గుర్తుచేసుకున్నారు.

మరోవైపు న్యూయార్క్‌లో గ్లోబల్‌ హెల్త్‌ కేర్‌ ఎక్స్ఛేంజ్‌ (జీహెచ్‌ఎక్స్‌) సంస్థ తమ కార్యకలాపాలను భారీగా విస్తరించడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు హెల్త్‌ కేర్‌, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ రంగాలకు చేయూతను అందిస్తూనే… ఐటీ ఆధారిత కార్యకలాపాలను కూడా పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. తమ ఆలోచనలను బలోపేతం చేస్తూ జీహెచ్‌ఎక్స్‌ తన విస్తరణ ప్రణాళికలను హైదరాబాద్‌ కేంద్రంగా ప్రకటించడం అభినందనీయం అని అన్నారు.