ద్వీపకల్ప దేశం బాలీని (Bali) సందర్శించే టూరిస్టులు ఇకపై ఎంట్రీ ఫీజు (Entry Fee) కింద 10 డాలర్లు (సుమారు రూ.820) చెల్లించాల్సి ఉంటుంది. 2024 ఫిబ్రవరి నుండి ఈ నిబంధన అమలులోకి వస్తుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇక ఈ నిధులను పగడపు దిబ్బలు, మడ అడవులు, ఇతర స్థిరమైన ప్రాజెక్టుల పరిరక్షణకు వినియోగిస్తామని టూరిజం కార్యాలయ అధిపతి త్జోకోర్డా బాగస్ పెమాయున్ గురువారం ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. దీనికి సంబంధించిన ఇతర నియమ నిబంధనలు ఇంకా చర్చల దశలో ఉన్నట్లు చెప్పారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
ఇదిలాఉంటే.. కరోనా కారణంగా కొంతకాలం పాటు బాలీలో ఆగిపోయిన టూరిజం తిరిగి ఈ గతేడాది మార్చిలో ప్రారంభమైంది. టూరిస్టులకు తిరిగి ఆహ్వానం పలకడంతో ప్రస్తుతం అక్కడ టూరిజం మళ్లీ మునుపటి జోరును అందుకుంది. అంతర్జాతీయ సందర్శకుల (International Tourists) సంఖ్య అందులోనూ ఆస్ట్రేలియా, భారత్, రష్యా నుండి భారీ పెరిగింది. జూలై నాటికే ఈ ద్వీపకల్పం ఇప్పటికే దాని వార్షిక పర్యాటక లక్ష్యాలను అధిగమించింది. ఈ ఏడాది జనవరి నుంచి మే చివరి వరకు మొత్తం 4.25 మిలియన్ల మంది సందర్శకులు ద్వీపాన్ని సందర్శించారు.