DailyDose

కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు-TNI నేటి తాజా వార్తలు

కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు-TNI నేటి తాజా వార్తలు

తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది.  2023 ఆగస్టు 25 శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చారు.   శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 18 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా, సర్వదర్శనానికి 18గంటల సమయం పడుతోంది.  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా  తిరుమల తిరుపతి దేవస్థానం  (టీటీడీ) అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక గురువారం తిరుమల  శ్రీవారిని 67 వేల 308 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.  శ్రీవారి హుండీ ఆదాయం 3.82 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 26 వేల 674 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

సచివాలయంలో ప్రార్థనా మందిరాలను ప్రారంభించిన తమిళి సై కేసీఆర్‌

రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో గుడి, చర్చి, మసీదుల ప్రారంభం ఘనంగా జరిగింది. సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా నిర్మించిన ప్రార్థనా మందిరాలను గవర్నర్‌ తమిళిసైతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) ప్రారంభించారు. నల్లపోచమ్మ ఆలయ పూర్ణాహుతి కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై‌, సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చర్చి ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. అనంతరం మసీదును ప్రారంభించారు. ఈ సందర్భంగా నమాజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, జగదీశ్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, మహమూద్‌ అలీ, మల్లారెడ్డి, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

కవితపై బండి సంజయ్ సెటైర్లు

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎమ్మెల్సీ కవితపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితకు బీఆర్ఎస్ టికెట్ ఇస్తే 33 శాతం మహిళలకు ఇచ్చినట్లేనంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. బిఆర్ఎస్ నేతలు చాలామంది బిజెపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందని సర్వేలన్నీ చెబుతున్నాయని జోస్యం చెప్పారు. కెసిఆర్ తన బిడ్డ కవితకు టికెట్ ఇస్తే 33% మహిళలకు టికెట్ ఇచ్చినట్లే అంటూ ఎద్దేవా చేశారు.ఇప్పటికే ప్రకటించిన 115 మందిలో సగం మందికి సీఎం కేసీఆర్ బీఫామ్ ఇవ్వరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ క్యాడర్ను కాపాడుకోవడం కోసం జిమ్మిక్కులు చేస్తున్నారన్నారు. అనేక సర్వేలు  ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ కి 25 సీట్లు మాత్రమే వస్తాయని చెబుతున్నాయన్నారు. 30మంది కాంగ్రెస్ నేతలకు కేసిఆర్ డబ్బులు ఇచ్చి బరిలోకి దింపుతున్నాడు.  హిందువుల ఓట్ల కోసం కేసీఆర్ కొత్త నాటకానికి తెర లేపుతున్నారు’ అని బండి సంజయ్ ఆరోపించారు.ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్ర బిజెపి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే సోమవారంనాడు ఆయన విజయవాడకు వెళ్లారు. అక్కడ బిజెపి ఓటర్ చేతన్ మహాభియాన్ కార్యక్రమం జరిగింది.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్  వైయస్ జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. అదే సమయంలో గతంలో పవన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ బండి సంజయ్ ఇప్పుడు ఆయనను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించినట్లుగా కనిపిస్తోంది.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తనదైన స్టైల్ లో ప్రశంసల వర్షం కురిపించారు. అటు వైయస్ జగన్ పై విమర్శలు కురిపిస్తూనే, ఇటు పవన్ కళ్యాణ్ ను పొగడ్తలతో ముంచేతడంతో బండి సంజయ్ రూట్ మారిందా? అని  చర్చించుకుంటున్నారు. గతంలో తెలంగాణలో జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో బండి సంజయ్ పవన్ కళ్యాణ్ ను తక్కువ చేసి మాట్లాడారు.  ఇప్పుడు పవన్ మీద ప్రశంసలు కురిపిస్తుండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.తెలంగాణలో జరిగిన జీహెచ్ఎంసి ఎన్నికల సమయంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ అవసరం తమకు లేదన్నారు. అప్పట్లో బండి సంజయ్ తెలంగాణ బిజెపి చీఫ్ గా ఉన్నారు. అంతేకాదు జనసేన రాజకీయాలను ఆంధ్రప్రదేశ్లో చూసుకోవాలంటూ ఎద్దేవా చేశారు.  తెలంగాణలో బిజెపితో పొత్తు అవసరం లేదని.. ఆ విషయం ప్రతిపాదనకు రాలేదని.. ఆంధ్రప్రదేశ్ లోనే జనసేనతో బిజెపికి పొత్తు అంటూ ఘాటుగా మాట్లాడారు.ఆ సమయంలో బండి సంజయ్ వ్యాఖ్యలపై జనసేన కార్యకర్తలు తీవ్ర అగ్రహావేశాలకు లోనయ్యారు. తమ అధినేతను అవమానించేలా మాట్లాడారని బండి సంజయ్ పై మండిపడ్డారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ప్రస్తుతం బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవిలో లేరు. పార్టీ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.ఏపీలో పూర్తిగా కాకపోయినా… బిజెపి ఓట్ల నమోదు కార్యక్రమం బాధ్యతలను బండి సంజయ్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే విజయవాడకు వచ్చిన బండి సంజయ్ పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. ఇది తన ఉనికిని చాటుకునేందుకే అని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ కు చాలా ఫాలోయింగ్ ఉందంటూ మాట్లాడారు. వైసిపి పవన్ కళ్యాణ్ చేస్తున్న వారాహి యాత్రను అడ్డుకోవడం హేయమైన చర్య అంటూ వైసీపీపై మండిపడ్డారు.

కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగ

 తిరుపతి నుంచి సికింద్రాబాద్‌ వెళ్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రైలులో శుక్రవారం ఉదయం పొగలు వచ్చాయి. ఏసీ బోగీ చక్రాల నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన ప్రయాణికులు.. తిరుపతి జిల్లా వెంకటగిరి-ఎల్లకారు మధ్య చైన్‌ లాగి రైలును నిలిపివేశారు. రైల్వే కోపైలట్‌, సిబ్బంది ఏసీ బోగీ వద్దకు వచ్చి పరిశీలించారు. బ్రేకులు పట్టేయడంతో పొగలు వచ్చినట్లు వారు తెలిపారు. ఈ ఘటనతో దాదాపు 20 నిమిషాలపాటు రైలు నిలిచిపోయింది. అనంతరం మరమ్మతులు చేపట్టడంతో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ యథావిధిగా బయల్దేరింది. ప్రయాణికులు సకాలంలో పొగలు రావడాన్ని గుర్తించడంతో చక్రాల నుంచి మంటలు వ్యాపించకముందే ప్రమాదం తప్పింది.

* అవనిగడ్డలో వైసీపీ టీడీపీ మధ్య ఫ్లెక్సీల వార్

కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైసీపీ, టీడీపీల మధ్య ఫ్లెక్సీల వార్ నెలకొంది. అవనిగడ్డ మండలంలోని పులిగడ్డ దగ్గర టీడీపీ, వైసీపీ శ్రేణుల ఫ్లెక్సీలు వెలిశాయి. ఇరువర్గాలు పోటాపోటీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాలు.. టీడీపీ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ రైతు సమస్యలపై సత్యాగ్రహ దీక్షకు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఇందుకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.అయితే వైసీపీ శ్రేణులు కావాలనే రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఫ్లెక్సీలు వేసి రెచ్చగొట్టాలని కుట్ర జరుగుతోందని మండలి బుద్దప్రసాద్ ఆరోపించారు. పార్టీ కార్యకర్తలు, రైతులు సంయమనంతో వ్యవహరించి సత్యాగ్రహ కార్యక్రమం విజయవంతం చేయడం పైనే దృష్టి పెట్టాలని కోరారు.

ఏపీలో వ్యూహం మార్చిన బీజేపీ

ఏపీలో బీజేపీ వ్యూహం మార్చింది.. విపక్షాలన్నీ ఏకం కావాలని మిత్రపక్షం జనసేన పదేపదే చెబుతుంటే.. బీజేపీ మాత్రం సొంతంగా బలపడతామంటోంది. విశాఖలో జరిగిన పదాదికారుల సమావేశంలో పొత్తుల అంశం పక్కనపెట్టి మరీ పార్టీ బలోపేతంపైనే చర్చించారు. కేడర్‌నే నమ్ముకోవాలంటూ బలమైన సంకేతాలు ఇచ్చారు. కీలక సమావేశంలోనూ పొత్తులపై ప్రస్తావించకపోవడం ద్వారా పార్టీ ఇచ్చిన సందేశం ఏంటి? జనసేన మిత్రపక్షం అంటూనే ప్రస్తుతానికి పొత్తులను సైడ్‌ ట్రాక్‌లో పెట్టారా?ఏపీలో సొంతంగా ఎదగాలనుకుంటున్న బీజేపీ.. విశాఖ కేంద్రంగా జరిగిన రాష్ట్ర పదాదికారుల సమావేశంలో సందేశం ఇదే. రాష్ట్రంలో సంస్థాగతంగా బలపడాలని, ఇందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేయాలని నిర్ణయించారు పార్టీ పెద్దలు. పార్టీకి బలం కార్యకర్తలు.. ఆ కార్యకర్తల అండతోనే బలమైన శక్తిగా రాష్ట్రంలో ఎదగాలని బీజేపీ భావిస్తోంది.అత్యంత కీలకమైన పార్టీ పదాదికారుల సమావేశంలో పొత్తులపైనా, మిత్రపక్షం జనసేనతో కలిసి ఉద్యమించాల్సిన అవసరాన్ని పార్టీ అధ్యక్షురాలు ప్రస్తావించకపోవడంతో మరోసారి ఈ ఊహాగానాలు జోరందుకున్నాయి. 2020లో రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. అయితే జనసేన తమ మిత్రపక్షమే అంటున్న బీజేపీ ఏనాడూ ఉమ్మడి కార్యాచరణతో జనాల ముందుకు రాలేదు. చివరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ పోటీచేసినా జనసేన మద్దతు కోరలేదు. గతంలో సోము వీర్రాజు సారధ్యంలోని రాష్ట్ర బీజేపీ కమిటీ జనసేనతో కలిసి ఉద్యమించిన సందర్భాలు లేవు. కొత్తగా పార్టీ బాధ్యతలు తీసుకున్న పురంధేశ్వరి పదేపదే జనసేన అధ్యక్షులు పవన్‌తో కలిసి భవిష్యత్తుపై చర్చిస్తామని ప్రకటించినా ఇంతవరకూ భేటి జరగలేదు. తాజాగా జరిగిన మీటింగ్‌లోనూ కేడర్‌కు పొత్తులపై సరైన స్పష్టత కూడా ఇవ్వలేదు.

ఖమ్మంలో తుమ్మల బలప్రదర్శన

హైదరాబాద్ నుంచి నుంచి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం చేరుకున్నారు.  ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావుకు నాయకన్ గూడెం వద్ద ఆయన అనుచరులు భారీగా స్వాగతం పలికారు. బీఆర్ఎస్ జెండాలు లేకుండానే తుమ్మల ర్యాలీ నిర్వహిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భావించారు. బీఆర్ఎస్ పాలేరు టికెట్ ఆశించారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలేరు టికెట్ ను కందాల ఉపేందర్ రెడ్డికి కేటాయించారు. దీంతో తుమ్మల అనుచరులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఆయన్ను పార్టీ మారాల్సిందిగా అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మంలో భారీ బలప్రదర్శన చేస్తున్నారు. నాయకన్ గూడెం నుంచి ఖమ్మంలోని తన నివాసం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీ తర్వాత… ఖమ్మంలో ముఖ్య నేతలు, అనుచరులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు తుమ్మల. బీఆర్ఎస్ టిక్కెట్ దక్కకపోవడం, భవిష్యత్ కార్యాచరణపై ఈ మీటింగ్ లో తుమ్మల కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత…. కొంత సైలెంట్ అయ్యారు తుమ్మల. ఆయనకు ఎమ్మెల్సీ పదవి వస్తుందని అనుచరులు, ముఖ్య నేతలు భావించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తిరిగి కందాలకే టిక్కెట్ ఇచ్చారు సీఎం కేసీఆర్.

కేసీఆర్‌పై బండి సంజయ్‌ సెటైరికల్‌ కామెంట్స్‌

 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. కేసీఆర్‌ మళ్లీ గెలిస్తే చంద్రమండలం కూడా ఖతమే అంటూ పొలిటికల్‌ పంచ్‌లు విసిరారు. నటనలో కేసీఆర్‌ను మించినోడు లేడంటూ సెటైర్‌ వేశారు. కాగా, బండి సంజయ్‌ శుక్రవారం మీడియాతో మాట్లడుతూ.. కేసీఆర్‌ మళ్లీ గెలిస్తే చంద్రుడిపై కూడా భూమలిస్తానంటాడు. కేసీఆర్‌ ప్రకటించిన సీట్లన్నీ ఉత్తుత్తివే. ఒకరికి టికెట్‌ ఇచ్చి.. మరొకరిని ఇంటికి పిలుస్తున్నాడు. యాక్టింగ్‌లో కేసీఆర్‌ను మించిన వ్యక్తి మరోకరు లేరు అంటూ ఘాటు విమర్శలు చేశారు. మరోవైపు.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌పై ప్రజలకు నమ్మకం పోయింది. బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే శక్తి బీజేపీకే ఉంది. రూ.6వేల కోట్లు ఇచ్చి నన్ను ఓడించాలని చూశారు. ప్రజలు న్యాయంవైపు ఉండి నన్ను గెలిపించారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలిచింది. నాలుగేళ్లలో ఎక్కడా కూడా కాంగ్రెస్‌ గెలవలేదు. కేసీఆర్‌ను ఎదుర్కొనే శక్తి బీజేపీకి తప్ప మరో పార్టీకి లేదు.తెలంగాణలో నియంతపాలన పోవాలని ఇక్కడికి ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్‌ షాలు వస్తున్నారు. కేవలం మోదీ చేతుల్లోనే ఈ దేశం క్షేమంగా ఉంటుంది. ఈనెల 27వ తేదీన ఖమ్మంలో అమిత్‌ షా సభ ఉంటుంది. వ్యవసాయ పనులు ఉన్నప్పటికీ సభకు హాజరు కావాలని ప్రజలను కోరుతున్నాను. కేసీఆర్‌కు పేదా, ధనికా తెలియదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

మూడు చోట్ల దరఖాస్తు చేసిన పొంగులేటి

ఖమ్మం జిల్లా రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌కు గట్టి పట్టున్న ఆ జిల్లాలో.. ఎవరెక్కడ పోటీ చేస్తారనే సస్పెన్స్ కొనసాగుతోంది. బీఆర్ఎస్ (BRS Party) నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో (Khammam District) హస్తం గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జిల్లాలో ఉన్న పదింట్లో ఒక్క సీటును కూడా కారు పార్టీ గెలవకుండా చూస్తానంటూ భీషణ ప్రతిజ్ఞ చేసిన ఆయన.. తాను ఎక్కడ పోటీ చేయాలో మాత్రం డిసైడ్ అవ్వలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు జనరల్ స్థానాలు ఉండగా.. ఆ మూడు స్థానాలకు టిక్కెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్న పొంగులేటి.. ఏ స్థానం నుంచైనా పోటీకి రెడీ అన్న సంకేతాలు పంపారు. ఇంతకీ పొంగులేటి ఎక్కడి నుంచి పోటి చేయనున్నారు? మిగిలిన రెండు స్థానాల్లో బరిలో దిగే నేతలెవరు?ఖమ్మం జిల్లా రాజకీయం ఎప్పుడూ భిన్నమే.. ఒకప్పుడు కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండే ఉమ్మడి ఖమ్మం.. ఆ తర్వాత కాంగ్రెస్ కంచుకోటగా మారిపోయింది. తెలంగాణా వ్యాప్తంగా కారు జోరు సాగినా… ఇక్కడ మాత్రం అధికార బీఆర్ఎస్‌కు ఆశాజనక ఫలితం దక్కలేదు. ఐతే కమ్యూనిస్టులు లేదంటే కాంగ్రెస్క్‌కే జైకొడుతున్నారు ఖమ్మం జిల్లా ఓటర్లు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పట్టుబిగించాలని చూసిన బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ పొంగులేటి ఆదిలోనే హంసపాదుగా మారారు. ఐదేళ్లుగా బీఆర్ఎస్‌లో కొనసాగిన పొంగులేటి రెండు నెలల క్రితమే కాంగ్రెస్‌లో చేరారు. ఇక అప్పటి నుంచి తన సత్తా చూపిస్తానని.. ఖమ్మంలో కారు పార్టీ అడ్రస్ లేకుండా చేస్తానంటూ శపథాల మీద శపథాలు చేస్తున్నారు.ఖమ్మం ఎంపీగా పనిచేసిన పొంగులేటికి అంగ, అర్ధ బలాల్లో తిరుగులేదు. జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా గెలుస్తాననే ధైర్యం ఆయనది. ఐతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 స్థానాలకు కేవలం మూడు మాత్రమే జనరల్ స్థానాలు. మిగిలిన ఏడు సీట్లు ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాలు. కాగా, ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న కాంగ్రెస్‌కు పొంగులేటి షాకిచ్చారు. ఏకంగా జిల్లాలో మూడుకు మూడు జనరల్ స్థానాలైన ఖమ్మం, కొత్తగూడెం (Kothagudem), పాలేరు (Palair) స్థానాల నుంచి తనకు టిక్కెట్ కావాలంటూ పొంగులేటి దరఖాస్తు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే స్థానాలు ఇవే

తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే స్థానాలపై నల్లగొండ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 70 స్థానాలు గెలవబోతోందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తామన్నారు. రాహుల్ ప్రధాని అయ్యేందుకు 5 రాష్ట్రాల ఎన్నికలు మొదటి అడుగు అన్నారు. ప్రతి తెలంగాణ పౌరుడి మీద రూ.లక్ష అప్పు ఉందన్నారు. దేశంలోనే అత్యంత అవినీతి తెలంగాణలోనే ఉందన్నారు.అవినీతిని 119 ముక్కలు చేసి ఎమ్మెల్యేల సామ్రాజ్యాలుగా మార్చేశారని ఫైర్ అయ్యారు. సాండ్, ల్యాండ్, వైన్స్ లతో బీఆర్ఎస్ దొంగల ముఠా దోచుకుంటోందన్నారు. దళిత బంధులో రూ.3-5 లక్షలు నొక్కేశారన్నారు. దాన డబ్బులూ సైతం నొక్కేశారన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల మంజూరుకు లంచాలు తీసుకున్నారని ఆరోపించారు. సొంత పార్టీ కార్యకర్తల దగ్గరా లంచాలు తీసుకున్నారని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు.