DailyDose

నైజీన్‌ సరస్సులో సోనియాగాంధీ బోట్‌ షికారు -TNI నేటి తాజా వార్తలు

నైజీన్‌ సరస్సులో సోనియాగాంధీ బోట్‌ షికారు -TNI నేటి తాజా వార్తలు

నైజీన్‌ సరస్సులో సోనియాగాంధీ బోట్‌ షికారు 

జమ్ముకశ్మీర్‌లో పర్యటిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత్రి సోనియాగాంధీ (Sonia Gandhi) తాజాగా శ్రీనగర్‌లోని నైజీన్‌ సరస్సులో బోటు షికారు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అయితే ఇది కేవలం కుటుంబ పర్యటన మాత్రమేనని, ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ కూడా ప్రస్తుతం శ్రీనగర్‌లోనే ఉన్నారు. ఇటీవల లద్దాఖ్‌లో పర్యటించిన ఆయన.. శుక్రవారం ఉదయం కార్గిల్‌లో బహిరంగ ర్యాలీని పూర్తి చేసుకొని శ్రీనగర్‌కు చేరుకున్నారు. మరోవైపు ఆయన సోదరి ప్రియాంక గాంధీ, తన భర్త రాబర్ట్‌ వాద్రాతో కలిసి శ్రీనగర్‌కు చేరుకోనున్నారు. వీరంతా రెండు రోజుల పాటు శ్రీనగర్‌లో గడిపి అక్కడి నుంచి గుల్మార్గ్‌కు వెళతారు. గత కొన్నేళ్లుగా శ్రీనగర్‌లోని ‘రైన్‌వారి’ ప్రాంతంలోని ఓ హోటల్‌లో రెండు రాత్రులు నిద్ర చేయడం ఈ కుటుంబానికి సెంటిమెంట్‌గా వస్తోంది. అయితే, ఈ సారి రాహుల్‌ గాంధీ నైజీన్‌ సరస్సులోని బోట్‌ హౌస్‌లో ఉంటారని సమాచారం. మిగతా కుటుంబ సభ్యులు మాత్రం వారి సెంట్‌మెంట్‌ మేరకు పాత హోటల్‌లోనే బస చేయనున్నారు.

*   కేసీఆర్‌పై అభిమానాన్ని చాటుకున్న అసదుద్దీన్

ఇద్దరూ మంచి స్నేహితులే.. ఇద్దరి మధ్య అంతకుమించి అన్నంత అనుబంధం ఉంది.. పక్కా రాజకీయ ఒప్పందమూ ఉంది.. కాకపోతే సందర్భాన్ని బట్టి ఒకరిని మించి ఒకరు కామెంట్లు చేసుకోవడం పొలిటికల్‌ కామన్‌ స్టైల్‌.. బయటకు ఎలా ఉన్నా.. లోలోపల ఇద్దరూ ఒక్కటే అన్నది తెలుస్తోంది.. మొన్న బీఆర్ఎస్‌ అభ్యర్థుల ఫస్ట్‌ లిస్ట్‌ రిలీజ్‌ సందర్భంలోనూ ఎంఐంఎంతో తమకున్న సంబంధాన్ని సీఎం కేసీఆర్‌ ఓపెన్‌గా చెప్పారు. ఈ క్రమంలో ఇప్పుడు సెక్రటేరియట్‌ ఆవరణంలో కేసీఆర్‌పై ఉన్న అభిమానాన్ని అసదుద్దీన్ మరోసారి చాటుకున్నారు. సెక్రటేరియట్‌ సాక్షిగా బీఆర్ఎస్‌, ఎంఐఎం బంధం మరోసారి బయటపడటం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ సచివాలయం ఆవరణలో శుక్రవారం దేవాలయం, చర్చి, మసీదుల ప్రారంభోత్సవం జరిగింది. సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు నిర్మించిన ప్రార్థనా మందిరాలను గవర్నర్ తమిళిసైతో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ కూడా పాల్గొన్నారు. దేశ చరిత్రలో సచివాలయంలో మసీద్‌, మందిర్‌, చర్చి నిర్మించారని కేసీఆర్‌ను అసద్‌ ప్రశంసించారు. మైనార్టీలకు కావాల్సినంత చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని జోస్యం చెప్పారు. ఇదేంటి సార్‌ అంటే.. రాజకీయం రాజకీయమే అంటూ అసదుద్దీన్ సింపుల్‌గా సమాధానమిచ్చారు.సాధారణంగా.. ప్రతిపక్షాల కంటే కేసీఆర్‌కు ఇలాంటివి బాగా తెలుసు.. అసద్‌ మనసులో ఏముందో కేసీఆర్‌కు తెలియదా..? అనే వారు కూడా ఉన్నారు. అందుకే అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసిన సమయంలో.. ఎంఐఎంతో కలిసి పోటీ చేస్తామని.. తమ మధ్య మంచి ఒప్పందముందని స్వయానా ముఖ్యమంత్రే చెప్పారు. ఈ క్రమంలో అసదుద్దీన్ కూడా కేసీఆర్ పై ఉన్న అభిమానాన్ని వ్యక్తపరచడం ఆసక్తికరంగా మారింది.ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ – ఎంఐఎం అనుబంధం మరింత బలపడటం పొలిటికల్ గా కలిసి వచ్చే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన కేసీఆర్.. వ్యూహాలకు మరింత పదునుపెడుతున్న విషయం తెలిసిందే.

బీఆర్ఎస్ కు మాజీ మంత్రి రిజైన్

బీఆర్ఎస్  అసంతృప్త నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.  టికెట్ రాకపోవడంతో  ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. లేటెస్ట్ గా బీఆర్ఎస్ కు మాజీ మంత్రి  కృష్ణ యాదవ్ రాజీనామా చేశారు.  ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్ జాబితాలో కృష్ణ యాదవ్ పేరు లేకపోవడంతో ఆయన  అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలో  కృష్ణ యాదవ్ బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో కృష్ణ యాదవ్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అంబర్ పేట, లేదా, మలక్ పేట టికెట్ ను అడుగుతున్నట్లు తెలుస్తుంది. కేసీఆర్  మలక్ పేట  టికెట్  తీగల అజిత్ రెడ్డికి, అంబర్ పేట  టికెట్  కాలేరు వెంకటేశ్ కు ఇచ్చారు. 

కాంగ్రెస్ టికెట్ల కోసం భారీగా దరఖాస్తులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. ఈ క్రమంలో పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే నేతల నుంచి దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి గడువు శుక్రవారంతో ముగియగా.. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 1025 మంది కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈసారి కొందరు సీనియర్లు పక్కకు తప్పుకుని.. వారి వారసులను రంగంలోకి దించారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పోటీ నుంచి తప్పుకుని ఇద్దరి కుమారులను బరిలోకి దింపారు. జానా రెడ్డి పెద్ద కుమారుడు రఘువీరారెడ్డి మిర్యాలగూడ నుంచి, చిన్న కుమారుడు  జైవీర్‌రెడ్డి నాగార్జునసాగర్‌ అసెంబ్లీ టిక్కెట్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. జానారెడ్డి లాగానే పలువురు సీనియర్లు బరి నుంచి తప్పుకుని వారసులను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. జనార్దన్ రెడ్డి, కొండా సురేఖ వంటివారు తమ వారసులకు టిక్కెట్లు ఇప్పించాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే.. 119 నియోజకవర్గాల్లో ఒక్క కొడంగల్‌లో మాత్రమే ఒక్క దరఖాస్తు వచ్చింది. అక్కడి నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేశారు. కొండగల్ నియోజకవర్గం తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఒకటికి మించి దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా ఇల్లందు (ఎస్టీ రిజర్వుడు) నియోజకవర్గానికి 38 మంది నుంచి దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. భట్టి విక్రమార్క(మధిర), సీతక్క (ములుగు), పొదెం వీరయ్య (భద్రాచలం), శ్రీధర్‌బాబు (మంథని), జగ్గారెడ్డి (సంగారెడ్డి) ఉన్న చోట్ల కూడా పోటీ నెలకొంది. ఆయా నియోజకవర్గాల నుంచి పలువురు టికెట్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అయితే సీనియర్ నేతలు వి హనుమంతరావు, నాగం జనార్దన్ రెడ్డి, రేణుకా చౌదరి, కొండా మురళి దరఖాస్తులు సమర్పించలేదని తెలుస్తోంది.ఇక, కొందరు నేతలతో పాటు వారి వారసులు కూడా టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. హుజూర్‌నగర్‌ స్థానానికి, ఉత్తమ్ సతీమని పద్మావతి.. కోదాడఅసెంబ్లీ నియోజకవర్గాలకు దరఖాస్తు చేసుకున్నారు. సీనియర్ నేత దామోదర రాజానరసింహ, ఆయన కుమార్తె త్రిష.. ఆందోల్ నియోజకవర్గానికి దరఖాస్తులు సమర్పించారు. సీతక్క ములుగు టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా.. పినపాకకు ఆమె కుమారుడు సూర్యం దరఖాస్తు చేసుకున్నారు. కేసీఆర్ సోదరుడి కుమార్తె, కాంగ్రెస్ నాయకురాలు రమ్యరావు, ఆమె కుమారుడు రితేష్‌లు కరీంనగర్‌ అసెంబ్లీ టిక్కెట్‌ కోసం దరఖాస్తులు సమర్పించారు.అంజన్‌కుమార్‌ యాదవ్‌, ఆయన కుమారుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఇద్దరూ ముషీరాబాద్‌ నియోజకవర్గం టికెట్ కోసం దరఖాస్తు సమర్పించారు. ఇక, అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కోరుతూ మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ దరఖాస్తు సమర్పించారు.అయితే ఈ దరఖాస్తులకు సంబంధించిన   స్క్రూట్నీ ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభంకానుంది. ఒకటి, రెండు రోజుల్లో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ కూడా సమావేశం కానుంది. ఈ భేటీలో దరఖాస్తుదారుల అర్హతపై చర్చించనున్నారు. దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి.. పార్టీ అధిష్టానానికి పంపనున్నారు. అధిష్టానం ఆమోదం తర్వాత అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. ఇందుకు మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 

*  జగన్ నొక్కే బటన్ కి కరెంట్ లేదు

సీఎం వైఎస్ జగన్ నోక్కే బటన్ కి కరెంట్ లేదని ఎద్దేవా చేశారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. కరెంటు లేని బటన్ ఎన్నిసార్లు నొక్కినా డబ్బులు పడవని అన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా శనివారం నూజివీడు నియోజకవర్గంలో ముసునూరు గ్రామస్తులతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల జేబులకు చిల్లు ఎలా పొడవాలని చూసే పెత్తందారు సైకో జగన్ అని విమర్శించారు.వైసిపి పాలనలో అప్రకటిత కరెంటు కోతలతో రాష్ట్రమంతా చీకట్లు అలుముకుంటున్నాయన్నారు. కరెంటు కోతలతో రైతంగంతో పాటు ఇండస్ట్రీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్నారు. సంక్షేమ కార్యక్రమాల్లో కులం, మతం చూడనని చెప్పిన జగన్.. ఇప్పుడు కులం, మతం, పార్టీ పేరుతో సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారన్నారు.

ఎమ్మెల్యే అభ్యర్థిగా రాహుల్ సిప్లిగంజ్

నిప్పులేందే పొగ రాదంటారు.. అయినా సదరు వ్యక్తులు వచ్చి ఖండిస్తేనే కానీ అవి వట్టి పుకార్లు అని నమ్ముతారు.. ఇప్పుడు తెలంగాణ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ పరిస్థితి అదే. ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను గోషామహల్ నుంచి పోటీచేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఖండించాడు. తనకు రాజకీయ రంగ ప్రవేశం చేసే ఉద్దేశం లేదని, గోషామహల్ ఎమ్మెల్యే స్థానానికి తాను అభ్యర్థిత్వాన్ని సూచిస్తున్నట్లు వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని రాహుల్ స్పష్టం చేశారు. టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ రాహుల్ తన అభిమానులను మరియు ప్రజలను ఉద్దేశించి, “అందరికీ నమస్కారం! నేను ఏ రాజకీయ పార్టీలోనూ లేను. అవన్నీ గత కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్న ఫేక్ న్యూస్. అది అస్సలు నిజం కాదు. నేను అన్ని పార్టీలకు చెందిన నాయకులందరినీ గౌరవిస్తాను. ఎందుకంటే నేను ఒక కళాకారుడిని, అందరినీ అలరించాలి.. జీవితాంతం అదే దృష్టితో పని చేస్తాను. సింగర్ గానే కొనసాగుతాను అని రాహుల్ అన్నారు. సిప్లిగంజ్ తన సంగీత వృత్తిపై ఉన్న తన నిబద్ధతను పేర్కొన్నారు. “నేను నా సంగీత వృత్తిలో మాత్రమే ఉన్నాను. ఈ పరిశ్రమలో నేను చేయాల్సింది చాలా ఉంది. ఏ పార్టీ నుంచి నన్ను ఎవరూ సంప్రదించలేదు, నేను ఎవరినీ సంప్రదించలేదు. దయచేసి ఇలాంటి పుకార్లు ఆపండి అని తన అభిమానులను కోరారు.

ముస్లిం విద్యార్థిని కొట్టేలా ప్రోత్స‌హించిన టీచ‌ర్‌

 ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌లో ఓ ప్రైవేటు స్కూల్‌(school teacher)లో ముస్లిం విద్యార్ధిని చెంప దెబ్బ‌లు కొట్టేరీతిలో తోటి విద్యార్థుల్ని ప్రోత్స‌హించిన టీచ‌ర్‌కు చెందిన వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది. ఆ వీడియో గురించి పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. చ‌ర్య‌లు తీసుకునే రీతిలో విద్యాశాఖ‌ను ఆదేశించిన‌ట్లు తెలిపారు. ఆ విద్యార్థిపై టీచ‌ర్ కొన్ని మ‌త‌ప‌ర‌మైన వ్యాఖ్య‌లు కూడా చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ముస్లిం పిల్ల‌ల(muslim children) త‌ల్లితండ్రుల‌ను ఉద్దేశిస్తూ ఆ టీచ‌ర్ కొన్ని వ్యాఖ్య‌లు చేసింది. ఒక‌వేళ త‌ల్లితండ్రులు పిల్ల‌ల‌పై ఫోక్‌స చేయ‌కుంటే ఆ స్టూడెంట్స్ ప‌ర్ఫార్మెన్స్ త‌గ్గిపోతుంద‌ని టీచ‌ర్ పేర్కొన్న‌ట్లు వీడియోలో ఉంది. గ‌ణితం టేబుల్‌ను నేర్చుకోని ముస్లిం పిల్ల‌వాడిపై టీచ‌ర్ సీరియ‌స్ అయిన‌ట్లు తెలుస్తోంది.అయితే పిల్ల‌వాడికి చెందిన తండ్రి, స్కూల్ యాజ‌మాన్యం మ‌ధ్య ఒప్పందం కుదిరింది. స్కూల్‌కు వ్య‌తిరేకంగా ఎటువంటి ఫిర్యాదు చేయ‌బోన‌ని తండ్రి అంగీకరించాడు. పిల్ల‌వాడిని కొడుతున్న వీయోడిను రాహుల్ గాంధీ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేశారు. ప‌విత్ర‌మైన స్కూల్‌ను మ‌త‌విద్వేషాల‌కు వాడుకుంటున్న‌ట్లు ఆయ‌న బీజేపీపై ఫైర్ అయ్యారు.

పుష్ప చిత్రంలో నా ఫొటో ఉందని వైసీపీ వాళ్లు ఏడుస్తున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుష్ప చిత్రంలో నటనకు గాను అల్లు అర్జున జాతీయ ఉత్తమ నటుడు అవార్డు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మీడియా చిట్‌చాట్‌లో చంద్రబాబు మాట్లాడుతూ.. పుష్ప చిత్రంలో తన  ఫొటో పెట్టినందుకు వైసీపీ వాళ్లు ఏడుస్తున్నారని అన్నారు. ఓ ప్రశ్నకు చంద్రబాబు సమాధానమిస్తూ.. ‘‘పుష్ప చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్‌లో నా ఫొటో ఉంది. ఆ సినిమా చూపించిన కాలంలో నేను సీఎంగా ఉన్నాననో.. లేదంటే ఎర్రచందనం స్మగ్లర్లను నేను చేశాననో చిత్ర యూనిట్ నా ఫొటో పెట్టి ఉండొచ్చు. దానికే వైసీపీ వాళ్లు ఏడుస్తున్నారు’’ అని పేర్కొన్నారు.సుకుమార్ తెరకెక్కించిన పుష్ప చిత్రం  కథాంశం ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ తిరుగుతుంటుంది. పుష్ప పార్ట్-1 మంచి విజయాన్ని సొంతం  చేసుకోగా.. పార్ట్-2 షూటింగ్ కూడా జరుగుతుంది. అయితే పుష్ప చిత్రంలో ఓ సందర్భంలో పోలీసు స్టేషన్ గోడపై చంద్రబాబు ఫొటో కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు పుష్ప చిత్రం విడుదలైన సమయంలో సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారాయి. ఇక, 69వ జాతీయ సినీ అవార్డుల్లో.. పుష్ప  చిత్రంలో నటనకు గాను అల్లు అర్జున ఉత్తమ  నటుడు అవార్డు వరించింది. ఇక, ఈ సందర్భంగా చంద్రబాబు కూడా అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ చలన చిత్ర అవార్డుల్లో అనేక అవార్డులను సాధించి తెలుగు చలన చిత్ర రంగానికి విశిష్ట గుర్తింపును తెచ్చిన విజేతలందరికీ శుభాభినందనలు. ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్న అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు. అలాగే వివిధ విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకున్న ‘ఆర్ఆర్ఆర్’, ‘ఉప్పెన’, ‘కొండపొలం’ చిత్రాల దర్శకనిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు, ఉత్తమ విమర్శకుడుగా ఎంపికైన పురుషోత్తమాచార్యులుకు అభినందనలు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. 

మంచిరేవుల ఫారెస్ట్రెక్‌ పార్కును ప్రారంభించిన మంత్రులు సబిత

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు కోటి మొక్కలు నాటే కార్యక్రామానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టించింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం మంచిరేవులలో కోటి వృక్షార్చన  కార్యక్రమాన్ని మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్‌ రెడ్డితో కలిసి ఎంపీ సంతోష్‌ కుమార్‌ లాంఛనంగా ప్రారంభించారు. అక్కడి ఫారెస్ట్రెక్‌ పార్కులో మొక్కలు నాటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా ఆ పార్కును కూడా ఎంపీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, పట్నం మహేందర్‌ రెడ్డి, ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ వాణిదేవి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మంచిరేవులలో నాడు వందలాది ఎకరాల అటవీ భూమి భవన నిర్మాణ వ్యర్థాలతో డంపింగ్‌ యార్డుగా మారి, పరిసరాల్లో తీవ్రమై న దుర్వాసన వ్యాపించేది. నేడు అదే ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదాన్ని పంచే ఫారెస్ట్రెక్‌ పార్క్‌గా రూపుదిద్దుకున్నది. 256 ఎకరాల స్థలాన్ని అటవీశాఖ, తెలంగాణ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఎఫ్‌డీసీ) సంయుక్తంగా ఫారెస్ట్‌ ట్రెక్‌ పార్కుగా తీర్చిదిద్దాయి.ఈ పార్కులో తాగునీటి ప్లాంట్‌, టాయిలెట్‌ బ్లాక్‌, వాచ్‌ టవర్‌, గ్రామ దేవత గుడి, ఓపెన్‌ వ్యాయామశాల, వాకింగ్‌ ట్రాక్‌, రాక్‌ పెయింటింగ్‌, ట్రెక్కింగ్‌ యాంఫీ థియేటర్‌, జలపాతం, బ్యాలెన్సింగ్‌ రాళ్లు, పిల్ల ఏనుగు, డేగ ముఖం, రచ్చ బండలు, సిట్టింగ్‌ బెంచీలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ మహానగర ఆకాశ హార్మ్యాలను చూసేలా ఏర్పాటు చేసిన వాచ్‌ టవర్‌ అదనపు ఆకర్షణగా నిలువనుంది. మంచిరేవులలో ఫారెస్ట్రెక్‌ పార్క్‌ వల్ల నెలకు సుమారు రూ.3 లక్షల వరకు ఆదాయం సమకూరనున్నది. 11 మందికి ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉపాధి లభించనున్నది. పార్‌లో రోజూ వందలాది మంది సందర్శకుల సేద తీరనున్నారు. ట్రెకింగ్‌ సౌకర్యంతో ప్రతి ఆదివారం 2,000 మంది వరకు సందర్శించనున్నారు. పర్యాటకులకు మరింత ఆకర్షణ కోసం చిన్నచిన్న కొండలు సైతం నిర్మించారు.

 గన్నవరం వైసీపీలో కీలక పరిణామాలు

గన్నవరం వైసీపీలో మరోసారి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరంలో టీడీపీ నుంచి విజయం సాధించిన వల్లభనేని వంశీ.. ఆ తర్వాత వైసీపీకి మద్దతుగా మారారు. వంశీని మొదట్నుంచీ గన్నవరం వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు వ్యతిరేకిస్తూ వచ్చారు. వీరిద్దరు కూడా గతంలో వంశీపై వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేసి ఓడినవారే. ఈ క్రమంలోనే వీరిద్దరు వంశీకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పనిచేశారు. అయితే కొంతకాలంగా వైసీపీ  అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు.. టీడీపీ గూటికి చేరారు. అయితే దుట్టా రామచంద్రరావు మాత్రం వైసీపీలోనే ఉండిపోయారు.గన్నవరం వైసీపీలో పరిణామాలపై సీఎం జగన్ దృష్టి సారించి దుట్టా రామచంద్రరావుతో భేటీ అయ్యారని.. ఈ క్రమంలోనే ఆయన పార్టీలో కొనసాగుతున్నారనే  ప్రచారం  కూడా వినిపిస్తోంది. అయితే దుట్టా రామచంద్రరావు వైసీపీలో ఉన్న తమకే సహకరిస్తాడన్న యార్లగడ్డ వెంకట్రావు వర్గం చెబుతోంది. ఈ క్రమంలోనే ఈరోజు వైసీపీ ఎంపీ బాలశౌరి.. దుట్టా రామచంద్రరావుతో భేటీ కానుండటం చర్చనీయాంశంగా మారింది. వంశీతో కలిసి పనిచేయాలని అధిష్టానం మాటను దుట్టాకు చెప్పేందుకు బౌలశౌరి ఆయనను కలవబోతున్నారనే ప్రచారం సాగుతుంది. దీంతో గన్నవరం వైసీపీలో పరిణామాలు ఉత్కంఠగా మారాయి. అయితే ఈ పరిణామాలపై ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ.. దుట్టా రామచంద్రరావు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడని అన్నారు. తనకు 2004 నుంచి ఆయనతో పరిచయం ఉందని.. తరుచూ తాము కలుస్తూ ఉంటామని చెప్పారు. తాను ఈరోజు దుట్టాను కలిసేదానిలో ఎలాంటి రాజకీయం లేదని తెలిపారు. దుట్టా రామచంద్రరావు వైసీపీలో ఉన్నారని.. జగన్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తారని అన్నారు. పార్టీకి నష్టం కలిగించే పనులు చేయరని కూడా చెప్పారు. వైసీపీలో ఆయనకు ఉండే గౌరవం ఎప్పుడూ అలానే ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు అందరం కలిసి పనిచేస్తామని చెప్పారు. రాష్ట్రంలో దొంగ నోట్ల అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.