Business

రాఖీ పౌర్ణమికి ప్రత్యేక బస్సులు నడపనున్న టీఎస్ఆర్టీసీ

రాఖీ పౌర్ణమికి  ప్రత్యేక బస్సులు నడపనున్న టీఎస్ఆర్టీసీ

రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త అందించింది. రాఖీ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ప్రత్యే బస్సులు నడపనున్నట్లు పేర్కొంది. ఈనెల 29, 30, 31 తేదీల్లో ప్రతి రోజు వెయ్యి బస్సుల చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు రాఖీ పౌర్ణమి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. రాఖీ పౌర్ణమి ఏర్పాట్లపై టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు.

సజ్జనార్‌ మాట్లాడుతూ.. రాఖీ పౌర్ణమికి హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌, నిజామాబాద్‌, హన్మకొండ, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, గోదావరిఖని, మంచిర్యాల, తదితర రూట్‌లలో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే జేబీఎస్‌, ఎంజీబీఎస్‌ బస్ స్టేషన్‌తోపాటు ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.గత ఏడాది ఆగస్టు 12న రాఖీ పండుగకు అధికారులు సమిష్టిగా పనిచేశారని గుర్తు చేశారు. ఫలితంగా ఒక్క రోజే రికార్డు స్థాయిలో 20 కోట్ల ఆదాయం సంస్థకు సమకూరిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒక్క రోజులో ఇంతమొత్తంలో ఆదాయం రాలేదని చెప్పారు. గత ఏడాది స్పూర్తితో ఈ రాఖీ పౌర్ణమి నాడు కూడా అలానే పనిచేయాలన్నారు. టీఎస్‌ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత సంస్థపై బాధ్యత మరింతగా పెరిగిందని, ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పని చేసి సంస్థకు మంచి పేరును తీసుకురావాలని సూచించారు.