WorldWonders

ఈ కుక్కల ఖరీదు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే

ఈ కుక్కల ఖరీదు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే

ప్రతీ కుక్కకీ ఓ రోజొస్తుందని మనం మాట వరుసకు అన్నా.. అది నిజంగా నిజం. మెన్స్ డే, విమెన్స్ డే లాగా.. కుక్కలకు కూడా ఓ రోజుంది. అదే ఇంటర్నేషన్ డాగ్ డే.. అంటే అంతర్జాతీయ కుక్కల దినోత్సవం(ఆగస్టు 26). మనుషుల కంటే కుక్కలనే ఎక్కువ నమ్మే వాళ్లూ లేకపోలేదు. మానవ జీవితంలో అంత ముఖ్యమైన కుక్కల ప్రాముఖ్యత, ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 26న అంతర్జాతీయ కుక్కల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఇండియాలోని అత్యంత ఖరీదైన కుక్క జాతుల రకాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సైబీరియన్ హస్కీ: ఈ జాతికి చెందిన కుక్కలు నీలి కళ్లతో ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టపడతారు కూడా. ఇక వీటి ధర విషయానికొస్తే దాదాపు రూ.40వేల నుంచి రూ.70వేల వరకు ఉంటాయట.

సమోయెడ్: స్నేహపూర్వక ప్రవర్తనకు ప్రసిద్ది చెందిన సమోయెడ్ కుక్కలు తెల్లని వెంట్రుకతో అందంగా ఉంటుంది. వీటికి మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీటి ధర రూ.45వేల నుంచి రూ.1లక్షా 30వేల వరకు ఉంటుంది. ధర ఎక్కువైనా వీటిని కొనుగోలు చేసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు, పోటీ పడుతుంటారు.

ఇంగ్లీష్ బుల్ డాగ్:బుల్ డాగ్స్ గా పిలుచుకునే ఈ కుక్కలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఇవి ప్రత్యేకమైన రూపాన్ని కలిగి ఉంటాయి. విలక్షణమైన జాతి నుంచి వచ్చిన ఈ కుక్కలు.. ఎంతో ఖరీదైనవి కూడా. వీటిని కొనుగోలు చేయాలంటే రూ.40వేల నుంచి రూ.70వేల వరకు వెచ్చించాల్సిందేనట.

ఆప్ఘన్ హౌండ్: ఇవి చూడడానికి చాలా వింతగా కనిపిస్తాయి. ఒకానొక సందర్భంలో అసలు ఇవి కుక్కలేనా అన్న సందేహమూ కలుగుతుంది. పొడవాడ మెడను, సిల్కీ వెంట్రుకలను కలిగి ఉండే వీటి ధర రూ.60వేల నుంచి రూ.80వేల వరకు ఉంటుందట.

రోట్ వీలర్:ఈ జాతికి చెందిన డాగ్స్ అత్యంత శక్తివంతమైనవి, విశ్వాసమైనవి కూడా. వీటిని ఎక్కువగా రక్షణ ప్రవృత్తిలో.. అంటే మన భాషలో చెప్పాలంటే కేసులను చేధించేందుకు పోలీసు డిపార్ట్ మెంట్ లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ రోట్ వీలర్ ధర దాదాపు రూ.10వేల నుంచి రూ.80వేల వరకు లభ్యమవుతాయి.

టిబెటన్ మాస్టిఫ్:ఇవి చూడడానికి చాలా పెద్దగా, గంభీరంగా కనిపిస్తాయి. మందపాటి చర్మంతో భయానకంగా కనిపించే ఈ డాగ్స్.. అత్యంత అరుదుగా దొరుకుతాయి. అంతే కాదు భారతదేశంలోనే అత్యంత ఖరీదైన, అరుదైన జాతుల్లో ఇవి ఒకటి. వీటి ధర రూ.60వేల నుంచి రూ.2లక్షల 50వేల వరకు ఉంటుందట.

ఫ్రెంచ్ బుల్ డాగ్:ఇవి మనోహరంగా, ఉల్లాసభరితంగా ఉంటాయి. తక్కువ ఎత్తులో ఉండే ఈ కుక్కలు.. భారతదేశంలో లభించే అత్యంత ఖరీదైన కుక్కల జాతుల్లో ఒకటిగా చెప్పవచ్చు. వీటి ధర రూ.70వేల నుంచి రూ.90వేల వరకు ఉంటుంది.