Business

పాతబస్తీ మెట్రో పనుల కోసం డ్రోన్ సర్వే

పాతబస్తీ మెట్రో పనుల కోసం డ్రోన్ సర్వే

పాతబస్తీలో మెట్రో రైలు పనుల కోసం డ్రోన్ సర్వే చేపట్టారు హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు.  సీఎం కేసీఆర్ ఆదేశాలతో పాతబస్తీలో మెట్రో రైలు అలైన్‌మెంట్, ప్రభావిత ఆస్తులు వంటి వాటిపై హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) డ్రోన్ సర్వే ప్రారంభించింది. పాతబస్తీ ప్రాంతాల్లోని ఇరుకైన మార్గంలో ప్రభావిత ఆస్తుల కచ్చితమైన కొలతలు తీసుకోవడానికి డ్రోన్ సర్వే చేశామన్నారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. 103 మతపరమైన, ఇతర సున్నితమైన నిర్మాణాలు మెట్రో నిర్మాణానికి ప్రధాన సవాలుగా ఉన్నాయని వివరించారు. మతపరమైన, ఇతర సున్నితమైన నిర్మాణాలను రక్షించడానికి, తగిన ఇంజనీరింగ్ పరిష్కారాలను రూపొందించడంలో డ్రోన్ సర్వే సాయపడనుందన్నారు ఎన్వీఎస్ రెడ్డి. మెట్రో అలైన్‌మెంట్, పిల్లర్ లొకేషన్‌లు మతపరమైన, సున్నితమైన నిర్మాణాలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపకుండా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు.

డ్రోన్ సర్వే ద్వారా రియల్ టైమ్ డేటా, హై రిజల్యూషన్ ఫొటోలు, త్రీడి మోడలింగ్, జీఐఎస్ (జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) డేటా, డేటా విశ్లేషణ, విజువలైజేషన్‌ను త్వరితగతిన సేకరించవచ్చని చెప్పారు. రాబోయే రోజుల్లో భూసామర్ధ్య పరీక్షలు ప్రారంభించడానికి టెండర్లు కూడా ఖరారు చేస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు.