Devotional

స్వామివారికి నేను చేసిన సేవలే నాపై విమర్శలకు సమాధానం

స్వామివారికి నేను చేసిన సేవలే నాపై విమర్శలకు సమాధానం

తనపై విమర్శలు చేసేవారికి తాను గతంలో తితిదే ఛైర్మన్‌గా ఉన్నప్పుడు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమాలే సమాధానం చెబుతాయని, విమర్శలకు భయపడి మంచి పనులు చేయడం ఆపేవాడిని కాదని తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఆయన సోదరుడు భూమన సుబ్రహ్మణ్యంరెడ్డి (భూమన్‌) అభినందన సంచిక ఆవిష్కరణ సందర్భంగా ఆదివారం తిరుచానూరు సమీపంలో ఏర్పాటైన సమావేశంలో కరుణాకర్‌రెడ్డి మాట్లాడారు. తాను నాస్తికుడినని, క్రైస్తవుడినని విమర్శలు చేస్తున్న వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. 17 ఏళ్ల కిందట తితిదే ఛైర్మన్‌గా సేవలందించే సమయంలోనే హిందూమత వ్యాప్తికి శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ ఆలోచన చేసింది తానేనని తెలిపారు. మతమార్పిడుల నియంత్రణకు కల్యాణమస్తు పేరుతో 30 వేల మందికి వివాహాలు జరిపించామని గుర్తుచేశారు. తిరుమల మాడ వీధుల్లో పాదరక్షలతో ప్రవేశాన్ని నిషేధించడం, దళిత గోవిందం, అన్నమయ్య 600వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించాక కూడా నాస్తికుడినని విమర్శిస్తున్నారన్నారు. శ్రీవారి మీద ఉన్న భక్తివిశ్వాసాలను దెబ్బతీసేలా సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేయడం తగదని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.