Business

రేనాల్డ్స్ 045 పెన్నుల ఉత్పత్తిని నిలిపివేస్తామని వైరల్ వార్తలపై స్పందించిన సంస్థ

రేనాల్డ్స్ 045 పెన్నుల ఉత్పత్తిని నిలిపివేస్తామని వైరల్ వార్తలపై స్పందించిన సంస్థ

రెనాల్డ్స్‌ (Reynolds) పెన్ను గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నీలం రంగు క్యాప్‌తో తెల్లగా ఉండే ఈ పెన్‌ విద్యార్థులకు సుపరిచితమే. తాజా మార్కెట్‌లో రకరకాల పెన్నులు అందుబాటులో ఉన్నా, దీని క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. గ్రిప్‌ అనుకూలంగా ఉండటమే కాకుండా.. రీఫిల్‌ మొన చాలా సన్నగా మృదువుగా రాయడం వల్ల చాలా మంది ఈ పెన్నునే వాడేందుకు మొగ్గు చూపుతుంటారు. అందుకే గత కొన్ని దశాబ్దాలుగా ఈ పెన్ను మార్కెట్‌లో తన ముద్ర వేసింది. తాజాగా ఆ సంస్థ.. ‘రెనాల్డ్స్‌ 045’ పెన్నుల తయారీని నిలిపివేస్తుందంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్‌ అయ్యాయి.

దీంతో ఆ పెన్నుతో అనుబంధం పెంచుకున్న ఎంతో మంది కామెంట్లు గుప్పిస్తున్నారు. మార్కెట్‌లో ఎంతో ఆదరణ కలిగిన ఆ పెన్ను తయారీని సంస్థ ఎందుకు నిలిపివేస్తోందంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. రెనాల్డ్స్‌ పెన్నుతో తనకున్న అనుబంధం మరువలేనిదని, ఓ బాక్సు పెన్నులు కొనుగోలు చేసి గుర్తుగా దాచుకుంటానని ఓ యూజర్‌ కామెంట్‌ చేశారు. ‘ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు అన్ని పరీక్షలు ఈ పెన్ను తోనే రాశాను. అలాంటిది వాటి తయారీని ఆపేస్తామని చెప్పడం చాలా బాధగా ఉంది’ అని మరో యూజర్‌ రాసుకొచ్చాడు.

అవన్నీ అవాస్తవం: రెనాల్డ్స్‌
అయితే, ఈ రూమర్స్‌ విస్త్రృతంగా వ్యాపించడంతో రెనాల్డ్స్‌ సంస్థ స్పందించింది. ఆ వార్తలన్నీ అవాస్తవమని తేల్చింది. ‘రెనాల్డ్స్‌045’ పెన్ను తయారీని ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. ‘‘ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలు అవాస్తవం. వాటిని చూసి ఆందోళనకు గురికావొద్దు. సరైన సమాచారం కోసం సంస్థ అధికారిక వెబ్‌సైట్‌, సోషల్‌ మీడియా పేజీలను చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ నమ్మకమే మాకు అత్యంత ప్రాధాన్యం’’ అని రాసుకొచ్చింది. మరోవైపు గతంలో రూ.5గా ఉన్న ఈ పెన్ను విలువ ప్రస్తుతం మార్కెట్‌లో రూ.10 గా ఉంది. అంతేకాకుండా రెనాల్డ్స్‌ 045 డిజైన్‌లో ఎలాంటి మార్పులు కూడా చేయబోమని ఈ సందర్భంగా సంస్థ ప్రకటించింది.