విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్ (ప్రివెంటివ్) అధికారులు రూ. 6.4 కోట్ల విలువైన 11 కేజీల బంగారం, కువైట్, ఖతర్, ఒమన్‌కు చెందిన రూ.1.5 లక్షల విలువైన కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 25 తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్టు అధికారులు తాజాగా వెల్లడించారు. బంగారం దుబాయ్, శ్రీలంక నుంచి తీసుకొచ్చినట్టు తెలిపారు. చెన్నై నుంచి విజయవాడ వెళ్తున్న కారును బోపల్లి టోల్‌ప్లాజా వద్ద అడ్డుకున్న అధికారులు 4.3 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నిందితుడిని సోదా చేయగా 6.8 కేజీల బంగారు ఆభరణాలు, రూ. 1.5 లక్షల విలువైన కువైట్ దీనార్, ఒమన్ రియాల్, ఖతర్ రియాల్ బయటపడ్డాయి.స్మగ్లింగ్ బంగారం కాదని మభ్యపెట్టేందుకు దానిపై ఉన్న విదేశీ గుర్తులను చెరిపివేసినట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు. అరెస్ట్ అయిన నిందితుడిని విశాఖపట్టణం కోర్టు 13 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. విజయవాడ కస్టమ్స్ (ప్రివెంటివ్) కమిషనరేట్ అధికారులు 2022-23, 2023-24లో దాదాపు రూ. 40 కోట్ల విలువైన 70 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.