Business

చిన్నతరహా సాగునీటి పథకాల అమల్లో తెలుగు రాష్ట్ర స్థానలు?

చిన్నతరహా సాగునీటి పథకాల అమల్లో తెలుగు రాష్ట్ర స్థానలు?

దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న చిన్నతరహా సాగునీటి పథకాల్లో తెలంగాణ 5, ఆంధ్రప్రదేశ్‌ 9వ స్థానంలో ఉన్నాయి. కేంద్ర జల్‌శక్తి శాఖ శనివారం విడుదల చేసిన చిన్నతరహా నీటిపారుదల పథకాల 6వ సెన్సస్‌ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2017-18 సంవత్సరం ఆధారంగా జల్‌శక్తిశాఖ ఈ గణన చేపట్టింది. ఇందులో ఉత్తర్‌ప్రదేశ్‌ (17.2%), మహారాష్ట్ర (15.4%), మధ్యప్రదేశ్‌ (9.9%), తమిళనాడు (9.1%), తెలంగాణ (7.3), రాజస్థాన్‌ (6.4%), కర్ణాటక (6.1%), గుజరాత్‌ (6.0%), ఆంధ్రప్రదేశ్‌ (5.1%), పంజాబ్‌ (5.1%) తొలి పది స్థానాలను ఆక్రమించాయి. 2013-14నాటి 5వ సెన్సస్‌తో పోలిస్తే తాజా సెన్సన్‌నాటికి తెలంగాణలో చిన్నతరహా నీటి పథకాలు 10.4% పెరిగాయి.

గత సెన్సస్‌తో పోలిస్తే తాజాగా చిన్నతరహా పథకాలు అందించే సాగునీటి సామర్థ్యం 30,14,446 హెక్టార్ల నుంచి 35,06,333 హెక్టార్లకు పెరిగింది. పూర్తిస్థాయిలో వినియోగించుకోని స్కీంలలో 2,71,219 భూగర్భ జలాలకు సంబంధించినవి కాగా, 15,063 ఉపరితల జలాలకు సంబంధించినవి. ఇందుకు విభిన్న కారణాలున్నాయి. బోరు బావులు అనుకున్న స్థాయిలో నీరు విడుదల చేయకపోవడం ఒక కారణం కాగా, విద్యుత్తు లేకపోవడం, యంత్రాల వైఫల్యం, నిర్వహణ లోపం వంటి సమస్యలూ ఇందుకు దారితీశాయి.