* డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 5జీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 46వ వార్షికోత్సవం సందర్భంగా కీలక ప్రకటనలు చేశారు చైర్మన్ ముఖేష్ అంబానీ. 2023 డిసెంబర్ నాటికల్లా దేశవ్యాప్తంగా జియో5జి అమలు చేస్తామని ప్రకటించారు. దీనికోసం ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రకటించే అవకాశం ఉంది. జియో భారత్ 4 జీ తరహాలో జియో 5జి స్మార్ట్ ఫోన్ కోసం ప్రత్యేక ప్లాన్స్ ప్రకటించే అవకాశం ఉందని మొబైల్ ప్రియులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2026 నాటికి బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ ప్రారంభించనున్నట్లు ముకేశ్ అంబానీ తెలిపారు. 2030 నాటికి 100 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యాన్ని అందుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. 2035 నెట్ జీరో లక్ష్యాలను అందుకోవాలనుకుంటున్నట్లు ముకేశ్ అంబానీ తెలిపారు.బీపీ భాగస్వామ్యంతో కలిసి కేజీబీ బ్లాక్-6లో 20 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తిని పునరుద్ధరించినట్లు ముకేశ్ అంబానీ వెల్లడించారు. రోజుకి ఇక్కడ 14 మిలియన్ క్యూబిల్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. రోజుకి 30 మిలియన్ల స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. బీమా రంగంలోకి అడుగుపెడుగున్నట్లు ప్రకటించారు ముఖేష్ అంబానీ. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ద్వారా బీమా రంగంలోకి దిగుతున్నామని.. ఆరోగ్య బీమా సేవలను దీని ద్వారా అందించనున్నట్లు చెప్పారు. రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ తరహాలోనే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా సక్సెస్ సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు.దేశంలో రిలయన్స్ జియో యూజర్ల సంఖ్య 45 కోట్లు దాటారని ముకేశ్ అంబానీ తెలిపారు. ప్రస్తుతం జియో 5జీ యూజర్లు 5 కోట్ల మంది ఉన్నారని తెలిపారు.
* ఇన్సురెన్స్ రంగంలోకి రిలయన్స్ జియో
రిలయన్స్ ఏజీఎంలో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌పై కీలక ప్రకటన చేశారు ముకేశ్ అంబానీ. “ఇన్ష్యూరెన్స్రంగంలోకి రిలయన్స్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎంట్రీ ఇస్తుందన్నారు. దేశాభివృద్ధిపై ప్రభావం చూపేలా ఇది ఉంటుందన్నారు. కస్టమర్లకు, వ్యాపారస్తులకు అనేక అవకాశాలనిస్తుందన్నారు. బ్లాక్‌చెయిన్ ఆధారిత ప్లాట్‌ఫామ్స్, సీబీడీసీ వంటి ఫీచర్స్.. ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రాడక్ట్స్‌లో ఉంటాయని ముకేశ్ అంబానీ అన్నారు.
* కొచ్చి-బెంగళూరు ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
కొచ్చి-బెంగళూరు ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఇండిగో విమానం కొచ్చి ఎయిర్ పోర్టులో టేకాఫ్ కు సిద్ధమవుతుండగా, గుర్తు తెలియని వ్యక్తి నుంచి విమానాశ్రయానికి ఫోన్ కాల్ వచ్చింది. విమానంలో బాంబు ఉందని తెలిపాడు. ఆ సమయంలో విమానంలో 139 మంది ప్రయాణికులు ఉన్నారు.బెదిరింపు ఫోన్ కాల్ పై వెంటనే స్పందించిన అధికారులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఇండిగో విమానాన్ని నిలిపి వేశారు. అందులోని ప్రయాణికులందరినీ కిందికి దించేశారు. సీఐఎస్ఎఫ్ క్విక్ రియాక్షన్ టీమ్, బాంబు డిస్పోజల్ స్క్వాడ్, కేరళ పోలీసులు విమానంలో క్షుణ్నంగా తనిఖీలు చేశారు. ప్రయాణికుల లగేజిని కూడా సోదా చేశారు. ఎలాంటి బాంబు కనిపించకపోవడంతో హమ్మయ్య అనుకున్నారు. ఉదయం 10.30 గంటలకు బయల్దేరాల్సిన ఇండిగో విమానం ఈ బెదిరింపు కాల్ వల్ల మధ్యాహ్నం 2.24 గంటలకు టేకాఫ్ తీసుకుంది. కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొచ్చి ఎయిర్ పోర్టులోని సీఐఎస్ఎఫ్ కంట్రోల్ రూమ్ కు వచ్చిన ఫోన్ కాల్ ను విశ్లేషించే పనిలో పడ్డారు. సదరు వ్యక్తి ఇంటర్నెట్ కాల్ చేయడంతో ఐపీ అడ్రస్ ఆధారంగా కాల్ ఎక్కడ్నించి వచ్చింది, ఎవరు చేశారనేది గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
* భారత్‌లో పెరగనున్న హోండా కార్ల ధరలు
ప్రముఖ జపనీస్ కార్ల తయారీ కంపెనీ హోండా భారత్‌లో కార్ల ధరలను పెంచబోతున్నది. హోండా సిటీ సెడాన్, అమేజ్ సబ్ కాంపాక్ట్ మోడల్స్ ధరలు పండుగ సీజన్‌కు ముందు ప్రియం కానున్నాయి. ఉత్పాదక వ్యయాన్ని తగ్గించుకునేందుకు రెండు మోడళ్ల ధరలను పెంచాలని జపనీస్ ఆటో దిగ్గజం భావిస్తున్నది. హోండా ఐదో జనరల్ సిటీ సెడాన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఈ ఏడాది మార్చిలో రూ.11.49లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. హోండా సిటీ హైబ్రిడ్ వర్షన్ ధర రూ.20.39లక్షల వరకు (Ex Showroom), హోండా సిటీ ప్రస్తుత ప్రారంభ ధర రూ.11.57లక్షలు (Ex Showroom) హోండా అమేజ్ ఎక్స్ షోరూం ధర రూ.7.05లక్షలుగా ఉన్నది.అయితే, కార్ల ధరలను ఎంత పెంచనున్నది మాత్రం కంపెనీ వెల్లడించలేదు. ప్రస్తుతం ఉన్న సమాచారం కంపెనీ కార్ల ధరల పెంపుపై చర్చిస్తున్నది. హోండా కార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ( సేల్స్ అండ్ మార్కెటింగ్) కునాల్ బహ్ల్ ఓ వార్త సంస్థతను మాట్లాడుతూ వ్యయాన్ని వీలైనంత వరకు భరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. సెప్టెంబర్ నుంచి సిటీ, అమేజ్ ధరలను సవర్తిస్తామన్నారు. ఇదిలా ఉండగా.. బీఎస్6 స్టేజ్ 2 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా హోండా 1.5 లీటర్ డీజిల్ యూనిట్‌ను నిలిపివేసింది.సెడాన్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో రానున్నది. ఇది E20 ఇథనాల్-బ్లెండ్ ఇంధనానికి సపోర్ట్ చేయనున్నది. ఇది గరిష్ఠంగా 121 హెచ్‌పీ పవర్, 145 ఎన్‌ఎం గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేయనున్నది. ఇంజిన్-6 స్పీడ్ మాన్యువల్ లేదంటే సీవీటీ గేర్‌బాక్స్‌తో జతచేసింది. 1.5 లీటర్ అట్కిన్సన్ సైకిల్ హైబ్రిడ్ ఇంజిన్ 126 హెచ్‌పీ పవర్, 256 Nm గరిష్ఠంగా టార్క్‌ను ఉత్పత్తి చేయనుండగా.. ఇంజిన్ ఈ-సీవీటీ గేర్‌బాక్స్‌తో రానున్నది. ఇదిలా ఉండగా.. హోండా అమేజ్ ఇటీవల భారత్‌తో పదో వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్నది. మారుతి డిజైర్, హ్యుందాయ్ ఆరాకు పోటీగా తీసుకువచ్చిన కాంపాక్ట్ సెడాన్ దేశవ్యాప్తంగా 5.3లక్షల విక్రయాలు జరిగాయి.
* కార్పొరేట్ ఉద్యోగం కంటే రెస్టారెంట్లలోనే జీతం ఎక్కువ
ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ చిత్రం.. సింగపూర్‌లోని రెస్టారెంట్ వెలుపల రిక్రూట్‌మెంట్ పోస్టర్. ఇక్కడ ఉద్యోగులకు యాజమాన్యం ఇస్తున్న ప్రోత్సాహకాలు అందర్నీ ఎంతగానో ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇది చూసిన చాలా మంది సాధారణ కార్పొరేట్ ఉద్యోగం కంటే ఇదే మంచిదని అంటున్నారు. ‘X’ యూజర్ ‘గబ్బర్ సింగ్’ అనే మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో షేర్ చేసిన ఈ ఫొటో.. .. “ఇక్కడ SGPలోని రెస్టారెంట్ వెలుపల రిక్రూట్‌మెంట్ పోస్టర్ ను చూడండి ”అని రాసుకువచ్చారు.రెస్టారెంట్ లో సర్వీసెస్ అండ్ ఎంప్లాయి బెనిఫెట్స్ విషయానికొస్తే.. ‘సర్వీస్ క్రూ’, ‘కిచెన్ క్రూ’ కాగా.. ఉద్యోగి ప్రయోజనాల్లో స్టాఫ్ అలవెన్స్‌లు, వార్షిక ఇంక్రిమెంట్, లీవ్‌లు, మెడికల్ బెనిఫిట్స్, ఆరోగ్య ప్రయోజనాలు, ఆరోగ్య పరీక్ష సబ్సిడీలు, సంవత్సరానికి రెండుసార్లు బోనస్, వార్షిక ప్రాయోజిత దంత ప్రయోజనాలు, నెలవారీ ఆదాయ ప్రోత్సాహక బోనస్, అదనపు బీమా కవరేజ్, రెఫరల్ బోనస్, భోజన కేటాయింపులు, స్పాన్సర్‌షిప్‌లు ఉద్యోగుల అధ్యయన కోర్సు వంటివి ఉన్నాయి. దీంతో ఉద్యోగులకు కంపెనీ అందించే ప్రోత్సాహకాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఫొటో అప్‌లోడ్ చేయబడినప్పటి నుంచి 73వేల వ్యూస్ ను దక్కించుకుంది. చాలా మంది తమ అభిప్రాయాలను తెలుపుతూ కామెంట్లు సైతం పెడుతున్నారు. “ఇలాంటి కంపెనీలు లేదా ప్రయోజనాలు మాత్రమే ఉంటే, ఉద్యోగులు ఎప్పుడైనా ఉద్యోగాలు చేయడానికి తరలివస్తారు. గొప్ప అనుభూతి చెందుతారు. ఉద్యోగులు తమ పని పట్ల శ్రద్ధ వహించాలంటే కంపెనీలు తమ ఉద్యోగుల గురించి శ్రద్ధ వహించాలి”అని నెటిజన్లు అంటున్నారు.
* మార్కెట్లోకి వివో వీ29ఈ
వివో కంపెనీ నుంచి తక్కువ ధరలో కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో విడుదల అయింది. ఈ స్మార్ట్ ఫోన్ లో కెమేరా క్వాలిటీ ఎంతో బాగుంది. ఫొటోలకు ప్రాధాన్యం ఇచ్చే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్ ను రూపొందించినట్టు ఫీచర్లు చూస్తే అర్థమవుతుంది. మార్కెట్లో ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభించనుంది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ.26,999. 8జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్ ధర రూ.28,999గా ఉంది.ఈ ఫోన్ కలర్ విషయానికొస్తే.. ఆర్టిస్టిక్ రెడ్, ఆర్టిస్టిక్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ తో పాటు, వివో పోర్టల్, ఆఫ్ లైన్ స్టోర్లలోనూ ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. స్లీక్ డిజైన్ తో తయారు చేయగా.. 7.57 శాతం ఎంఎం మందంతో ఉంటుంది. అంతేకాకుండా డిస్ ప్లే విషయానికొస్తే.. 6.73 అంగుళాల అమోలెడ్డిస్ ఫుల్ హెచ్ డీ ప్లే కలిగి ఉంది. ముఖ్యంగా సెల్ఫీల కోసం 50 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఐ ఆటో ఫోకస్ ఫీచర్ తో ఉండడం వల్ల సెల్ఫీలు క్లారిటీగా వస్తాయని సంస్థ ప్రకటించింది.వివో వీ29ఈ వెనుక భాగంలో 64 మెగాపిక్సల్ ప్రధాన కెమెరాతో డ్యుయల్ కెమెరా సిస్టమ్ ఉంటుంది. దాంతో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో ఉంటుంది. రెండో కెమెరా 8 మెగాపిక్సల్ తో వైడ్ యాంగిల్ లెన్స్ కలిగి ఉండగా.. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంటుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని 44వాట్ అడాప్టర్ తో చార్జ్ చేసుకోవచ్చు. ఫోన్ బాక్స్ తోపాటు ఈ అడాప్టర్ కూడా వస్తుంది. 5జీ, 4జీ, 3జీ, 2జీ, వై-ఫై, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, బ్లూటూత్, ఎఫ్ ఎం రేడియో, చార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ మద్దతు ఉంటుంది.
* తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతుందంటే?
గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,500 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,450 గా ఉంది.నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే 22 క్యారెట్ల బంగారం ధర – రూ 54,500,24 క్యారెట్ల బంగారం ధర – రూ 59,450.నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే,22 క్యారెట్ల బంగారం ధర – రూ 54,500,24 క్యారెట్ల బంగారం ధర – రూ 59,450.
* స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే ఒడిదుడుకులకు గురయ్యాయి. ఆ తర్వాత కొనుగోళ్ల అండతో పుంజుకుని లాభాల్లో పయనించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 110 పాయింట్లు లాభపడి 64,996కి చేరుకుంది. నిఫ్టీ 40 పాయింట్లు పుంజుకుని 19,306 వద్ద స్థిరపడింది.
* టీ-9 టికెట్లు తాత్కాలికంగా నిలిపివేత
రాఖీ పౌర్ణమికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టీ-9 టికెట్లను తాత్కాలికగా నిలిపివేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ప్రకటించింది. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు నిలుపుదల అమల్లో ఉంటుందని తెలిపింది. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ఈ టికెట్లు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణికులకు టీ-9 పేరుతో రెండు టికెట్లను సంస్థ జారీ చేస్తోంది. 60 కిలోమీటర్ల పరిధిలో రానుపోను ప్రయాణానికి టీ-9-60ని, 30 కిలో మీటర్ల పరిధిలో టీ-9-30ని అందుబాటులోకి తీసుకువచ్చింది. టి-9-60 టికెట్‌ను రూ.100కు, టి-9-30ని రూ.50కి ప్రయాణికులకు అందజేస్తోంది.రాఖీ పౌర్ణమికి బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో టి-9 టికెట్లను మంజూరు చేయడం సిబ్బందికి కష్టం. టికెట్ల జారీకి ప్రయాణికుడి జెండర్, వయసు, తదితర వివరాలను టిమ్ మిషన్లలో నమోదు చేయాల్సి ఉంటుంది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు అందుకు చాలా సమయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే టి-9 టికెట్లను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని సంస్థ నిర్ణయించింది. రేపటి నుంచి సెప్టెంబర్ 1 వరకు నాలుగు రోజుల పాటు ఈ నిలుపుదల అమల్లో ఉంటుంది. సెప్టెంబర్ 2 నుంచి యథాతథంగా ఈ టి-9 టికెట్లు కొనసాగుతాయి అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు.
* నేడు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు
గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించి కాస్త ఊరటనిచ్చినప్పటికీ.. గృహ వినియోగ గ్యాస్ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో సామాన్య ప్రజలు మండిపడుతున్నారు.హైదరాబాద్: రూ.1,155,వరంగల్: రూ. 1,174,విశాఖపట్నం: రూ.1,112,విజయవాడ: రూ.1,118,గుంటూర్: రూ.1,114