కార్యకలాపాల నిర్వహణలో సమస్యల కారణంగా ఆగస్టు 31 వరకు అన్ని విమాన సర్వీసులను రద్దును పొడిగించినట్లు గోఫస్ట్ (Go First) విమానయాన సంస్థ వెల్లడించింది. ఈ సంస్థ మే నెలలో స్వచ్ఛందంగా దివాల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ‘‘కార్యకలాపాల నిర్వహణలో సమస్యల కారణంగా గోఫస్ట్ విమానాలను ఆగస్టు 31 వరకు రద్దు చేశాము’’ అని ట్విటర్‌లో పేర్కొంది. అంతేకాదు.. సత్వర పరిష్కార ప్రక్రియ, కార్యకలాపాల పునరుద్ధరణ కోరుతూ పిటిషిన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే అని వెల్లడించింది. త్వరలోనే బుకింగ్స్ ప్రారంభించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది.మరోవైపు గోఫస్ట్‌పై ఐర్లాండ్‌కు చెందిన విమానాల లీజు సంస్థ ఏసీజీ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ కోర్టులో తీవ్ర ఆరోపణలు చేసింది. తాము లీజుకు ఇచ్చిన విమానాల్లో విడిభాగాలు కనిపించడంలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఇప్పటికే గోఫస్ట్‌కు విమానాలు లీజుకు ఇచ్చిన పలు సంస్థలు కోర్టులను ఆశ్రయించాయి. కానీ, ఆ సంస్థ దివాల పిటిషన్‌ను స్వీకరించడంతో.. దాని ఆస్తులను ఫ్రీజ్ చేశారు. దీంతో దాదాపు 50కిపైగా ఎయిర్ బస్ విమానాల కార్యకలాపాలు నిలిచిపోయాయి. కాకపోతే లీజుదారులు తమ విమానాలను తనిఖీ చేసేకొనే అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలోనే విమాన విడిభాగాల అదృశ్యం విషయం వెలుగులోకి వచ్చింది.తాజాగా ఏసీజీ సంస్థ అదృశ్యమైన విడిభాగాల జాబితాను దిల్లీ న్యాయస్థానానికి అందించిందని ఓ ఆంగ్ల వార్త సంస్థ పేర్కొంది. ఈ జాబితాలో పైలట్ సైడ్ స్టిక్, ఇంజిన్ ఫ్యాన్ బ్లేడ్లు వంటివి ఉన్నాయి. వీటిని కారణంగా చూపుతూ విమానాల రికవరీని అనుమతించాలని ఏసీజీ సంస్థ కోరింది. కానీ, దిల్లీ న్యాయస్థానం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.