Business

స్వల్ప లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

స్వల్ప లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 70 పాయింట్లు లాభపడి 65,066 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 22 పాయింట్లు పెరిగి 19,328 వద్ద కదలాడుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.58 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టెక్‌ మహీంద్రా, విప్రో, టాటా మోటార్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, పవర్‌గ్రిడ్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, జియోఫిన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, ఎంఅండ్‌ఎం, నెస్లే ఇండియా, మారుతీ, ఎస్‌బీఐ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

అమెరికా మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. ప్రస్తుతం అక్కడి ఫ్యూచర్స్‌ సూచీలు ఫ్లాట్‌గా ఉన్నాయి. మెజారిటీ ఆసియా- పసిఫిక్‌ మార్కెట్లు నేడు పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 85.13 డాలర్లకు చేరింది. విదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం రూ.1,393.25 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ మదుపర్లు రూ.1,264 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

తమ విక్రయాల ఆదాయం నుంచి 7-8% పరిశోధన, అభివృద్ధి కోసం కేటాయిస్తామని ఔషధ తయారీ సంస్థ సన్‌ఫార్మా తెలిపింది. మరోవైపు జొమాటోలో టైగర్‌ గ్లోబల్‌ ఇంటర్నెట్‌ ఫండ్‌ తమ 1.4 శాతం వాటాను బహిరంగ మార్కెట్‌ విక్రయాల ద్వారా విక్రయించింది. ఎస్‌జేవీఎన్‌ గ్రీన్‌ ఎనర్జీకి రూ.1,900 కోట్ల విలువ చేసే మూడు ప్రాజెక్టులు లభించాయి. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలపై మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉంది.