NRI-NRT

వివేక్ రామస్వామిపై ట్రంప్ ప్రశంసలు

వివేక్ రామస్వామిపై  ట్రంప్ ప్రశంసలు

రిపబ్లికన్‌ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న వివేక్‌ రామస్వామికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసలు లభించాయి. తొలి డిబేట్‌లో అతడే విజేత అని ట్రంప్‌ స్వయంగా ప్రకటించారు.

రిపబ్లికన్ల తరఫున అమెరికా (USA) అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ముందంజలో ఉన్న భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy) ఏకంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) అభిమానం చూరగొన్నారు. వాస్తవానికి ఈ రేసులో అందరి కంటే ట్రంప్‌ ముందున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. కానీ, ట్రంప్‌పై కేసులు, ఇతర కారణాలతో ఈ పోటీలో చివరి వరకు నిలుస్తారా.. అన్నదే సందేహాస్పదంగా ఉంది. అదే సమయంలో ప్రస్తుతం బరిలో ఉన్నవారిలో వివేక్‌ రామస్వామి తీరు ఆయనకు నచ్చినట్లు పరిణామాలు వెల్లడిస్తున్నాయి.

ఇటీవల ఆగస్టు 23వ తేదీన రిపబ్లికన్‌ పార్టీ తొలి ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌ జరిగింది. దీనిలో డొనాల్డ్‌ ట్రంప్‌ పాల్గొనలేదు. ఈ చర్చా కార్యక్రమంలో వివేక్‌ రామస్వామి, నిక్కీ హేలీ తదితర ఆశావహులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంపై తాజాగా ట్రంప్‌ తన అభిప్రాయం వెల్లడిస్తూ.. ‘‘డిబేట్‌లో వివేక్‌ రామస్వామి నిజాయతీ కారణంగా భారీ విజయం సాధించినట్లు నేను భావిస్తున్నాను. థాంక్యూ వివేక్‌’’ అని ట్రంప్‌ తన సొంత సోషల్‌ మీడియా వేదిక ట్రూత్‌లో పేర్కొన్నారు.

తొలి డిబేట్‌ సందర్భంగా వివేక్‌ మాట్లాడుతూ.. ‘‘21 శాతబ్దంలో ట్రంప్‌ అత్యుత్తమ ప్రెసిడెంట్‌’’ అని పేర్కొన్నారు. ఈ చర్చా కార్యక్రమంలో ఆయన ట్రంప్‌ను బలంగా సమర్థించారు. చర్చ సందర్భంగా.. ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆరోపణల్లో ట్రంప్‌నకు శిక్షపడితే ఆయన పక్షాన ఎవరుంటారు..? అనే ప్రశ్న వచ్చింది. దీనికి ఏమాత్రం సంకోచించకుండా వివేక్‌ చెయ్యి పైకెత్తారు. అంతేకాదు.. ఏదో ఒక రోజు మీరు కూడా ట్రంప్‌ను కచ్చితంగా క్షమిస్తారని నమ్మితే నా పక్షాన చేరండి అని కోరాడు. రామస్వామి ఈ చర్చా కార్యక్రమంలో విజయం సాధించినట్లు అమెరికాలో చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.

వ్యూహాత్మకంగా రామస్వామి అడుగులు..
రిపబ్లికన్‌ పార్టీలో ఇప్పటికీ మాజీ అధ్యక్షుడు ట్రంప్‌నకే భారీ మద్దతు లభిస్తోంది. ఆయనతో పోటీ పడటానికి రామస్వామి యత్నిస్తున్నారు. ఇటీవల పార్టీ సదస్సులో రామస్వామి తన వాదనలతో అందరినీ ఆకట్టుకున్నారు. ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైతే తాను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉండటానికి రామస్వామి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ వార్తా సంస్థ వద్ద మాట్లాడుతూ.. ‘‘నాకు పదవి ముఖ్యం కాదు. దేశాన్ని తిరిగి ఏకతాటిపై నిలబెట్టడం ప్రధానం. ఒకవేళ… ఆ పదవే (ఉపాధ్యక్ష) అయినా ఓకే. ఎందుకంటే ఈ వయసులో (38) అది కూడా మంచి పదవే. శ్వేతసౌధంలో ట్రంప్‌ నా మార్గదర్శకులుగా, సలహాదారుగా ఉంటే సంతోషిస్తా’’ అని రామస్వామి బదులివ్వటం గమనార్హం. ఒక వేళ ట్రంప్‌ ఎన్నికల రేసు నుంచి వైదొలగాల్సి వస్తే తనకు ఆయన మద్దతు లభించేలా రామస్వామి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రిపబ్లికన్లలో చాలా బలమైన వర్గం ట్రంప్‌ పక్షాన నిలిచింది. వారు అండ ఉంటే శ్వేత సౌధానికి చేరడం రామస్వామికి తేలికవుతుంది. ఒక వేళ ట్రంప్‌ నిలిచినా.. ఆయన నమ్మకస్థుడి రూపంలో రామస్వామి ఉపాధ్యక్ష పదవికి పోటీపడే అవకాశాలు మెరుగవుతాయి.

మరోవైపు గతంలో ట్రంప్‌ పాలకవర్గంలో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన మైక్‌ పెన్స్‌ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తాను ట్రంప్‌నకు క్షమాభిక్ష పెట్టేందుకు సిద్ధమే అని ఆయన వెల్లడించారు. కానీ, వాస్తవానికి ట్రంప్‌ విషయంపై మాట్లాటాన్ని తప్పించుకోవాలని చూశారు. కానీ, చివరికి తప్పని పరిస్థితుల్లో క్షమాభిక్ష అంశాన్ని వెల్లడించారు. గతంలో కూడా ట్రంప్‌నకు వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

2014లో రోవెంట్‌ సైన్సెస్‌ అనే సంస్థను స్థాపించిన రామస్వామి… 2015లో అమెరికా స్టాక్‌ మార్కెట్లో భారీ ఐపీఓకు వెళ్లారు. క్యాన్సర్‌, అల్జీమర్స్‌లాంటి వ్యాధులకు విజయవంతంగా మందులు తయారు చేసి అనుమతులు పొందటంతో బయోటెక్‌రంగంలో అమెరికాలో అతిపెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగారు. అమెరికాలోని టాప్‌ యువ బిలియనీర్లలో రామస్వామి ఒకరు. ప్రస్తుతం రిపబ్లికన్‌పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నవారిలో సంపద దృష్ట్యా ట్రంప్‌ తర్వాతి స్థానం రామస్వామిదే!