DailyDose

అత్యంత కాలుష్య నగరంగా ఇండియా రాజధాని

అత్యంత కాలుష్య నగరంగా ఇండియా రాజధాని

కాలుష్యం రోజురోజుకి పెరుగుతోంది. అయితే కాలుష్యం గురించి తాజాగా చేపట్టిన ఓ అధ్యయనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఇండియా రాజధాని ఢిల్లీ కొనసాగుతోందని తెలిపింది. అంతేకాదు ఒకవేళ అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి కాలుష్య స్థాయి అలాగే కొనసాగినట్లైతే అక్కడి ప్రజలు 11.9 ఏళ్ల జీవిత కాలాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది. యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ విడుదల చేసిన ‘ది ఎయిర్‌ క్వాలిటీ లైఫ్‌ ఇండెక్స్‌‌లో ఇందుకు సంబధించిన వివరాలను బయటపెట్టారు. అంతేకాదు మరో ముఖ్య విషయం ఏంటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించినటువంటి కాలుష్య స్థాయికంటే ఢిల్లీలో చాలా ఎక్కువగా ఉందని తెలిపింది. అలాగే ప్రస్తుతం దేశంలో 67.4 శాతం మంది కాలుష్య స్థాయి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని ఈ తాజా నివేదిక చెప్పడం ఆందోళన కలిగిస్తోంది.

అలాగే ముఖ్యంగా పీఎం 2.5 కారణం వల్ల దేశ ప్రజలకు ఉండే సరాసరి ఆయుర్దాయం దాదాపు 5.3 ఏళ్ల వరకు తగ్గిపోతోందని పేర్కొంది. ప్రపంచంలోనే ఢిల్లీ అత్యంత కాలుష్య నగరం అని చెప్పిన ఏక్యూఎల్‌ఐ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలతో పోల్చుకుంటే ఇక్కడ నివసిస్తున్న 1.8 కోట్ల మంది ప్రజలు తమ జీవిత కాలంలో దాదపు 11.9 ఏళ్లను ఈ కాలుష్యం వల్లే కోల్పోనున్నారని వెల్లడించింది. మరో విషయం ఏంటంటే అత్యంత తక్కువగా కాలుష్యం ఉన్నటువంటి పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ జిల్లాలో కూడా ప్రమాదకర కాలుష్య స్థాయి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే 7 రేట్లు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ఒకవేళ పఠాన్‌కోఠ్ జిల్లాలో కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగితే ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల ఆయుష్షు కూడా 3.1 సంవత్సరాలు తగ్గిపోనుందని ఆ సర్వే అంచనా వేసింది.

ఇదిలా ఉండగా ఉత్తర భారతదేశంలో కాలుష్యానికి వాతావరణ, భౌగోళిక అంశాలు కారణంగా ఉన్నాయి. అయితే మానవప్రమేయం వల్ల కూడా భారీ స్థాయిలో కాలుష్యం పెరుగుతోందని తెలిపింది. అలాగే దేశంలోని మిగతా ప్రదేశాలతో పోల్చి చూస్తే ఇక్కడి జనభా కూడా 3 రేట్లు ఎక్కువగా ఉందని తెలిపింది. అలాగే వెహికిల్స్, నివాస ప్రాంతాలు, వ్యవసాయ ఆధారిత పనుల వల్ల కాలుష్యం నానాటికీ పెరిగిపోతోందని తెలిపింది. అలాగే కాలుష్యం వల్ల పాకిస్థాన్, బంగ్లాదేశ్, నైజీరియా, ఇండోనేషియా, భారత్ దేశాల్లో చూసుకుంటే ఇక్కడ నివసించే ప్రజలు ఒకటి నుంచి ఆరు సంవత్సరాలకు పైగా తమ జీవితకాలాన్ని కోల్పోతున్నారని ఈ నివేదక పేర్కొంది. మరోవైపు కాలుష్యం నివారించేందుకు ఇప్పటికే పలు దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. అలాగే వాతావరణ నిపుణులు కూడా కాలుష్యం పట్ల చర్యలు తీసుకోకపోతే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.