వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విశాఖలో చేపట్టిన నిరవధిక దీక్ష రెండో రోజుకు చేరుకుంది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేసే వరకు దీక్ష కొనసాగిస్తానని చెప్పిన కేఏ పాల్‌కు స్థానికుల నుంచి మద్దతు లభిస్తోంది. కేంద్రం నుంచి కూడా అతి త్వరలోనే శుభవార్త ఉంటుందని కేఏ పాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. తన దీక్ష విరమించుకోవాలని ఇప్పటికే పలువురు మంత్రులు తనతో ఫోన్లో సంభాషించినట్టు వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో సత్వర న్యాయం జరగాలంటే ఆంధ్రప్రదేశ్‌లోని ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా రాజీనామా చేయాలని పాల్ సూచించారు. ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసినప్పుడే కేంద్రం వెంటనే చర్యలు తీసుకుంటుందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేస్తామని కేంద్రం అధికారికంగా ప్రకటించే వరకు దీక్ష కొనసాగిస్తానని కేఏ పాల్ తేల్చి చెప్పారు.