Politics

నల్గొండ సీటును బీసీల కోసం త్యాగం చేసేందుకు సిద్ధం: కోమటిరెడ్డి

నల్గొండ సీటును బీసీల కోసం త్యాగం చేసేందుకు సిద్ధం: కోమటిరెడ్డి

తెలంగాణలో ఎన్నికల జోరు ఊపందుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నాయి. ఇక, ఇటీవల కర్ణాటకలో విజయంతో కాంగ్రెస్‌ సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణలో కూడా విజయం సాధించాలనే దిశగా హస్తం నేతలు ప్లాన్‌ రెడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే, కోమటిరెడ్డి గాంధీభవన్‌ వద్ద మీడియాతో ​మాట్లాడుతూ.. బీసీల కోసం నా నల్గొండ సీటు త్యాగం చేసేందుకు కూడా సిద్దం. సమర్థవంతమైన వాళ్లకే టిక్కెట్లు ఇస్తాం. నా నియోజకవర్గంలో కూడా ఆరు అప్లికేషన్స్‌ వచ్చాయి. అందరి బలాబలాలను పరిశీలిస్తాం. పీఈసీ సభ్యులతో ఏఐసీసీ వన్ టూ వన్ మాట్లాడాలని రేవంత్ ప్రతిపాదించారు. రేవంత్ ప్రతిపాదనను అందరం ఆమోదించాం. డిక్లరేషన్‌ను తెలంగాణలో అమలు చేస్తాం.. అమలు చేయకపోతే రాజీనామా చేస్తాం. కేసీఆర్‌.. మూడెకరాలు ఇస్తా అని మాట తప్పాడు. మాట తప్పితే తల నరుక్కుంటా అన్నాడు.. ఏం చేశాడు?. మొండెంతో తిరుగుతున్నాడా?. అని సెటైరికల్‌ పంచ్‌ వేశారు. ఎన్నికల ముందు కేటీఆర్ అమెరికా పర్యటనలో ఏదో మతలబు ఉంటుంది అని ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

టికెట్ల కోసం పోటీ..ఇదిలా ఉండగా.. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో టికెట్‌ టెన్షన్‌ మొదలైంది. తెలంగాణ కాంగ్రెస్‌కు స్క్రీనింగ్‌ పరీక్ష టెన్షన్‌ పెడుతోంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో టికెట్‌ కోసం నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అనేక నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో ఆశావహులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇక, సీనియర్లు పోటీపడుతున్న సీట్లలో కూడా టికెట్‌ కోసం తీవ్ర పోటీ నెలకొంది.

* జనగామలో పొన్నాల Vs కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి
* వనపర్తిలో చిన్నారెడ్డి Vs మెఘారెడ్డి, శివసేన రెడ్డి
* ఎల్‌బీ నగర్‌లో మధు యాష్కీ Vs మల్‌రెడ్డి రంగారెడ్డి
* కల్వకుర్తిలో వంశీచందర్‌రెడ్డి Vs రాఘవరెడ్డి
* కొల్లాపూర్‌లో జూపల్లి Vs జగదీశ్వరరావు మధ్య గట్టి పోటీ నెలకొంది