NRI-NRT

ఐరోపా పర్యాటకులపై అనేక ఆంక్షలు

ఐరోపా పర్యాటకులపై అనేక ఆంక్షలు

భూతల స్వర్గం… చారిత్రక పట్టణం… అందాల బృందావనం… ఇలా ఏవేవో విశేషణాలతో ప్రపంచవ్యాప్త పర్యాటకులను ఆకర్షించే ఐరోపా ఇప్పుడు రివర్స్‌గేర్‌ వేస్తోంది. ‘బాబ్బాబూ మా వద్దకు రాకండి’ అంటూ టూరిజాన్ని కట్టడి చేస్తోంది. పర్యాటకులపై అనేక ఆంక్షలు, పన్నులు విధిస్తోంది. కారణం- మితిమీరిన టూరిజం!

ఆమ్‌స్టర్‌డామ్‌ (నెదర్లాండ్స్‌) జనాభా…8.5 లక్షలు!
కానీ ఏటా అక్కడికి వస్తున్న పర్యాటకులు 2.52 కోట్లు!
బార్సిలోనా (స్పెయిన్‌) జనాభా… 16 లక్షలు…
ఏటా పర్యాటకుల సంఖ్య 3 కోట్లు!
ఫ్లోరెన్స్‌ (ఇటలీ) జనాభా 3.8 లక్షలు.
ఏటా పర్యాటకులు దాదాపు 2 కోట్లు!

…ఎక్కువ పర్యాటకం అంటే ఎక్కువ ఆదాయం… ఎక్కువ ఉపాధి కల్పన! దేశానికి…ప్రజలకూ మంచిదే! కానీ అతి సర్వత్ర వర్జయేత్‌గా తయారవటంతో పరిస్థితి మారిపోయింది. కొవిడ్‌ తర్వాత కొద్దికాలం పర్యాటకం బాగానే అనిపించినా అది మితిమీరింది. ఇబ్బడిముబ్బడిగా పర్యాటకులు వచ్చి పడుతుండటంతో స్థానికులకు సమస్యలు మొదలయ్యాయి. ఆమ్‌స్టర్‌డామ్‌లాంటి చోట్లయితే… స్థానికులు స్వదేశంలో పరాయి వాళ్లుగా మారిపోతున్నామనే ఆందోళనలో పడ్డారు. ఇళ్లు, హోటళ్లు, రోడ్లు, ఆసుపత్రులు, విమానాశ్రయాలు అన్నీ కిక్కిరిసిపోవటంతో ఊపిరి పీల్చుకోవటం కష్టంగా మారింది. ట్రాఫిక్‌ పెరిగిపోయింది. వాయు, శబ్ద కాలుష్యం పెరిగింది. ఎక్కడ పడితే అక్కడ చెత్త, ఉమ్మివేతలు పెరిగాయి. భద్రత తగ్గింది. మొత్తం మీద ఆదాయం పెరిగినా జీవనం దుర్భరంగా మారింది. విచ్చలవిడి శృంగారాన్ని అనుమతించే ప్రాంతాల్లోనైతే పరిస్థితి మరింత దారుణం! అందుకే… పర్యాటకులకు స్వాగతం అన్న వారే… మా ఊరికి రాకండి… అనే దశకు వచ్చారు. స్థానికుల నుంచి ఆయా పట్టణ పురపాలక సంఘాలు, కౌన్సిళ్లపై పర్యాటకాన్ని ఆపాలంటూ ఒత్తిడి పెరిగింది. కానీ టూరిజం కారణంగా అనేక దేశాలకు భారీస్థాయిలో విదేశీమారక ద్రవ్యం వస్తుండటం… స్థానికంగానూ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతుండటంతో ప్రభుత్వాలకు ఇది ఇబ్బందికరంగా పరిణమించింది. నిషేధం విధించే బదులు మధ్యేమార్గంగా కట్టడి చేయటానికి, పర్యాటకుల సంఖ్యను తగ్గించటానికి ప్రవేశ రుసుం విధించటం ఆరంభించారు. చివరకు పాత కాలంనాటి చర్చిలను సందర్శించే వారూ ప్రవేశ రుసుము చెల్లించాల్సి వస్తోంది.

సెల్ఫీ దిగితే జరిమానా
ఇటలీలో వెనిస్‌ పట్టణానికి వచ్చే వారికి… 3 నుంచి 10 యూరోల దాకా ప్రవేశ రుసుం అని పెట్టారు. గ్రీస్‌ తమదేశంలోని పురాతన ఆక్రోపోలిస్‌ను చూడటానికి వచ్చేవారికి టైమ్‌స్లాట్‌లు కేటాయించటం ఆరంభించింది. రోజుకు 20వేల మందికి మించి అనుమతించటం లేదు. పర్యాటకులను నింపుకొని వస్తున్న భారీ ఓడలను ఇటలీ, నెదర్లాండ్స్‌ నిషేధించాయి.

కొన్ని బీచ్‌లలో, పట్టణాల్లో ఉండటానికి కాలవ్యవధిని నిర్ధారిస్తున్నారు. అంతకంటే ఎక్కువ సమయం గడిపితే జరిమానా వేస్తున్నారు. ఇటలీ పోర్టోఫినో సముద్ర తీరంలో సెల్ఫీలు దిగుతూ ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారని… నో వెయిటింగ్‌ జోన్లుగా ప్రకటించారు. అక్కడ ఎక్కువ సేపు నిలబడితే 275 యూరోల జరిమానా పడుతుంది.

వెనిస్‌లోని ఎరాక్లియా బీచ్‌లో ఇసుకగూళ్లు కడితే 250 యూరోల జరిమానా వేస్తున్నారు.

పర్యాటకులను నియంత్రించటానికి ప్రాంతాల వారీగా షెడ్యూళ్లను ప్రకటించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఫ్రాన్స్‌. అందరికీ తెలిసిన ప్రాంతాలకు కాకుండా కొత్త ప్రాంతాలకు వెళ్లేలా ప్రోత్సహిస్తోంది. అంతేగాకుండా… విమాన ప్రయాణాలపై పన్ను పెంచబోతోంది.

పోర్చుగల్‌… బీచ్‌లలో బంతి ఆటల్ని నిషేధించింది. బీచ్‌లలో మ్యూజిక్‌ వినిపిస్తే 200 యూరోల నుంచి 36,000 యూరోల దాకా జరిమానా.

క్రొయేషియాలో పర్యాటకులు బ్యాగులతో తిరగటాన్ని, ఎక్కడపడితే అక్కడ తాగటాన్ని నిషేధించారు. జరిమానాయే కాకుండా జైల్లో వేస్తామని ప్రకటించారు.

అమెరికన్లపైనా ఆంక్షలు…ఐరోపాలో అడుగుపెట్టడానికి అమెరికా సహా 60 దేశాల ప్రజలకు ఎలాంటి వీసా అవసరం లేదు. ఇప్పుడు వారిపైనా ఆంక్షలు విధించాలని యూరోపియన్‌ యూనియన్‌ నిర్ణయించింది. 2024 నుంచి అమెరికా సహా 60 దేశాల నుంచి వచ్చే పర్యాటకులపై స్వల్పమొత్తంలో రుసుము వసూలు చేయబోతున్నారు. అంతేగాకుండా ముందస్తుగా దరఖాస్తు చేసుకొని అనుమతి (వీసా కాదు) తీసుకోవాలి. మొత్తం మీద… పర్యాటకాన్ని వద్దనుకోలేక… అనుమతించలేక సతమతమవుతోంది ఐరోపా! ఈ పరిస్థితి భారత్‌లాంటి దేశాలకు లాభదాయకం అవుతుందని అనేవారూ లేకపోలేదు.