దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు వరుసగా మూడోరోజూ లాభాలతో ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 289 పాయింట్లు లాభపడి 65,364 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 81 పాయింట్లు పెరిగి 19,424 వద్ద కదలాడుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.69 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో జియోఫిన్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ షేర్లు మాత్రమే నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
అమెరికా మార్కెట్లు (Stock Market) మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. ఐరోపా సూచీలు సైతం అదే బాటలో పయనించాయి. నేడు ఆసియా- పసిఫిక్ మార్కెట్లలోనూ అదే సెంటిమెంట్ కొనసాగుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FII) మంగళవారం రూ.61.51 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ మదుపర్లు (DII) సైతం రూ.305.09 కోట్ల షేర్లు కొన్నారు. బ్రెంట్ చమురు బ్యారెల్ ధర స్వల్పంగా పెరిగి 84.76 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికాలో తుపాను ప్రభావం వల్ల విద్యుత్ ఉత్పత్తి దెబ్బతినే అవకాశం ఉంది. ఇది చమురు ఉత్పత్తిపైనా ప్రభావం చూపుతుందనే అంచనాల మధ్య అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈరోజు రిషభ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం కానుంది.
జొమాటో (Zomato)లో ఉన్న తమ పూర్తి 1.17 శాతం వాటాను సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ బ్లాక్ డీల్ ద్వారా విక్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం! 2038 నాటికి శూన్య కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకునేందుకు రూ.రెండు లక్షల కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఓఎన్‌జీసీ తెలిపింది. ఐఎఫ్‌ఎస్‌సీ గిఫ్ట్ సిటీలో ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ అనుబంధ సంస్థను ఏర్పాటు చేసేందుకు ఎస్‌బీఐకి అనుమతి లభించింది. 2022- 23 ఆర్థిక సంవత్సరానికి కర్ణాటక బ్యాంకు ఒక్కో షేరుపై రూ.5 డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీ షేర్లపై మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉంది.