పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై కేంద్ర జలశక్తి శాఖ నేడు సమీక్ష నిర్వహించనుంది. సీడబ్ల్యూసీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులతో ఆ శాఖ కార్యదర్శి చర్చించనున్నారు. ప్రతి నెలా జాతీయ ప్రాజెక్టులపై సమీక్షలో భాగంగానే ఈరోజు కూడా చర్చించనున్నట్లు జలశక్తి శాఖ అధికారులు తెలిపారు.ప్రాజెక్టులో డయాఫ్రమ్‌వాల్‌తో పాటు అప్పర్, లోయర్ కాపర్ డ్యామ్‌ల పరిస్థితి.. రెండు చోట్ల నీటి లీకేజీపై అధికారులు సమీక్షించనున్నారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న ప్రదేశంలో చేపట్టాల్సిన చర్యలు, ఇప్పటికే జలశక్తి శాఖ నుంచి ఇచ్చిన ఆదేశాల అమలు తీరుతెన్నులపై కీలకంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఏపీ అధికారులను కూడా పిలవాలని జలశక్తి శాఖ అధికారులు భావించినప్పటికీ చివరి నిమిషంలో వారిని వద్దనుకున్నట్లు సమాచారం. మంత్రిత్వశాఖలో చర్చించిన తర్వాతే రాష్ట్ర అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలిసింది.