* కస్టమర్లకు యాక్సిస్ బ్యాంకు గుడ్‌న్యూస్
యాక్సిస్ బ్యాంక్ తన వినియోగదారుకు శుభవార్త తెలిపింది. ప్రత్యేక పొదుపు ఖాతాను ప్రారంభించింది. ఇందులో భాగంగా వినియోగదారులు కేవలం నెలకు 150 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని బ్యాంకు తెలిపింది. అంతేకాదు ఖాతా పొందిన తర్వాత అందులో మినిమమ్ బ్యాలెన్స్ కూడా ఉంచాల్సిన అవసరం లేదని యాక్సిస్ బ్యాంకు తెలిపింది. అకౌంట్లో కనీస నిల్వ ఉంచాల్సిన అవసరం లేకుండా ఇతర ఛార్జీల నుంచి మినహాయింపు ఇస్తోంది. అయితే దేశంలో మూడవ అతిపెద్ద ప్రైవేట్ రంగ రుణదాతగా ‘ఇన్ఫినిటీ సేవింగ్స్ ఖాతా’గా నామకరణం చేసింది. దాని కోసం కస్టమర్‌లకు నెలకు రూ.150 లేదా సంవత్సరానికి ఒకేసారి రూ.1,650 చెల్లించిన సరిపోతుందని బ్యాంకు వెల్లడించింది.ఈ అకౌంట్ తీసుకున్న వినియోగదారులు ఎస్‌ఎంఎస్ ఛార్జీలు గానీ, ఇతర ఛార్జీలు ఏమి ఉండవని తెలిపింది. ప్రస్తుతం ఏ బ్యాంకు అకౌంట్ తీసుకున్నా అందులో నెలవారీగా కనీస బ్యాలెన్స్ మెయింటెన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అకౌంట్లో కనీస నిల్వ లేనట్లయితే భారీగా పెనాల్టీ ఛార్జీలు విధిస్తోంది. ఎస్‌ఎంఎస్ అలర్ట్‌తో పాటు పాస్‌బుక్ ప్రింటింగ్ మొదలైన సేవల కోసంఛార్జ్ చేస్తారు.ఇలాంటి సమయంలో యాక్సిస్ బ్యాంకు కేవలం 150లతోనే ఖాతా తీసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఫినో పేమెంట్స్ బ్యాంక్ వంటి కొన్ని ప్లేయర్‌లు, కొత్త ఖాతాతో Axis బ్యాంక్ పరిచయం చేస్తున్న వార్షిక ఖాతా నిర్వహణ రుసుమును వసూలు చేస్తారు. అయితే ప్రస్తుతం డిజిటల్ అకౌంట్లను వినియోగించుకుంటున్నారు. అలాంటి వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు యాక్సిస్ బ్యాంక్, గ్రూప్ ఎగ్జిక్యూటివ్ అండ్ హెడ్ రవి నారాయణన్ పేర్కొన్నారు.అలాగే కస్టమర్‌కు అవసరమైనన్ని సార్లు ఏటీఎంలలో ఉపయోగించగల ఉచిత డెబిట్ కార్డ్‌లను కూడా అందిస్తుంది. చెక్ బుక్ వినియోగం, పరిమితుల కంటే ఎక్కువ లావాదేవీలు, ఉపసంహరణలపై ఎలాంటి ఛార్జీలు ఉండవని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. యాక్సిస్ బ్యాంకు అందించే పొదుపు ఖాతాను సులభంగా తీసుకునే అవకాశం పొందవచ్చు. ఈ రోజుల్లో అకౌంట్ తీసుకున్నట్లయితే ప్రాంతాల వారీగా ఖాతాల్లో డబ్బు నిల్వ ఉంచాల్సిన అవసరం ఉంటుంది. ఏరియాను బట్టి ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాల్సి ఉంటుంది. దీంతో యాక్సిస్ బ్యాంకు అందించే ఈ ప్రత్యేక పొదుపు ఖాతాలో కనీస నిల్వ ఇబ్బందులు లేకుండా ఖాతాను పొందవచ్చు. ఇప్పటికే అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ కారణంగా కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నాయి బ్యాంకులు. బ్యాంకులు ఈ మినిమమ్ బ్యాలెన్స్ లేని కారణంగా ఎంత వసూలు చేశాయన్నది కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల నివేదికలు విడుదల చేసింది.
* సరికొత్త డిజైన్‌తో భారత్‌లో ఆస్టన్ మార్టిన్ కొత్త కారు
దిగ్గజ కార్ల సంస్థ ఆస్టన్ మార్టిన్ కొత్తగా ఇండియాలో లగ్జరీ కారును విడుదల చేయనుంది. ఈ మోడల్ పేరు ‘ఆస్టన్ మార్టిన్ DB12’. ఇది ఇంతకుముందు ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన దేశాల్లో విడుదల అయింది. ఇప్పుడు సెప్టెంబర్ 29న భారత్‌లో అడుగుపెట్టనుంది. ముందస్తు బుకింగ్ తరువాత కారు డెలివరీలు 2023 చివర్లో ఉంటాయని సమాచారం. దీని ఇంటీరియర్, ఎక్స్టీరియర్ డిజైన్ సరికొత్తగా ఉంటుంది.ఆస్టన్ మార్టిన్ DB12 కారు 4.0-లీటర్, ట్విన్-టర్బో ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది 680hp పవర్, 800Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అందించారు. DB12 కేవలం 3.6 సెకన్లలో 0-100 kph వేగాన్ని అందుకోగలదు. కారు గరిష్ట వేగం గంటకు 325 కి.మీ. కారు లోపల 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఉన్నాయి. కనెక్టివిటీ కోసం Apple Carplay, Android Auto, 4G కనెక్టివిటీ, ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్‌లు ఉన్నాయి. కారులో ఐదు డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి. అవి వెట్, ఇండివిజువల్, GT, స్పోర్ట్, స్పోర్ట్+ మోడ్‌లు. భారత్‌లో దీని ధర రూ. 4.80 కోట్లు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా.
* రాఖీ పండుగ ముందు బంగారం ధరలకు రెక్కలు
బంగారం ధరలు మళ్లీ రూ.60 వేలకు చేరువయ్యాయి. మంగళవారం 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి రేటు సోమవారంతో పోల్చితే రూ.250 ఎగిసింది. ఢిల్లీలో రూ.59,800ని తాకింది. 22 క్యారెట్ తులం ధర కూడా రూ.230 పెరిగి రూ.54,830గా ఉన్నది. హైదరాబాద్ మార్కెట్‌లోనూ ఇంచుమించు ఇదే స్థాయిలో పెరుగుదల ఉండగా.. 24 క్యారెట్ 10 గ్రాములు రూ.270 ఎగిసి రూ.59,670, 22 క్యారెట్ రూ.250 పెరిగి రూ.54,700 పలికాయి.ఇక ఢిల్లీలో కిలో వెండి ధర రూ.600 పుంజుకొని రూ.77,100గా నమోదైంది. హైదరాబాద్‌లో మాత్రం రూ.80,000 వద్ద స్థిరంగా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్ విషయానికొస్తే.. ఔన్సు గోల్డ్ రేటు 1,924 డాలర్లు, సిల్వర్ 24.25 డాలర్లుగా ఉన్నాయి. కాగా, ఈ పండుగ సీజన్‌లో ధరలు మరింతగా పెరుగుతాయన్న అంచనాలు మార్కెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
* ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్
ప్రస్తుత రోజుల్లో అందరి జీవితం ఉరుకుల పరుగుల మీద నడుస్తోంది. దాంతో చాలా మంది చిన్న పనికి కూడా మెషీన్స్ మీద అదరపడుతున్నారు. ఇక వాషింగ్ మిషన్స్ అయితే నిత్యావసర వస్తువుగా మారాయి. బట్టలు ఉతికే పనిని తగ్గించుకోవడం కోసం దాదాపుగా అందరూ వాషింగ్ మిషన్ వాడుతున్నారు. అయితే వాషింగ్ మిషన్ చాలా ధర ఉంటుందని చాలా మంది అనుకుంటారు. తక్కువ ధరకే మార్కెట్లో వాషింగ్ మిషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ-కామర్స్ సంస్థలు వాషింగ్ మిషన్‌లపై బంపర్ ఆఫర్‌లు ప్రకటిస్తున్నాయి. దాంతో తక్కువ ధరకే వాషింగ్ మిషన్ కొనేసుకోవచ్చు. మీరు కూడా వాషింగ్ మిషన్ కొనాలని ప్లాన్ చేస్తే.. ఇదే మంచి సమయం. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’లో తక్కువ ధరకే బెస్ట్ వాషింగ్ మిషన్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ‘మాన్‌సూన్ డేస్ సేల్’ కొనసాగుతోంది. ఈ సేల్‌లో ఎల్‌జీ 7కేజీ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ ను రూ. 29,990కి కొనేసుకోవచ్చు. ఈ వాషింగ్ మెషిన్ అసలు ధర రూ. 43,990 ఉండగా.. మాన్‌సూన్ డేస్ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ 31 శాతం తగ్గింపు అందిస్తోంది. అంటే మీరు రూ. 14 వేలు ఆదా చేసుకోవచ్చు. తగ్గింపు ఆఫర్ మాత్రమే కాదు.. బ్యాంకు ఆఫర్స్ కూడా ఉన్నాయి.మరోవైపు ఎల్‌జీ 8 కేజీ వాషింగ్ మిషన్‌పై కూడా ఫ్లిప్‌కార్ట్ 33 శాతం తగ్గింపు అందిస్తోంది. ఈ వాషింగ్ మిషన్ అసలు ధర రూ. 29,990 కాగా.. ఆఫర్ అనంతరం రూ. 19,990కి అందుబాటులో ఉంటుంది. అంటే మీరు రూ. 10 వేలు ఆదా చేసుకోవచ్చు. ఈ వాషింగ్ మిషన్‌పై బ్యాంకు ఆఫర్స్ కూడా ఉన్నాయి. దాంతో ధర మరింత తగ్గనుంది.
* ప్రముఖ డిజిటల్ సేమెంట్స్ యాప్ ఫోన్-పే కొత్త యాప్‌ను లాంచ్
ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్-పే (PhonePe) స్టాక్ మార్కెట్ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు కేవలం యూపీఐ లావాదేవీలకే పరిమితమైన ఈ సంస్థ ఇకపై స్టాక్ మార్కెట్ రంగంలోనూ రాణించాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్టాక్ మార్కెట్ మదుపరుల కోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించింది. షేర్.మార్కెట్ (Share.Market) పేరిట కొత్త యాప్‌ను ప్రారంభించింది. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌తో పాటూ ఈటీఎఫ్‌లు (ఎక్స్ఛేంజ్ ట్రేడెట్ ఫండ్స్) వంటి సేవల్ని అందించనుంది.ఇప్పటికే బీమా పాలసీలను అందించటంతో పాటూ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి ఫోన్‌పే యాప్ వినియోగదారులకు వేదికగా ఉంది. ‘నాలుగేళ్ల క్రితమే మ్యూచువల్ ఫండ్ రంగంలో అడుగుపెట్టాం. రుణాలు, బీమా, చెల్లింపులను ఇటీవలనే తీసుకొచ్చాం. ఇప్పుడు స్టాక్ బ్రోకరేజ్ వ్యాపారంలో అడుగుపెట్టాం’ అని ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్ తెలిపారు.
* నేడు పెట్రోల్ డీజిల్ ధరలు
గతంతో పోల్చితే క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పటికి మన దేశంలో ఇంధన ధరలు మాత్రం తగ్గలేదు. గత కొంత కాలం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఈ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన మారుతుంటాయి. ప్రస్తుతం హైద్రాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ. 109 గా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 97గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ప్యూయల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధర రూ. 109.66,లీటర్ డీజిల్ ధర రూ. 98.31.విశాఖపట్నం:లీటర్ పెట్రోల్ ధర రూ. 110.48,లీటర్ డీజిల్ ధర రూ. 98,విజయవాడ:లీటర్ పెట్రోల్ ధర రూ. 111. 76,లీటర్ డీజిల్ ధర రూ. 99
* భారత్ పాకిస్తాన్ మ్యాచ్‌కు ఫుల్ డిమాండ్
నేటి నుంచే ఆసియా కప్ పోరు ప్రారంభం కానుంది. టీమిండియా ప్లేయర్లు ఆసియాకప్ కొట్టేందుకు సిద్ధమయ్యారు. గత ఆరు రోజులుగా బెంగళూరు శివారులోని ఆలూర్ క్యాంప్ లో నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లలో 17 మంది ప్లేయర్లు పాల్గొన్నారు. శిక్షణ శిబిరం నిన్నటితోనే ముగిసింది. ఇక ఇవాళ భారత జట్టు.. శ్రీలంక కు బయలుదేరనుంది.అయితే ఆసియా కప్-2023తో డిస్నీ హాట్ స్టార్ కు రూ. 350 కోట్ల నుంచి రూ. 400 కోట్ల వరకు యాడ్ రెవెన్యూ రానుంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం 10 సెకన్ల యాడ్ కాస్ట్ రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ కాకుండా ఇతర జట్టు ఆడే మ్యాచ్ లకు రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలు మాత్రమే ఉన్నట్లు సమాచారం. దీన్ని బట్టి భారత్-పాక్ మ్యాచ్ కు ఎంత క్రేజ్ ఉందో తెలుస్తోంది. టోర్నీని ఫ్రీగా వీక్షించవచ్చు.
* ప్రపంచంలోనే తొలి ఫ్లెక్స్‌ఫ్యూయల్ కారు
దేశంలో ఇథనాల్‌కు గిరాకీ పెరుగుతుందని, ఈ పరిణామం వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో మార్పునకు దోహదం చేస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. తద్వారా మన రైతులు కేవలం ‘అన్నదాత’గానే కాదు ‘ఇంధనదాత’గానూ అవుతారని పేర్కొన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి బీఎస్-6 (స్టేజ్ 2) ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఆధారిత కారును మంగళవారం ఆయన ఆవిష్కరించారు. పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపడాన్ని ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికతగా వ్యవహరిస్తారు. ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహన నమూనాను ఇన్నోవా హైక్రాస్ మోడల్‌పై టయోటా కిర్లోస్కర్ అభివృద్ధి చేసింది. భారత్‌లోని అత్యుత్తమ ఉద్గార ప్రమాణాలకు తగ్గట్లుగా దీనిని రూపొందించింది. 20 శాతానికి మించి కలిపిన ఇథనాల్‌తోనూ ఈ కారు నడవగలదు. ‘ఈ సాంకేతికతను అభివృద్ధి చేసినందుకు గాను టయోటా కిర్లోస్కర్ యాజమాన్యానికి ధన్యవాదాలు. దేశంలో కాలుష్యం తగ్గేందుకు కాదు.. వ్యవసాయ రంగంలో ఉద్యోగావకాశాల సృష్టికి ఇది దోహదం చేస్తుంది. ఫ్లెక్స్ ఇంజిన్‌లపై మరిన్ని మోడళ్లను తయారు చేయాలని కోరుతున్నాం. మోటార్ సైకిళ్లు, ఆటోలు, ఇ-రిక్షాలు, కార్లు 100% ఇథనాల్ వాహనాలుగా మారాలని నేను కోరుకుంటున్నాన’ని గడ్కరీ తెలిపారు. ఇథనాల్‌కు గిరాకీ పెరిగితే.. జీడీపీలో వ్యవసాయ రంగ వాటా 20 శాతానికి పెరుగుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
* 397కే 150 రోజుల వ్యాలిడిటీ
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తమ కస్టమర్లను ఆకర్షించడానికి నిత్యం సరికొత్త ప్లాన్‌లను అందిస్తూనే ఉంది. ప్రస్తుతం టెలికాం రంగంను ఏలుతున్న ఎయిర్‌టెల్, జియోలకు దీటుగా బీఎస్ఎన్ఎల్ ఆఫర్లను ప్రకటిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే మరో సూపర్ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ. 397తో 150 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. సుదీర్ఘ వ్యాలిడిటీ కోరుకునే వారికి ఈ ప్లాన్ బాగా నచ్చుతుంది.తన కస్టమర్ల కోసం బీఎస్ఎన్ఎల్ రూ. 397 బెస్ట్ ప్లాన్‌ను తాజాగా తీసుకువచ్చింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 150 రోజులు. అంటే 5 నెలలు. ఈ ప్లాన్‌లో కస్టమర్‌లకు ప్రతిరోజు 2GB డేటా, అపరిమిత వాయిస్ కాల్‌లు, ప్రతిరోజూ 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు లభిస్తాయి. అయితే ఈ ప్రయోజనాలు కేవలం 30 రోజులు మాత్రమే ఉంటాయి. అయితే ఈ రీఛార్జ్ వాలిడిటీ మాత్రం 150 రోజుల పాటు కొనసాగుతుంది. ఇంత తక్కువ ధరలో ఇంత చెల్లుబాటు ప్లాన్ మరేదాంట్లో లేదనే చెప్పాలి.రెండు సిమ్‌లు వాడుతున్న వారికి బీఎస్ఎన్ఎల్ రూ. 397 ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది. సెకండ్ సిమ్ వ్యాలిడిటీని ఎక్కువకాలం పొడిగించుకోవడం కోసం ఈ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. లేదా ఎక్కువ డేటా, కాలింగ్ అవసరం లేకపోతే.. మీరు ఈ ప్లాన్‌ని యాక్టివేట్ చేయవచ్చు. 150 రోజుల వ్యాలిడిటీ కోసం బీఎస్‌ఎన్‌ఎల్ కంటే ఇతర టెలికాం సంస్థల రీఛార్జ్ ఎక్కువగానే ఉన్నాయి.