కెనడాలోని టొరంటోకు చెందిన గుంటూరు జిల్లా తెనాలి ప్రవాసాంధ్ర ప్రముఖుడు, తానా వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన వెలువోలు బసవయ్య(91) బుధవారం సాయంకాలం కన్నుమూశారు. ఆయన తండ్రి వెలువోలు సీతారామయ్య ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు. తెనాలిలోని VSR-NVR కళాశాల వెలువోలు సీతారామయ్య పేరుమీదుగా ఏర్పాటు చేయబడింది. ఆయన కుటుంబ సభ్యులు టొరంటో చేరుకున్నారు. తానాతో పాటు, కెనడాలోని పలు ప్రవాస తెలుగు సంఘాల వ్యవస్థాపక సభ్యునిగా బసవయ్య పేరుగాంచారు. ఆయన మృతి పట్ల ప్రవాస తెలుగు సంఘాల ప్రతినిధులు తమ సంతాపాన్ని వెలిబుచ్చారు. 1977 మే 27-28 మధ్య న్యూయార్క్‌లో నిర్వహించిన “తానా” తొలి వ్యవస్థాపక సభకు కెనడా నుండి బసవయ్య ప్రాతినిధ్యం వహించారు.
* యార్లగడ్డ సంతాపం
రాజ్యసభ మాజీ సభ్యులు, కెనడాలో భారత తొలి సాంస్కృతిక రాయబారిగా సేవలందించిన డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ బసవయ్య మృతి పట్ల తన సంతాపాన్ని ప్రకటించారు. బసవయ్య కుటుంబంతో తమ కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉన్నదని, తెలుగు వారి సంస్కృతిని ఖండాంతరాలు దాటించి ఉత్తర అమెరికాలో దాని పరివ్యాప్తికి కృషి చేసిన బసవయ్య చిరస్మరణీయులని అంజలి ఘటించారు. రెండు నెలల కిందట తన కెనడా పర్యటనలో భాగంగా బసవయ్య దంపతులను కలుసుకున్నట్లు ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ వారాంతం కెనడాలో నిర్వహించే బసవయ్య అంత్యక్రియల్లో ఆయన పాల్గొంటారు.