హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల ధరలు జూన్ త్రైమాసికంలో 6.9 శాతం పెరిగినట్టు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) విడుదల చేసిన ‘హౌసింగ్ ప్రెస్ ఇండెక్స్’ డేటా తెలియజేస్తోంది. దేశవ్యాప్తంగా 43 పట్టణాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కరోనా ముందు నాటితో పోలిస్తే గృహ రుణాల రేట్లు ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయని, దీంతో ఇళ్ల ధరల అందుబాటు ఆరోగ్యకర స్థాయిలో ఉన్నట్టు ఎన్‌హెచ్‌బీ నివేదిక తెలిపింది. అహ్మదాబాద్‌లో ఇళ్ల ధరలు 9.1 శాతం పెరగ్గా, బెంగళూరులో 8.9 శాతం, కోల్‌కతాలో 7.8 శాతం చొప్పున ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఎగిశాయి. చెన్నైలో 1.1 శాతం, ఢిల్లీలో 0.8 శాతం, ముంబైలో 2.9 శాతం, పుణేలో 6.1 శాతం చొప్పున ఇళ్ల ధరలు పెరిగాయి. ఎన్‌హెచ్‌బీ హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ 50 పట్టణాల్లోని ప్రాపర్టీల విలువల సమాచారాన్ని బ్యాంక్‌లు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి తీసుకుని ప్రతి త్రైమాసికానికి నివేదిక విడుదల చేస్తుంటుంది. మొత్తం మీద 50 పట్టణాల్లో ఇళ్ల ధరలు జూన్ క్వార్టర్లో, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు 4.8 శాతం వృద్ధి చెందాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇళ్ల రేట్ల పెరుగుదల 7 శాతంగా ఉండడం గమనార్హం. ఇక ఈ ఏడాది మార్చి త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు 50 పట్టణాల్లో ఇళ్ల ధరలు 0.7 శాతం పెరిగాయి. 2021 జూన్ నుంచి ప్రతీ త్రైమాసికంలోనూ ఇళ్ల ధరల సూచీ పెరుగుతూ వస్తోందని ఎన్‌హెచ్‌బీ నివేదిక వెల్లడించింది.
హైదరాబాద్‌లో 6.9% పెరిగిన ఇళ్ల ధరలు
Related tags :