మరోసారి బీసీసీఐ పంట పండనుంది. ఈ క్రికెట్ బోర్డుపై కాసుల వర్షం కురవబోతుంది. సెప్టెంబర్ 2023 నుంచి మార్చి 2028 వరకు అయిదేళ్ల కాలానికి సంబంధించి భారత ద్వైపాక్షిక సిరీస్‌ల ప్రసార హక్కుల ఈ- వేలం గురువారం జరుగనుంది. ఈ హక్కుల కోసం డిస్నీ స్టార్, సోనీ, వయాకామ్18 పోటీలో ఉన్నాయి. ఈ ముక్కోణపు పోటీ కారణంగా మ్యాచ్‌కు కనీసం రూ.60 కోట్ల ధర పలుకుతుందని బీసీసీఐ భావిస్తోంది. కానీ అది రూ.100 కోట్లకు చేరినా ఆశ్చర్యపోనవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే డిస్నీ స్టార్, సోనీ, వయాకామ్18 సాంకేతిక బిడ్లు దాఖలు చేశాయి. డిజిటల్, టీవీ హక్కులకు వేర్వేరుగా బీసీసీఐ వేలం నిర్వహించనుంది. దీని కోసం వరుసగా మ్యాచ్‌కు టీవీకి రూ.20 కోట్లు, డిజిటల్‌కు 25 కోట్ల నుంచి వేలం ప్రారంభం కానుంది. కానీ ఒక్కో మ్యాచ్‌కు రూ.60 కోట్లకు చేరకపోతే ఈ వేలం చెల్లదని బీసీసీఐ ప్రకటించనున్నట్లు తెలిసింది. ఐపీఎల్ డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న వయాకామ్18 ఇప్పుడు భారత జట్టు డిజిటల్ హక్కులపైనా కన్నేసింది. ఇక టీవీ ప్రసార హక్కుల కోసం డిస్నీ స్టార్, సోనీ పోటాపోటీగా తలపడే అవకాశముంది. ఈ అయిదేళ్లలో ద్వైపాక్షిక సిరీస్‌ల్లో టీమ్‌ఇండియా 25 టెస్టులు, 27 వన్డేలు, 36 టీ20లు ఆడనుంది.
పాక్ అసాధారణ జట్టు: అశ్విన్
చెన్నై: ఆసియా కప్‌లో పాకిస్థాన్ అసాధారణ జట్టుగా కనిపిస్తుందని టీమ్‌ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. బాబర్ అజాం, మహ్మద్ రిజ్వాన్‌ల నిలకడ ప్రదర్శన ఆ జట్టును మరింత ప్రమాదకరంగా మారుస్తుందని తెలిపాడు. ‘‘బాబర్, రిజ్వాన్ బ్యాటుతో నిలకడగా రాణిస్తే ఆసియా, ప్రపంచకప్‌లలో పాక్ ప్రమాదకర జట్లలో ఒకటిగా తయారవుతుంది. ఆ జట్టులో లోతు ఎక్కువ. పాకిస్థాన్ అసాధారణ క్రికెటర్లను తయారు చేస్తుంది. టేప్ బాల్ క్రికెట్‌తో అద్భుతమైన పేసర్ల సమూహాన్ని అందిస్తుంది. 1990, 2000లలో వారి బ్యాటింగ్ అత్యుత్తమంగా ఉంది’’ అని అశ్విన్ పేర్కొన్నాడు.