అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ధ్వజమెత్తారు. పనికిమాలిన అధ్యక్షుడంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. బైడెన్‌కు పిచ్చి పట్టిందని.. ఆ పిచ్చి అమెరికాను మూడో ప్రపంచ యుద్ధం వైపు అడుగులేయించినా ఆశ్చర్యపోనక్కర్లేదని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఓ వీడియో సందేశం ట్రంప్ విడుదల చేశారు.
‘‘కీలక దర్యాప్తు సంస్థల విషయంలో.. ఆయుధాల సమీకరణలో బైడెన్ చర్యలు అమెరికా భవిష్యత్తును ప్రమాదంలో పడేసివిగా ఉన్నాయి. దేశానికి రక్షణ కవచంలా ఉండే సరిహద్దు విషయంలో బైడెన్ ఎంతో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. గోడ లేకపోతే దేశం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఆయన మానసిక స్థితి ద్వారా విపత్తు సంభవించొచ్చు. ఆయనకు మతి భ్రమించింది. ఆయన అనాలోచిత నిర్ణయాలు, చేష్టలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చు’’ అని పేర్కొన్నారు.రిపబ్లికన్ పార్టీ తరపున 2024 అధ్యక్ష బరిలో నిల్చునే ప్రయత్నంలో ఉన్న మాజీ అధ్యక్షుడు ట్రంప్.. తీవ్రస్థాయిలో బైడెన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో ఆయన కోర్టు కేసులతో చిక్కుల్లో పడుతున్నారు కూడా. అయితే ట్రంప్ విమర్శలను అంతే తేలికగా తీసుకుంటున్న అధ్యక్షుడు బైడెన్.. వెటకారంగా స్పందిస్తున్నారు కూడా.