ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) కొత్త తరం బుల్లెట్ 350ని (Bullet 350) భారత మార్కెట్లోకి లాంచ్ చేయబోతోంది. సెప్టెంబర్ 1న ఈ మోటార్ సైకిల్‌ను తీసుకురాబోతోంది. ఈ కేటగిరీలో ప్రస్తుతం హంటర్ 350, క్లాసిక్ 350 మోటార్‌సైకిళ్లను రాయల్ ఎన్ఫీల్డ్ విక్రయిస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని మార్పులతో బుల్లెట్ 350నీ తీసుకొస్తోంది. ఇందులో జె-సిరీస్ ఇంజిన్‌ను అమర్చనున్నట్లు తెలుస్తోంది.కొత్త బుల్లెట్లో 350సీసీ ఇంజిన్ అమర్చనున్నారని తెలుస్తోంది. ఈ మోటార్ సైకిల్ ధర రూ.1.5 లక్షలు ఉండొచ్చన్నది అంచనా. 5 స్పీడ్గేర్ బాక్స్ ఉండనుంది. దీంతో పాటు అధునాతన ఫీచర్లతో ఇన్సుట్రుమెంట్ కన్సోల్, ఛార్జింగ్‌కు వీలుగా యూఎస్బీ పోర్ట్ ఇస్తారని తెలుస్తోంది. దీంతో పాటు స్విచ్ గేర్‌లో కూడా మార్పులు చేస్తారని సమాచారం. పూర్తి వివరాలు తెలియాలంటే లాంచింగ్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది.
బుల్లెట్ 350 లాంచింగ్ వేళ.. మరో మూడు బైకులను కూడా రాయల్ ఎన్ఫీల్డ్ తన వెబ్సైట్లో టీజ్ చేస్తోంది. అందులో బుల్లెట్ 500, బుల్లెట్ ఎలక్ట్రా, బుల్లెట్ సిక్స్టీ 5 ఉన్నాయి. ఈ మూడు మోటార్‌సైకిళ్లను పునరుద్ధరించి తిరిగి తీసుకురావొచ్చని తెలుస్తోంది. వీటిలో జె-సిరీస్ ఇంజిన్లను అమర్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందులో బుల్లెట్ 500 మోడల్‌ను బీఎస్-6 అనుగుణంగా లేని కారణంగా 2020లోనే కంపెనీ నిలిపివేసింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం అందుబాటులో ఉంది.