Sports

నేపాల్‌ పై పాక్‌ విజయం

నేపాల్‌ పై పాక్‌ విజయం

ఆసియా కప్‌ 2023 ఆరంభ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ అదరగొట్టింది. ముల్తాన్ వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ 238 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌.. నిర్ణీత 50ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ బాబర్ అజామ్ (151; 131 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) భారీ శతకంతో విరుచుపడ్డాడు. మిడిల్ ఆర్డర్‌ బ్యాటర్‌ ఇఫ్తికార్ అహ్మద్ (109; 71 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు శతకం బాదాడు. తొలిసారి ఆసియా కప్‌ ఆడుతున్న నేపాల్ లక్ష్య ఛేదనలో పాక్ బౌలర్ల ధాటికి విలవిల్లాడింది. 104 పరుగులకే ఆలౌటై తొలి మ్యాచ్‌లోనే ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆరిఫ్ షేక్ (26), సోంపాల్ కామి (28), గుల్సన్ ఝా (13) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. షాదాబ్ ఖాన్‌ (4/27), షాహీన్ అఫ్రిది (2/27), హారిస్‌ రవూఫ్‌ (2/16) నేపాల్‌ పతనాన్ని శాసించారు.

తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌.. 25 పరుగులకే రెండు వికెట్లు కోల్పోగా.. బాబర్ అజామ్‌.. రిజ్వాన్ (44)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. రిజ్వాన్, సాల్మన్ (5) ఔటైన తర్వాత ఇఫ్తికార్‌ అహ్మద్‌తో జతకట్టాడు బాబర్‌. వీరిద్దరూ చెలరేగి ఆడటంతో పాక్ భారీ స్కోరు సాధించింది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 214 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇప్పటివరకు జరిగిన ఆసియా కప్‌లో ఏ వికెట్‌కైనా మూడో అత్యధిక భాగస్వామ్యం ఇదే కావడం విశేషం.