దేశ ప్రజలకు రక్షాబంధన్ గిప్ట్ అందించిన కేంద సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకోనుందా అంటే.. అవుననే అంటున్నాయి తాజా రిపోర్టులు. 2024 ఎన్నికలకు ముందు కేంద్రం మోటార్ ఇంధన ధరలపై దృష్టి పెట్టే అవకాముందని సిటీ గ్రూప్ నివేదించింది. ఎల్‌పీజీ సిలిండర్ల రేటును తగ్గించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ద్రవ్యోల్బణం దాదాపు 30 బేసిస్ పాయింట్ల మేర తగ్గనుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఈ క్రమంలో మరో కీలకమైన పెట్రోల్, డీజిల్ ధరలను కూడా తగ్గించే దేశ ప్రజలకు ఊరట కల్పించనుందని అంచనా వేస్తున్నారు.
వంట గ్యాస్ ధరల్ని తగ్గిస్తూ మోదీ సర్కార్ నిర్ణయం ద్రవ్యోల్బణాని చెక్ పెట్టడమేకాకుండా, కొన్ని ప్రధాన పండుగలు, కీలక ఎన్నికలకు ముందు గ్యాసోలిన్, డీజిల్ ధరల తగ్గింపు వైపు దృష్టి సారించనుందని సిటీ గ్రూప్ తన కథనంలో పేర్కొంది. ఎల్‌పీజీ తగ్గింపుతో ద్రవ్యోల్బణం దిగి వస్తుందని ఆర్థికవేత్తలు సమీరన్ చక్రవర్తి, ఎం. జైదీ అభిప్రాయపడ్డారు. అంతేకాదు టొమాటో ధరల తగ్గుదల, తాజా చర్యతో సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం 6శాతం దిగువకు చేరే అవకాశం ఉందన్నారు.
జులైలో 15 నెలల గరిష్ట స్థాయికి చేరిన రిటైల్ ధరలను చల్లబరచడానికి అధికారులు చురుకైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను 14.2 కిలోగ్రాముల గ్యాస్‌ను 200 రూపాయలు తగ్గింపుతో దాదాపు 300 మిలియన్ల వినియోగ దారులకు కొంత ఉపశమనం కలిగించింది. ఆహార ధరలను తగ్గించడానికి గృహ బడ్జెట్‌లను అదుపులో ఉంచడానికి భారతదేశం ఇప్పటికే బియ్యం, గోధుమలు , ఉల్లిపాయలు వంటి ప్రధాన వస్తువుల ఎగుమతులను కఠినతరం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఒత్తిడితోపాటు, కే- ఆకారపు రికవరీ నేపథ్యంలో, గ్యాస్ ధర తగ్గింపు వినియోగదారుల సెంటిమెంట్‌కు సానుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా సెప్టెంబర్‌లో డిమాండ్-సరఫరా కొరత కారణంగా ఉల్లి ధర పెరుగుతుందన్న అంచనాలను గమనించాలన్నారు.అలాగే గ్లోబల్ క్రూడ్ ధరలలో అస్థిరత ఉన్నప్పటికీ, గత ఏడాదినుంచి పెట్రోలు, డీజిల్ ధరలు పెరగలేదనీ, ఈ నేపథ్యంలో ఎక్సైజ్ డ్యూటీ కోతద్వారా ఇంధన ధరలను తగ్గించవచ్చని, ఎన్నికల ముందు ఈ అంశాన్ని తోసి పుచ్చలేమని వ్యాఖ్యానించారు.
కాగా తెలంగాణ, మిజోరం రాజస్థాన్, మధ్యప్రదేశ్ ,ఛత్తీస్‌గఢ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఈ ఏడాది చివరల్లో జరగ నున్నాయి. ఆ తర్వాత 2024 ప్రారంభంలో జాతీయ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కేంద్రంలో మరోసారి అధికారాన్ని చేజిక్కించు కోవాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.